కొంత మంది దోషులు ఇతరుల కంటే ప్రత్యేకం - బిల్కిస్ బానో రేప్ కేసులో నిందితుల విడుదలపై సుప్రీంకోర్టు
కొంత మంది దోషులు ఇతరుల కంటే ప్రత్యేకం అని బిల్కిస్ బానో రేప్ కేసులో నిందితుల విడుదలపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. గుజరాత్ ప్రభుత్వం ఉపశమన విధానాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదని, కానీ దానిని ఉపయోగించిన తీరు, విధానాన్ని ఎలా అమలు చేశారన్నదే ప్రశ్న అని తెలిపింది.
2002 బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. కొంతమంది దోషులు ఇతరులకన్నా ఎక్కువ ప్రత్యేకత కలిగి ఉన్నారని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఉపశమనం కల్పించే అధికారాన్ని గుజరాత్ ప్రభుత్వం సక్రమంగా ఉపయోగించిందా లేదా అనేదే సుప్రీంకోర్టు ముందున్న అసలు సమస్య అని ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బిల్కిస్ బానో కేసులో దోషులు శిక్షాకాలంలో పెరోల్ లేదా బహిష్కరణకు గురికాని జీవిత ఖైదు దోషులతో సమానంగా కోరలేరని ధర్మాసనం పేర్కొంది.
‘టైమ్స్ నౌ’ కథనం ప్రకారం.. దోషుల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కు వ్యతిరేకంగా దోషుల్లో ఒకరి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ‘‘జైలు జీవితం చాలా కష్టం. వారు (ఈ కేసులో దోషులు) కనీసం 15 సంవత్సరాలుగా ఉన్నారు. వారి కోసం వారి కుటుంబాలు బయట ఎదురు చూస్తున్నాయి. బయటకు వచ్చి సంస్కారవంతమైన జీవితాన్ని గడపాలని ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు.’’ అని ఆయన అన్నారు.
లూథ్రా వాదనపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘కానీ ఈ కేసులో వారు చాలా రోజులు, పలుమార్లు బయటకు వచ్చే అవకాశం లభించింది. ఇన్నాళ్లూ వారు అధైర్యపడలేదు. కొంతమంది దోషులు ఇతరులతో పోలిస్తే ఎక్కువ హక్కులు కలిగి ఉంటారు. ఈ విషయాన్ని మేము చెప్పబోతున్నాం.’’ అని పేర్కొంది.
ఒక దోషి గురించి ఒక నిర్దిష్ట పాయింట్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని సిద్ధార్థ్ లూథ్రా చెప్పగా.. ప్రతి దోషి ఒకేలా ఉండడు అని ధర్మాసనం పేర్కొంది. (బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలను సవాలు చేస్తూ) దాఖలైన పిటిషన్లలో కోర్టు ముందు ఎవరూ ఈ ఉపశమన విధానం సరైనదా అని ప్రశ్నించడం లేదని, అలాగే దాని ఉద్దేశ్యాన్ని అనుమానించడం లేదని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఉపశమన విధానం సరైనది కాదని ఎవరూ ప్రశ్నించడం లేదు. ఈ అధికారాన్ని ఎలా ఉపయోగించారు, ఈ విధానాన్ని ఎలా అమలు చేశారనేది ప్రశ్న’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె మూడేళ్ల కూతురు సహా ఆమె కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన 11 మందిని గత ఏడాది విడుదల చేశారు. ఇది దేశ వ్యాప్తంగా వివాదాన్ని రేకెత్తించింది. పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.