Asianet News TeluguAsianet News Telugu

ఆధ్యాత్మికం : పంచ క్లేశములు

ఏది దొరికితే అది తిని ఆకలి చల్లార్చుకుంటే ఆకోరిక తీరిపోతుంది. ఐతే ఆకలికి పంచభక్ష్య పరమాన్నాలు మాత్రమే కావాలని పట్టు బట్టుకుని వాటికోసం అలమటిస్తూ దొరికింది తినకుండా విచారిస్తూ బాధపడటం, ద్వేషం పెంచుకుని దుఃఖించడం క్లేశమే.

Pancha kleshamulu story written  by hymavathi
Author
First Published Dec 21, 2022, 2:24 PM IST

పుట్టపర్తి నుండి  ఆదూరి హైమావతి రాసిన ఆధ్యాత్మిక వ్యాసం " పంచ క్లేశములు " ఇక్కడ చదవండి:

పంచ క్లేశములు  అంటే ప్రాపంచిక సంబంధమైన, బుద్ధిపరమైన  ఐదు దోషాలు.   క్లేశము అంటేనే విపరీతమైన మానసిక బాధ. మానసిక బాధనే క్లేశము అంటారు. అసలు బాధ ఎందుకు కలుగుతుంది అని ప్రశ్నించు కుంటే ఏదైనా ఒక వస్తువు మీదో,  పదార్థము మీదో,  వ్యక్తిమీదో,  పదవి మీదో,  మరేదైన దానిమీదో మానవునకు కోర్కెకలిగి, అది పెరిగి వ్యామోహంగా మారి దానిని పొందలేక పోయినపుడు విపరీత మైన మానసిక సంక్షోభం అంటే బాధ కలుగుతుంది.  అదేక్లేశము. అంటే కోర్కెలే క్లేశములకు కారణము.

బాధకలిగించే  కారణాన్ని బాగాయోచించి, విశ్లేషించి, తన అర్హత, యోగ్యత, తనకు దానియొక్క అవసరం  అనేవాటి గురించీ  ఆలోచించి విశ్లేషించుకుంటే బాధ నివారణ కావచ్చు. ఐతే అంత ఆలోచన, ప్రయత్నం  మానవుడు చేయాలి.  అపుడు బాధ తగ్గవచ్చు.   ఆకలికి ఆహారం కోరుకోవడం సహజం.  ఏది దొరికితే అది తిని ఆకలి చల్లార్చుకుంటే ఆకోరిక తీరిపోతుంది. ఐతే ఆకలికి పంచభక్ష్య పరమాన్నాలు మాత్రమే కావాలని పట్టు బట్టుకుని వాటికోసం అలమటిస్తూ దొరికింది తినకుండా విచారిస్తూ బాధపడటం, ద్వేషం పెంచుకుని దుఃఖించడం క్లేశమే.

క్లేశములు ఐదు విధములు.  మానవుని బాధలకు కారణమైన ఈ ఐదు క్లేశముల గురించి కొద్దిగా వివరంగా చెప్పుకుందాం.  మొదటిది - అవిద్యాక్లేశము - విద్య అంటే కేవలం ప్రాపంచిక విద్య కాదు. నిరక్షరాస్యత అనికాదు. జ్ఞానము అని అర్థం. తన నిజస్వరూపమును గుర్తించుకోకుండా తాను ఒక జీవుడు అని అనుకోవటం అవిద్య. 

సంకుచిత భావముచేత దేహమే నేను అని భ్రమించడం.  నేనొక జీవుడను అని నమ్మడం.  జీవునకు, దేవునకూ సంబంధములేదని తన కంటే దేవుడు భిన్నుడనీ భావించి మానవుడు అనేకానేక దుఃఖములకు గురి అవుతున్నాడు.  దీనివలన అనేక విచారములు కలిగి మనిషి  బలహీనడవుతున్నాడు.   దీని నుండి బయటపడుటకు ముందు తగిన జ్ఞానాన్ని పొంది జీవ, దేవ భావమును గురించి తెలుసుకోవాలి. ‘ అహం బ్రాహ్మాస్మి’ అనేమాటకు అర్థం గ్రహించినచో ఈ అవిద్యా క్లేశమునుండీ బయటపడవచ్చు.

భగవద్గీతలో అర్జునుడు తాను తన బంధువులనూ, గురువులనూ వధించ వలసి వచ్చిందనీ, తానే వారి మరణానికి కారణమనీ భావించి విలపిస్తూ యుధ్ధం చేయనన్నపుడు, భగవంతుడైన కృష్ణపరమాత్మ అర్జునునకు జీవ, బ్రహ్మ తత్వమును బోధించి కర్తవ్యాన్ని గ్రహించమనీ జీవునకూ, దేవునకూ  ఉన్న సంబంధమునూ వివరించి అర్జునుని అజ్ఞానమును పారద్రోలి క్లేశమును పోగొట్టి కర్తవ్య నిర్వహణవైపు అర్జునుని మరలించాడు.  కనుక క్లేశము వదలాలంటే జ్ఞానమును పొందాలి.

