రెజ్లర్ల పోరాటానికి పెరుగుతున్న మద్దతు.. కోహ్లీ, రోహిత్‌లు స్పందించాలని ఫ్యాన్స్ డిమాండ్
Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలని కోరుతూ దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి మద్దతు పెరుగుతోంది.
భారతీయ జనతా పార్టీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా గడిచిన ఆరు రోజులుగా దేశ రాజధానిలో రెజ్లర్లు సాగిస్తున్న పోరుకు మద్దతు పెరిగింది. దేశవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆటగాళ్లు , మాజీలు వారి పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలని, అతడిపై మేరీ కోమ్ ఆధ్వర్యంలోని కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలని కోరుతూ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.
రెజ్లర్ల పోరాటానికి నేతృత్వం వహిస్తున్న ప్రముఖ క్రీడాకారిణి వినేశ్ ఫోగట్ నిన్న ట్విటర్ లో దేశంలోని క్రీడాకారుల మద్దతు తమకు కావాలని అభ్యర్థించిన నేపథ్యంలో పలువుచరు స్పందించారు. టోక్యో ఒలింపిక్స్ విజేత నీరజ్ చోప్రా, ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా, క్రికెటర్లు కపిల్ దేవ్, హర్భజన్ సింగ్ లు స్పందించారు.
ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రెజ్లర్లు ఇలా రోడ్లమీదకు వచ్చి ధర్నాకు దిగడం బాధాకరమని.. ఇలా ఇంకెప్పుడూ జరుగకూడదని నీరజ్ చోప్రా ట్విటర్ వేదికగా కోరాడు. వారి సమస్యలు పరిష్కారమయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ట్వీట్ లో పేర్కొన్నాడు. అభినవ్ బింద్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కపిల్ దేవ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో రెజ్లర్ల ఫోటోను షేర్ చేస్తూ.. ‘అసలు వీళ్లకు న్యాయం జరుగుతుందా...?’అని ప్రశ్నించాడు. తాజాగా భజ్జీ కూడా ట్విటర్ వేదికగా ‘సాక్షి, వినేశ్ లు భారత్ కు గర్వకారణం. ఇలాంటి రెజ్లర్లు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. వారికి న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నా..’అని మద్దతు ప్రకటించాడు.
కాగా రెజ్లర్ల పోరాటానికి దేశవ్యాప్తంగా క్రీడాకారులు మద్దతు తెలుపుతుంటే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి ఎంఎస్ ధోని సహా ఇతర యాక్టివ్ క్రికెటర్లు వారికి మద్దతు ప్రకటించకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ, రోహిత్, ధోనిలు దీని గురించి మాట్లాడరా..? అని ప్రశ్నిస్తున్నారు. ఆరు రోజలుగా రెజ్లర్లు ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తుంటే వారికి మద్దతు ప్రకటించాల్సిన కనీస బాధ్యత కూడా లేదా..? అని మండిపడుతున్నారు. వాళ్లు డబ్బులు వచ్చేవాటికి మాత్రమే ట్వీట్స్ చేస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కోహ్లీ, రోహిత్, ఇతర క్రికెటర్ల అభిమానులు మాత్రం ఇది చాలా సున్నితమైన అంశమని, దీన్లోకి వారిని లాగొద్దని కోరుతున్నారు.