సారాంశం

FIH Hockey Men’s World Cup 2023: హాకీ అంటే అమితంగా ఇష్టపడే  ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్..  ఈనెల 13 నుంచి  పురుషుల హాకీ ప్రపంచకప్ ఆడనున్న  భారత  హాకీ జట్టుకు  బంపరాఫర్ ఇచ్చారు.  ప్రపంచకప్ నెగ్గి కోటీశ్వరులవండంటూ... 

ఈనెల 13 నుంచి  ఒడిషా వేదికగా పురుషుల హాకీ ప్రపంచకప్ జరుగనున్నది.  వరుసగా రెండోసారి  ఒడిషాలోనే జరుగుతున్న  ప్రపంచకప్ ను దక్కించుకునేందుకు  భారత హాకీ జట్టు  కసరత్తులు చేస్తున్నది. భువనేశ్వర్, రవుర్కెలా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీకి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తరఫున  కావాల్సినంత మద్దతు ఉంది.  తాజాగా భారత హాకీ క్రీడాకారులను కలిసిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వారికి బంపరాఫర్ ప్రకటించారు.  భారత్ కు హాకీ ప్రపంచకప్ ను తీసుకువస్తే  జట్టులోని ఒక్కొక్కరికి కోటీ రూపాయల నజరానా  ఇస్తానని హామీ ఇచ్చారు. 

గురువారం రవుర్కెలా కొత్తగా నిర్మించిన రూ. 20 వేల కోట్లతో  నిర్మించిన  బిర్సా ముండా అంతర్జాతీయ హాకీ స్టేడియంలో వరల్డ్ కప్ విలేజ్ ను ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయలతో  క్రీడాకారులకు ఏ లోటూ లేకుండా  వరల్డ్ కప్ విలేజ్  లో ఆధునిక హంగులతో.. రికార్డు సమయంలో 9 నెలల కాలంలోనే 225 గదులను నిర్మించారు. 

ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్.. భారత హాకీ జట్టుతో  కాసేపు ముచ్చటించారు. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపారు. గతేడాది ఒడిషా వేదికగానే ముగిసిన   హాకీ ప్రపంచకప్ లో భారత్.. క్వార్టర్స్ లో  (నెదర్లాండ్స్) చేతిలో నిష్క్రమించింది. కానీ ఈసారి  ప్రపంచకప్ సాధించాలని నవీన్ పట్నాయక్ ఆటగాళ్లతో ముచ్చటిస్తూ చెప్పారు. 

16 దేశాలు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ  ఈనెల 29 వరకూ జరుగుతుంది.   పూల్ - డీలో ఇంగ్లాండ్, స్పెయిన్, వేల్స్ తో పాటు భారత్ కూడా ఉంది. 

 

హాకీ ప్రపంచకప్ 1971లో మొదలైంది. ప్రతీ నాలుగేండ్లకోసారి నిర్వహించే ఈ మెగా టోర్నీ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్  నిర్వహిస్తున్నది. ఈ టోర్నీలో అత్యధిక సార్లు కప్ కొట్టిన దేశం  పాకిస్తాన్. ఆ జట్టు ఇప్పటివరకూ  నాలుగు సార్లు ప్రపంచకప్ నెగ్గింది. 1971, 1978, 1982, 1994లలో పాక్ ఫైనల్ లో గెలిచింది. 1975లో భారత్.. పాకిస్తాన్ ను  2-1 తేడాతో ఓడించి  విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ భారత్ కనీసం ఫైనల్ కు కూడా చేరలేదు. కానీ 2021లో టోక్యో ఒలింపిక్స్ లో  కాంస్యం నెగ్గిన తర్వాత భారత జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇటీవల కాలంలో  నిలకడగా రాణిస్తున్న   టీమిండియా.. ఈసారైనా  ప్రపంచకప్ కలను నెరవేరుస్తుందో లేదో వేచి చూడాలి.