బ్రాహ్మణ యువకుల కోసం ‘కన్యాశుల్కం’ పథకం

First Published Dec 10, 2017, 9:26 AM IST
Highlights
  • వివాహ వ్యవస్ధలో ఎప్పుడో దశాబ్దాల క్రితం రూపుమాసిపోయిన ‘కన్యాశులక్కం’ విధానం మళ్ళీ ఊపిరిపోసుకుంటోంది.

అనుకున్నంతా జరుగుతోంది. వివాహ వ్యవస్ధలో ఎప్పుడో దశాబ్దాల క్రితం రూపుమాసిపోయిన ‘కన్యాశులక్కం’ విధానం మళ్ళీ ఊపిరిపోసుకుంటోంది. అసలు కన్యాశుల్కం అంటే అర్ధం తెలుసా? పెళ్లికొడుకు తరపు వాళ్ళు  పెళ్ళికూతురుకు ‘ఎదురుకట్న’మిచ్చి వివాహం చేసుకోవటం. సుప్రసిద్ద సామాజిక ఉద్యమకారుడు  గురజాడ అప్పరావు ఎప్పుడో ఆ వ్యవస్ధకు వ్యతిరేకంగా పోరాడినట్లు పుస్తకాల్లో చదువుకున్నారు. గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకాన్ని సినిమాగా కూడా తీసారు.

అప్పట్లో అమ్మాయిలు చిన్న పిల్లలుగా ఉన్నపుడే మగవాళ్ళల్లో పెద్ద వయస్సు వారికిచ్చి వివాహం జరిపించేవారు. అమ్మాయినిచ్చి వివాహం జరిపించినందుకు వరుడు తరపు వారు చెల్లించుకునే కట్నాన్నే అప్పట్లో కన్యాశుల్కం అని అనేవారు. గురజాడ రాసిన మరో ప్రసిద్ధ రచన ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ కూడా ఆ కోవలోనిదే.

ఇప్పుడిదంతా ఎందుకంటే, మళ్ళీ కన్యాశుల్కం విధానం అమలులోకి రాబోతోంది. అయితే, ఇపుడు కుటుంబాల మధ్య కాదులేండి. వరుడి తరపున ప్రభుత్వమే కొంత మొత్తాన్ని అమ్మాయికి చెల్లిస్తుంది. అందుకు ప్రభుత్వంలోని ‘బ్రాహ్మణ కార్పొరేషన్’ విధి విధానాలు ఖరారు చేస్తోంది. అంత అవసరం ఏమొచ్చిందంటే, బ్రాహ్మణ కులాల్లోని అబ్బాయిలకు పెళ్ళిల్లు కావటం లేదు. పౌరోహిత్యం, అర్చక వృత్తిలో ఉన్న అబ్బాయిలను వివాహాలు చేసుకునేందుకు అమ్మాయిలెవరూ ముందుకు రావటం లేదట. ఫలితంగా బ్రాహ్మణ కులంలో అమ్మాయిలు దొరక్క, ఇతర కులస్తులను చేసుకోలేక అవస్తలు పడుతున్నారు. దాంతో పై వృత్తుల్లో ఉన్న బ్రాహ్మణ యువకుల్లో అత్యధికులు 40 ఏళ్ళు వచ్చినా అవివాహితులుగానే మిగిలిపోతున్నారు.

వారి బాధలను అర్ధం చేసుకున్న బ్రాహ్యణ కార్పొరేషన్, అబ్బాయిని వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చే అమ్మాయిల పేరుతో ఓ రూ. 50 వేలు బ్యాంకుల్లో వేయాలని నిర్ణయించింది. అయితే ఆ మొత్తం అమ్మాయి చేతికి ఇవ్వరు. అమ్మాయి పేరుతో 5 ఏళ్ళకు ఎఫ్డీ వేస్తారు. ఇప్పట్టికే ఈ పథకం  తెలంగాణాలో అమల్లో ఉంది. అదే పథకాన్ని ఏపిలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నచ్చిన, మెచ్చిన అమ్మాయిలు దొరక్కపోవటమన్న సమస్య అన్నీ కులాల్లోనూ ఉంది. కాకపోతే బ్రాహ్మణ కులంలో అదీ ప్రధానంగా అర్చక, పౌరోహిత్య వృత్తుల్లో ఉన్న వారికి మరింత ఎక్కువగా ఉంది.

click me!