రెండవది అభినవ క్లేశము : సంసారమును, దానిని పట్టుకుని ఉండే మనస్సును అంటి పెట్టుకొనుట. వదలకుండా అటాచ్ మెంట్ అధికం చేసుకొని ఉండుట  అభినవ క్లేశము - సమస్త విచారములకూ ఆశలకు, రోగములకూ, రాగమూలకూ, స్థానము మనస్సు. ఈ మనస్సు వలననే మానవుడు సంసారమునకు బంధింప బడుతున్నాడు.

ఈ  బంధములకు, కష్టములకు, అవిచారములకూ, అన్నింటికీ మూలకారణం మనస్సే అనితెలిసినా ఈ మనస్సు మాయనుండి మానవుడు బయటికిరాలేక , బంధితుడై దుఃఖములను అనుభవిస్తున్నాడు. 

ఒక పసిబిడ్డ మనస్సుతో మమేకం కాడు కనుక నిరంతరం రోజంతా నవ్వుతూ ఆనందంగా ఉంటాడు.  బిడ్డకు మంచి దుస్తులు ధరించానా, మంచి ప్రదేశంలో పడుకున్నానా, మంచి వారితో ఉన్నానా, నగలు ధరించానా అని ఏమీతెలీదు.  వానికి మనస్సుతో  బంధం లేదు.  కేవలం  ఆకలైతే ఏడ్వటం, శరీరబాధ కలిగితే ఏడ్వటం మాత్రమే తెలుసు.  అంటే మాయకు లోబడని వాడన్నమాట. మాయకు లోబడని వయస్సు.  దీన్నే అమాయకత్వం అంటారు.  అంటే మాయలేకపోడం.  ఇలా మనసుకు లోబడక జరిగేవి జరుగుతాయని వదిలేస్తూ కాల ప్రవాహంలో పయనిస్తూ ఉంటే ఈ క్లేశం నుండి తప్పించుకోవచ్చు.  

ఒక ధనికుడు తనను తన సంతానమంతా అమితంగా ప్రేమించి, గౌరవిస్తారని భావించి అమిత గర్వంగా జీవించేవాడు.  ఒకరోజు ఆ ధనికుడు  ఒక మునిని సంద ర్శించి తన ఇంటికి వచ్చి భిక్షస్వీకరించ వలసినదిగా కోరాడు.  అప్పుడు ముని ఆ ధనికుని  వివరాలు అడుగుతాడు.  ఆ ధనికుడు "స్వామీ! నాకు నలుగురు కుమారులు, ఈ చుట్టుపక్కల పరగణాలకంతా నేనే అమిత ధనికుడ్ని.  నన్ను నా సంతానం, కోడళ్ళూ, భార్యా కూడా అమితంగా ప్రేమిస్తారు.  నాకోసం తమ ప్రాణా లనైనా ఇవ్వగలరు.  అలాంటి అదృష్టవంతుడిని నేను. అందుచేత నా ఇంటికి వచ్చి భిక్ష స్వీకరించమని కోరుతున్నాను" అని అడుగుతాడు.  దానికి మునీశ్వరుడు "ఆహా! అంత అదృష్టవంతునివా!  నీవంటే నీ వారికంత అమిత ప్రేమాభిమానాలున్నాయా!  నీకోసం ప్రాణాలుకూడా ఇస్తారా!" అని అడుగుతాడు.

"ఔను మునీంద్రా!  దీనిలో మీకేమాత్రమూ సందేహం అవసరంలేదు.  కావాలంటే మీరే పరీక్షించుకోవచ్చు." అన్నాడా ధనికుడు రోషంగా.

