1581 ఎంపిలు, ఎంఎల్ఏలపై 13 వేల కేసులు

First Published Dec 12, 2017, 5:49 PM IST
Highlights
  • ఎంతో గొప్పగా చెప్పుకునే చట్టసభల్లో నేర చరిత్ర కలిగిన వందలాది మంది ప్రజాప్రతినిధుల తిష్టవేసుకుని కూర్చుంటున్నారు.

నిజంగా సిగ్గు పడాల్సిన విషయం. ఎంతో గొప్పగా చెప్పుకునే చట్టసభల్లో నేర చరిత్ర కలిగిన వందలాది మంది ప్రజాప్రతినిధుల తిష్టవేసుకుని కూర్చుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలు చూస్తే ఎవ్వరైనా సరే నివ్వెరపోవాల్సిందే. రాజకీయాల్లో నేరచరితులపై ఎప్పటి నుండో చర్చలు జరుగుతునే ఉన్నాయి. ఎన్నికలపుడు కొన్ని సామాజిక ఉద్యమ సంస్ధలు పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో నేరచరిత్ర కలిగిన వారి జాబితాను కూడా విడుదల చేస్తుండటం మనందరూ చూస్తున్నదే.

సరే. ప్రస్తుత విషయానికి వస్తే, చట్టసభ ప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను విచారించేందుకు 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అంగీకరించింది. కొంత గడువు ఇస్తే వారిపై ఉన్న కేసుల సమాచారం మొత్తం సేకరించి విచారణను వేగవంతం చేస్తామని మంగళవారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.

2014 వరకు పదవుల్లో  ఉన్న వారే కాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న మొత్తం 1,581మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులు పెండింగ్లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇలా నేర చరిత్ర ఉన్నవారే మళ్లీ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

వీరి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. అదే సమయంలో కేసులు కూడా పరిష్కారం కాకుండా పేరుకుపోతున్నాయి. ఎన్నికల్లో నేరచరితులు పాల్గొనకుండా చూడాలంటే ఎన్నికల కమీషన్ కు కూడా సాధ్యం కావటం లేదు. అందుకే సుప్రింకోర్టు స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చట్టసభల్లోకి నేరచరితులు ప్రవేశించకుండా ఉండాలంటే మార్గమేంటని ?  ఎప్పుడు సూచిస్తారని సుప్రీంకోర్టు కేంద్రానికి సూటిగా ప్రశ్నించింది.

 ఈ నేపథ్యంలోనే మంగళవారం కోర్టుకు కేంద్రం వివరణ ఇచ్చింది. 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయడమే కాకుండా మొత్తం రూ.7.80 కోట్లు కేటాయిస్తామని హమీ ఇచ్చింది. అలాగే, దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు సేకరిస్తామని, అందుకు కొంత సమయం ఇవ్వాలని కోరింది. అలా ఇవ్వడం ద్వారా అసలు ప్రత్యేక కోర్టులు ఎన్ని అవసరం అవుతాయనే విషయంలో కూడా ఒక స్పష్టత వస్తుందని  చెప్పటంతో సుప్రింకోర్టు కూడా అంగీకరించింది.

click me!