rains: రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Heavy Rains in Telugu States: మండే ఎండల్లో మరోసారి వాతావరణం కూలెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు మొదలయ్యాయి. ఈ మూడ్రోజులు (సోమ, మంగళ, బుధవారాల్లో) తెలంగాణలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట నల్గొండ, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీచేరిసింది వాతావరణ శాఖ.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమయ్యింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలంగాణలోనే కాదు నాలుగు రోజులపాటు ఏపీలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయి... ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని హెచ్చరించారు.
ఇక భారత వాతావరణ శాఖ (IMD) కూడా దేశవ్యాప్తంగా మరిన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, యానాం, కేరళ, మాహే ప్రాంతాల్లో ఏప్రిల్ 7, 8 తేదీల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని తెలిపింది.
కర్ణాటకలో ఏప్రిల్ 9 వరకు, తూర్పు, ఈశాన్య భారతదేశంలో ఏప్రిల్ 11 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ 8న అస్సాం, మేఘాలయ, బీహార్ రాష్ట్రాల్లో, ఏప్రిల్ 9న జార్ఖండ్ రాష్ట్రంలో వడగళ్ల వాన పడే అవకాశం ఉంది. ఏప్రిల్ 7, 8 తేదీల్లో తమిళనాడు, కేరళ, మాహే ప్రాంతాల్లో, ఏప్రిల్ 8న అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
భారత వాతావరణ శాఖ ప్రకారం రాబోయే 3 రోజుల్లో వాయువ్య భారతదేశం, మధ్య భారతదేశం, మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతల్లో మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.