ముని ఒకమాట చెప్పాడు.  "మంచిది.  నీకు నేనొక మూలిక ఇస్తాను. ఇంటికి వెళ్ళాక నీవు దానిని నీనోట్లో ఉంచుకోగానే నీవు మరణించినట్లు పడిపోతావు.  నేను అప్పుడు  వస్తాను.  నీకు జరిగేదంతా తెలుస్తూనే ఉంటుంది.  ఐతే నీశరీరం మాత్రం మరణించినట్లే కదలక చల్లబడి ఉంటుంది.  నీవారికి నీమీద గల ప్రేమ నీకు తెలుస్తుంది" అని చెప్పి ఒకమూలిక ఇచ్చి సాగనంపుతాడు.  ధనికుడు  ఇంటికి వెళ్ళి ఆమూలికను నోట్లో ఉంచుకోగానే దానిప్రభావం వలన ఆధనికుడు మరణించినట్లు క్రింద పడిపోతాడు.  అతని భార్యా నలుగురుకుమారులూ, కోడళ్ళూ అంతా విలపిస్తూ ఉన్న సమయాన ఆమునీశ్వరుడు వారి ఇంటప్రవేశించి వచ్చినకష్టమేమని అడుగుతాడు.  దానికి వారు మా ప్రియమైన తండ్రి అకాలమరణం  తమకు బాధ కలిగిస్తునందనీ, మీరు చాలా మహిమలు కలిగి ఉంటారు, ఎలాగైనా  మీ మహత్తుతో మాతండ్రిని బ్రతికించమనీ కోరుతారు.  దానికి మునీంద్రుడు "అలాగే తప్పక బ్రతికిస్తాను. నావద్ద మహిమగల తీర్థం ఉంది.  దానిని ఎవరు సేవిస్తే వారిప్రాణం ఈ మరణించిన వ్యక్తికి వస్తుంది. వారు మరణిస్తారు. మీ అందరికీ మీతండ్రి అంటే  అమిత ప్రేమకదా!  మీలో ఎవరైనా ఈ తీర్థం సేవించి మీ తండ్రిగారికి ప్రాణం ఇవ్వండి.  మీకెంతో ధనం, సంపదా సంపాదించిన వారుకదా! మీ తండ్రిగారు." అని అడిగాడు ముని.

ఆ ధనికుని భార్య " అయ్యా! నేను ఈ తీర్థం త్రాగి   మరణిస్తే బ్రతికే నాభర్త నేను లేకపోతే తిరిగి మరణిస్తాడు. నేను లేకుండా జీవించలేడు. నేనంటే ప్రాణం ఆయనకు. అందువల్ల  నేను తీర్థం త్రాగి నాభర్తకు ప్రాణం ఇవ్వడం వలన ఉపయోగమేమీ లేదు" అని తప్పించుకుంది. 
పెద్దకుమారుడు " మునీద్రా! నామీదే కుతుంబ బాధ్యతంతా ఉందికదా! నాతండ్రి జీవించినా ఆయనకు వ్యాపారంలో నేనే కుడి చేయిలాగా ఉండి చూస్తున్నాను. నేను లేకపోతే మానాయనగారు   వ్యాపారాలన్నీ చూసుకోలేక చాల బాధపడతారు.  ఆయన్ని బాధపెట్టడం ధర్మంకాదు కదా!" అని తప్పించుకుంటాడు.
రెండోకుమారుడు" అయ్యా నాబిడ్డలు చాలా చిన్నవారు, వారికి తండ్రిలేకపోతే ఎలా!" అంటాడు. ఇలా తలో కారణంచెప్పి తప్పించుకుంటారు. చివరకు అంతా కలసి రహస్యంగా యోచించి "మునింద్రా! మీకు ఏ బంధాలూ లేవు, మీరు మరణిస్తే బాధపడేవారూ లేరు.  పైగా మీరు సేవాభావన, పరోపకారమే దైవంగా భావించవారు.  మీరే ఈ తీర్థం సేవించి మాతండ్రిని బ్రతికించమని అంతా మిమ్ము ప్రార్థిస్తున్నాం ."  అని కోరారు మూకుమ్మడిగా.

అంతా పడుకుని వింటున్న ఆధనికుడు లేచి              "స్వామీ ! నామీద వీరికి గలప్రేమ తేటతెల్లమైంది.  పదండి నన్ను మీశిష్యునిగా స్వీకరించి నాకు సన్యాస దీక్ష అనుగ్ర హించండి." అని  ఆమునితో వెళ్ళిపోయాడు  ఆధనికుడు విరాగిలా.  ఇదన్నమాట అటాచ్ మెంటువల్ల కలిగే బాధా, డిచాట్ మెంట్ వల్ల కలిగే జ్ఞానమూనూ.        

మూడవది అస్థిత క్లేశము - విషయములతో కూడినదే అస్థితక్లేశము.  ప్రపంచమంతా విషయమయమేకదా! కోరికల మయము. ఆవిషయములే మానవులకు  విషసర్పాలుగా హానిచేస్తున్నాయి.  బాధపెడు తున్నాయి. భయపెడుతున్నాయి.  భ్రాంతికి గురిచేస్తున్నాయి.  విషయములే లేకుండిన మానవునికి విషసంబంధమైన చింతలే ఉండవు కదా!  విషయములను అనుభవించగోరి, విషాన్ని ఆనందించగోరి, విషయలోలుడై వివేకాన్ని కోల్పోయి విషయలంపటంలో పడి, అనేక విధములైన క్లేశములకు లోనవుతున్నాడు మానవుడు.  వాటిని పొందటానికి అనేకానేక దుష్కార్యములు చేయనైనా వెనుకాడడు. అందుకే దీన్ని అస్థితక్లేశము అంటున్నారు . తన ఆస్థి, అందము, ఉద్యోగము, స్థాయి మొదలైన అస్థిరమైన విషయాలపట్ల అసక్తికలిగి అసలైన ఆత్మ తత్వాన్ని మరువడం.  విషయములలో అత్యంత నిమగ్నుడై గర్వించుట . దీనికి ఉదాహరణాగా అజామీళునికథ చెప్పుకోవచ్చు.

