రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన ‘శాంతినికేతన్’ కు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు
Santiniketan: మత, ప్రాంతీయ సరిహద్దులకు అతీతమైన విద్యాక్షేత్రం అనే ప్రసిద్ద కవి దార్శనికతను ప్రతిబింబించే రవీంద్రనాథ్ ఠాగూర్ "శాంతి నివాసం" శాంతినికేతన్ అధికారికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపును సాధించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు సాధించిన భారత్ లోని 41వ ప్రదేశం కాగా, బెంగాల్ లో ఇది ఐదవది.
UNESCO's World Heritage status on Santiniketan: దేశంలో అత్యంత ప్రాచుర్యం, ప్రాముఖ్యత కలిగిన , పశ్చిమబెంగాల్ లోని ప్రముఖ ప్రదేశం శాంతినికేతన్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు లభించింది. మత, ప్రాంతీయ సరిహద్దులకు అతీతమైన విద్యాక్షేత్రం అనే ప్రసిద్ద కవి దార్శనికతను ప్రతిబింబించే రవీంద్రనాథ్ ఠాగూర్ "శాంతి నివాసం" శాంతినికేతన్ ఆదివారం అధికారికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపును సాధించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు సాధించిన భారత్ లోని 41వ ప్రదేశం కాగా, బెంగాల్ లో ఇది ఐదవది.
పశ్చిమబెంగాల్ లోని బుర్భూమ్ జిల్లాలో రవీంద్రనాథ్ ఠాగూర్ నివాసమైన శాంతినికేతన్ కు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కల్పించడంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం సౌదీ అరేబియాలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 45వ సమావేశంలో శాంతినికేతన్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినట్లు ఐక్యరాజ్యసమితి సంస్థ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ ద్వారా తెలియజేసింది. భారత రాయబారి, యునెస్కోలో శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ చేసిన పోస్టుకు జైశంకర్ స్పందిస్తూ.. 'అభినందనలు. మన తొలి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కు, ఆయన సందేశాన్ని సజీవంగా ఉంచిన వారందరికీ తగిన నివాళిగా' పేర్కొన్నారు.
అంతకు ముందు విశాల్ వి శర్మ తన సోషల్ మీడియా 'ఎక్స్'లో శాంతినికేతన్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించడంతో భారతీయులకు ఇది గొప్ప రోజు.. భారత్ మాతాకీ జై అంటూ పేర్కొన్నారు. శాంతినికేతన్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినట్లు ప్రకటించిన ఒక వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో పశ్చిమబెంగాల్ లోని శాంతినికేతన్ ను చేర్చడం భారతీయులందరికీ గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ దార్శనికత, భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతిరూపం అయిన శాంతినికేతన్ @UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారతీయులందరికీ ఇది గర్వకారణమన్నారు.
1901 లో ఠాగూర్ చేత స్థాపించబడిన శాంతినికేతన్ ఒక రెసిడెన్షియల్ పాఠశాల. పురాతన భారతీయ సంప్రదాయాలపై ఆధారపడిన కళా కేంద్రం. మత-సాంస్కృతిక సరిహద్దులకు అతీతంగా మానవాళి ఐక్యత దార్శనికతకు ప్రతిబింబం. 1921లో శాంతినికేతన్ లో మానవాళి ఐక్యతను లేదా "విశ్వభారతి"ని గుర్తిస్తూ ఒక 'ప్రపంచ విశ్వవిద్యాలయం' స్థాపించబడింది. 20 వ శతాబ్దం ప్రారంభంలో ఉన్న బ్రిటిష్ వలసవాద నిర్మాణ దృక్పథాలు, యూరోపియన్ ఆధునికత నుండి భిన్నంగా, శాంతినికేతన్ పాన్-ఆసియా ఆధునికత వైపు విధానాలను సూచిస్తుంది. ఈ ప్రాంతం అంతటా పురాతన, మధ్యయుగ-జానపద సంప్రదాయాలను ఆకర్షిస్తుంది. బీర్భూమ్ జిల్లాలో ఉన్న ఈ సాంస్కృతిక ప్రదేశానికి యునెస్కో గుర్తింపు కోసం భారత్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేర్చాలని శాంతినికేతన్ ను ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐకోమోస్) సిఫారసు చేసిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి తెలిపారు.