వలపు వల విసురుతారు.. న్యూడ్ గా మాట్లాడుతూ.. స్మూత్ గా ముగ్గులోకి దించుతారు. కాస్త టెంప్ట్ అయ్యారా? అంతే సంగతులు.. నిలువు దోపిడీ చేస్తారు. ఇలా ఎంతోమందిని బ్లాక్ మెయిల్ చేసిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ వీడియోల్లో మాట్లాడిన అమ్మాయి ఎవరంటే...  

హైదరాబాద్ :  అభిరుచులు కలిసాయి..  భావాలు ఒకేలా ఉన్నాయి..  ఇంకెందుకు ఆలస్యం.. అవధులు లేని ఆనందం ఆస్వాదిద్దాం.. అంటూ whatsapp call ద్వారా nudeగా మాట్లాడతారు. స్పందిస్తే యాప్ సహాయంతో video తీసి బెదిరిస్తారు. ఈ వ్యవహారాలు నడిపే ఘరానా నేరస్తుల గుట్టురట్టయింది. వాట్స్అప్ కాల్ మాట్లాడుతున్నది అసలు అమ్మాయిలే కాదని హైదరాబాద్ Cyber crime police అధికారులు తేల్చారు. నగ్న వీడియోలతో తనను Blackmail చేస్తున్నారు అంటూ వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాకు వెళ్లారు.

అక్కడ బాధితుల నుంచి లక్షల్లో నగదు బదిలీ చేసుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. పలు రాష్ట్రాలకు చెందిన వారి నుంచి ఆరేడు నెలల్లోనే వీరు రూ. 25 కోట్లు కొల్లగొట్టారని గుర్తించారు. భరత్పూర్ సైబర్ నేరస్తులు ఫేస్బుక్ ద్వారా  ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో యువకులు, వృత్తి నిపుణులను పరిచయం చేసుకుంటారు. ఒకటి రెండు రోజులు ఫేస్బుక్ ద్వారా మాట్లాడిన తర్వాత వారి వాట్సాప్ నెంబర్లను తీసుకుంటారు. ఆ వాట్స్అప్ కాల్ మొదలైన వెంటనే పరిచయం చేసుకున్న యువతి బట్టలన్నీ విప్పేసి నగ్నంగా మారుతుంది.

అయితే ఆమె అసలు యువతినే కాదు.. అదంతా సాంకేతిక మాయాజాలం. ఫోన్ లో అప్పటికే డౌన్లోడ్ చేసుకున్న అశ్లీల వీడియోల్లో ఒకదాన్ని సైబర్ నేరస్తులు బాధితుడికి పంపుతున్నారు. ఆ వీడియోలోని యువతి పెదాల కదలికల అనుగుణంగా వాయిస్ చేంజ్ యాప్ ద్వారా అమ్మాయిలు మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. ఒకటి రెండు రోజులు నగ్న వీడియోల ద్వారా మాట్లాడాక.. మీరు కూడా నగ్నంగా మాట్లాడండి అంటూ కోరతారు. 

బాధితులు వీడియో కాల్ చేయడం మొదలు పెట్టగానే మీ ముఖం కనిపించేలా మాట్లాడండి అంటారు. అలా మాట్లాడడం మొదలు పెట్టగానే.. అవతలి వైపు మాట్లాడుతున్న నిందితుడు మరో కెమెరాతో బాధితుడి మాటలు, వీడియోలను రికార్డు చేస్తారు.  ఆ తర్వాత వీడియోను  బాధితుడికి పంపి  బెదిరించి డబ్బులు గుంజుతున్నారు.

కెమెరాకు చిక్కి విలవిల…

- సైబర్ నేరస్తులు కెమెరాలకు చిక్కిన బాధితులు విలవిలలాడిపోతున్నారు. పరువు పోతుందన్న భయంతో నేరస్తులు చెప్పిన ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు.

- జూబ్లీహిల్స్ లో ఉండే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇటీవల ఫేస్ బుక్ ద్వారా యువతిగా నటించిన సైబర్ నేరస్తుడిని పరిచయం చేసుకున్నాడు. నగ్న వీడియోల ద్వారా సంభాషించాడు. అతడికి చెందిన నగ్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో  ఉంచుతానని రూ. 12 లక్షలు గుంజారు.

- అశోక్ నగర్లో ఉంటున్న ఒక వైద్యుడికి  కొద్ది రోజుల క్రితం నేరుగా వాట్స్అప్ కాల్ వచ్చింది. ఒక యువతి మాట్లాడింది. రెండురోజులు మాట్లాడాక.. దుస్తులు అన్నీ తీసేసి  మాట్లాడమన్నది. కాల్ కట్ చేయగా.. మరొక రోజు కూడా కాల్ చేసి అలాగే కోరింది. ఎవరూ లేరు కదా అని అని అతను నగ్నంగా మారి సంభాషించాడు. ఆ తర్వాత ఆ వీడియోలను అతడికి పంపించారు. వీటన్నింటినీ మీ స్నేహితులకు పంపుతామని బెదిరించారు. దీంతో రూ. 15 లక్షల నగదు బదిలీ చేసినట్లు పోలీసుల ముందు వాపోయాడు.