నాల్గవది రాగక్లేశము - రాగము అంటే అనేక విషయముల పై ప్రేమ, బంధం, తనదిచేసుకోవాలనే కోరిక, ఆశ పెంచుకుని, భ్రమలు కల్పించుకుని, ధన కనక వస్తు వాహనముల పట్ల విపరీతమైన ఆశలను, ఆకాంక్షలను పెంచుకుంటూ, నిద్ర లేచినది మొదలు నిద్రించు వరకూ వాటిని గురించీ తపిస్తూ, తనదిగా చేసుకొనుటకూ,  వాటిని అందరి కంటే అధికంగా ఆర్జించేందుకై అన్నపానాదుల నుసైతం మానివేసి, అవి అశాశ్వత మైనవనీ, తనతో చివరకు ఏమీ తిసుకొని వెళ్ల లేమనీ తెలిసినాకూడా అత్యాశవలన నిరంతరం వాటికోసం తపిస్తూ సర్వం మరచి, అమిత శ్రమపడి అనారోగ్యం తెచ్చుకుని, మతి చెడి, అనేకానేక దుఃఖములకు గురికావడం.  ఈ విచారములన్నింటికీ కారణం రాగమే. అంటే ఆస్థిపాస్తుల అభివృధ్ధి కొరకు పడరాని పాట్లు పడటం.  స్వార్థ చింతన అన్నమాట.  ఇదే రాగ క్లేశము.   ధనము మొదలగు వానిలో మిక్కిలి కోరిక కలిగి ఉండుట.
 
దీనికి ఉదాహరణగా మనం ధృతరాష్ట్రుని ఉదంతం చెప్పుకోవచ్చు. తనది కాని సంపదనుకోరి, కుమారులకు కూడా తమదికాని రాజ్యసంపదలపట్ల ఉన్న వ్యామో హాన్ని తొలగించలేక వారి దుష్ కృత్యాలను ఆపలేక చివరకు అందరినీ కోల్పోవడం.

ఐదవది ద్వేషక్లేశము - కేవలం తన స్వార్థం కోసం, తన ప్రయోజనం కోసం, తన లాభంకోసం మానవుడు అనేక ఆశలను పెంచుకుని శ్రమిస్తాడు.  అవి నెరవేరనపుడు ఎదుటివారిపై కోపము, ఫలానా వారివలన తన కోరిక తీరలేదనీ, తనకు లాభం కలుగలేదనే పగ, తన లాభమునకు అడ్డు తగిలారని కొందరిపై ద్వేషం  పెరిగి, చివరకు దైవం మీదకూడా ద్వేషం, క్రోధం పెరిగిపోతాయి.  విచక్షణ నశిస్తుంది. మానవుడు తన  పనుల కోసం మరొకరిని  ఆశ్రయించి వారి వలన సహాయం పొందినా , ఇంకా ఇంకా ఆశించి వారి పైననే ద్వేషము పెంచుకోడం. ఇదే ద్వేష క్లేశం.  ద్వేషించుట వలన కలిగే క్లేశమన్నమాట. దీనికి ఉదాహరణగా మనం కార్తవీర్యార్జునుని కథ చెప్పుకోవచ్చు.

ఈక్లేశములకు గురి అగుటవలన మనశ్శాంతికరువై , అశాంతి పొందుటచే, ఆత్మతత్వమునే మరచిపోడం జరుగుతుంది.  ఆత్మతత్వం వేరనీ తాను వేరనీ భావిస్తు న్నాడు మానవుడు.  ఈ భ్రమవలన మానవునికి అనేక విధములైన  క్లేశములు కలుగుతున్నాయి.  ఈ క్లేశములలోపడి చివరకు ప్రాణాలను సైతం వదులు కోవలసి వస్తుంది.  ఇక దేనికోసం బాధపడటం‌.  కనుక తృప్తి, త్యాగభావన, ప్రేమభావన, సేవాభావన కలిగి ఆనందంగా జీవించడం నేర్చుకుంటే ఉత్తమగతులను పొందడం ఖాయం.
 

Follow Us:
Download App:
  • android
  • ios