అమిత్ షా తో భేటీ: హోదాతోపాటు వైయస్ జగన్ చిట్టా ఇదీ....

Published : Oct 22, 2019, 02:35 PM ISTUpdated : Oct 22, 2019, 08:00 PM IST
అమిత్ షా తో భేటీ: హోదాతోపాటు వైయస్ జగన్ చిట్టా ఇదీ....

సారాంశం

రాష్ట్ర విభజన పరిశ్రమలు, సేవారంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వీటివాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందని అమిత్ షా కు వివరించారు సీఎం జగన్. ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని మరోసారి వివరించారు. 

న్యూ ఢిల్లీ: రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కోరారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. మంగళవారం న్యూ ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుమారు 45 నిమిషాలపాటు అమిత్ షాతో చర్చించారు. 

విభజన అనంతరం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదని తమకు నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా అనేక సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకువచ్చామని వాటి అమలుకు కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే కేవలం ప్రత్యేకహోదాతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని అమిత్ షా వద్ద ప్రస్తావించారు సీఎం జగన్. 
ప్రత్యేక హోదా, రెవిన్యూలోటు కింద రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలో హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్‌, శ్రీశైలంలకు గోదావరి వరదజలాల తరలింపుపై అమిత్‌షాతో చర్చించారు.  

రాష్ట్ర విభజన పరిశ్రమలు, సేవారంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వీటివాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందని అమిత్ షా కు వివరించారు సీఎం జగన్. 

ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని మరోసారి వివరించారు. చెన్నై, హైదరాబాద్‌, బెంగుళూరు కాకుండా పరిశ్రమలు ఏపీ వైపు చూడాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. 

2014-2015లో రెవిన్యూలోటును కాగ్‌తో సంప్రదించి సవరిస్తామని గతంలో హామీ ఇచ్చారంటూ అమిత్‌షాకు గుర్తుచేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

రాష్ట్ర విభజన సమయంలో రూ.22948.76 కోట్లు రెవిన్యూ లోటుగా ప్రకటించినప్పటికీ ఇంకా రూ.18969.26 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి చెల్లించాల్సి ఉందని హోంమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ నిధులను తక్షణమే విడుదల చేసేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను ఆదేశించాలని కోరారు. 

ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికోసం రాష్ట్ర పునర్విభజన చట్టం పొందుపరిచినట్లు కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంపై ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణ అంశంపై కూడా ప్రస్తావించారు. 

అలాగే విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడర్‌, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులను సమకూర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 

వెనకబడ్డ జిల్లాలకు కేటాయించే నిధుల క్రైటీరియాను మార్చాలని కోరారు. 

ఏపీలో వెనకబడ్డ జిల్లాల్లో తలసరి రూ.400 రూపాయలు ఇస్తే, బుందేల్‌ఖండ్‌, కలహండి ప్రాంతాలకు తలసరి రూ.4000ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇదే తరహాలో ఏపీలోని వెనకబడ్డ జిల్లాలకు ఇవ్వాలని కోరారు. 


ఏపీలో వెనకబడ్డ 7 జిల్లాలకు ఏడాదికి రూ. కోటి చొప్పున ఇప్పటివరకూ రూ.2100కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకూ కేవలం రూ.1050 కోట్లుమాత్రమే ఇచ్చారని, మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదలచేయాలని విజ్ఞప్తి చేశారు. 


పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,548.87 కోట్లకు ఆమోదించాలని అమిత్‌షాకు విజ్ఞప్తిచేశారు. అందులో రూ.33వేలకోట్లు భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌కే ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చారు. 

రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.5,073 కోట్లను వెంటనే విడుదలచేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం రూ.16వేల కోట్లు ఇవ్వాలని వీలైనంత త్వరగా నిధులు ఇచ్చేలా సంబంధిత మంత్రిత్వ శాఖను కోరాలంటూ విజ్ఞప్తి చేశారు.  

పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్‌ ప్రక్రియద్వారా రూ.838 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసిన విషయాన్ని ప్రత్యేకంగా అమిత్ షాకు వివరించారు. హెడ్‌ వర్క్స్‌, హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులో రూ.780 కోట్లు, టన్నెల్‌ పనుల్లో రూ.58 కోట్లు ఆదా అయిన విషయాన్ని ప్రస్తావించారు. 

నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి వరదజలాల తరలింపు అంశాన్ని అమిత్‌షాతో ప్రత్యేకంగా చర్చించారు సీఎం జగన్. కృష్ణానదిలో గడచిన 52 సంవత్సరాల్లో నీటి లభ్యత సగటున ఏడాదికి 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయిందని చెప్పుకొచ్చారు. 

మరోవైపు గోదావరిలో గడచిన 30 సంవత్సరాలుగా సగటున ఏడాదికి 2,780 టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయని వాటిని ఒడిసిపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. 

కృష్ణా జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, కృష్ణాడెల్టా సహా తాగునీరు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాలకు గోదావరి వరదజలాలను నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించే ప్రాజెక్టును చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖలను ఆదేశించాలని కోరారు. దీనివల్ల రాష్ట్రంలోని సాగునీరు, తాగునీరు కొరత ఉన్న ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, ఆ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు అనూహ్యంగా మారతాయని సీఎం జగన్ వివరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

షాతో భేటీ తర్వాత కేంద్రమంత్రులు షాక్: ఢిల్లీ నుంచి వెనుదిరిగిన జగన్

జగన్ పై అమిత్ షా గుస్సా: రెండుసార్లు నో అపాయింట్మెంట్, కానీ

ఢిల్లీలో సీఎం జగన్ బిజీబిజీ: అమిత్ షాతో భేటీ, కీలక అంశాలపై చర్చ

ఢిల్లీకి సీఎం: రాత్రికి హస్తినలోనే జగన్ బస

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu