'మనకు ఎలోన్ మస్క్ వంటి పారిశ్రామికవేత్తలు అవసరం' : ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు
ISRO Chief: భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ అన్నారు . యుఎస్‌లోని ఎలోన్ మస్క్ మాదిరిగానే ఎక్కువ మంది పరిశ్రమల వ్యక్తులు అంతరిక్ష రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఇస్రో చీఫ్ పిలుపునిచ్చారు.

ISRO Chief: భారత అంతరిక్ష రంగంలో ప్రయివేటు రంగం ఎక్కువగా భాగస్వామ్యం కావాలని ఇస్రో చీఫ్ ఎస్.సోమ్‌నాథ్ పిలుపునిచ్చారు. యుఎస్‌లోని ఎలోన్ మస్క్ మాదిరిగా భారత్ లో కూడా ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు అంతరిక్ష రంగంలో పెట్టుబడులు పెట్టాలని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఏఐఎంఏ వార్షిక సదస్సులో సోమ్‌నాథ్ ప్రసంగిస్తూ.. తాము అంతరిక్ష రంగంలో మరింత మంది పారిశ్రామికవేత్తలను చూడాలనుకుంటున్నామని అన్నారు. అమెరికాలో ఎలాన్ మస్క్ ఉన్నట్లు.. ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆయనలాంటి వారు కావాలని అన్నారు.
అయితే.. ఇది అంత తేలికైన రంగం కానప్పటికీ.. దీనికి వ్యక్తిగత అభిరుచి అవసరం, వైఫల్యాలు కూడా ఎదురవుతాయని, కాబట్టి గ్రౌండ్ ఎక్విప్‌మెంట్ తయారీ వంటి అప్లికేషన్ సెగ్మెంట్‌లో ప్రారంభించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో అంతరిక్ష పరికరాల తయారీని మరింత ఎక్కువగా చూడడమే మా లక్ష్యం. దేశంలో అనేక ఉపకరణాలు తయారవుతున్నాయి, ఎలక్ట్రానిక్స్ రంగం సవాళ్లు ఎదుర్కొంటుంది. మాకు మరింత పరిశ్రమ మద్దతు అవసరమని అన్నారు.
గతంలో మాదిరిగా కాకుండా.. అంతరిక్ష పరిశోధనలు ప్రధానంగా ప్రభుత్వ సహకారంపై ఆధారపడి ఉండేవని, కానీ, అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ రంగం ప్రవేశిస్తోందని సోమనాథ్ తెలియజేశారు. ఇప్పుడు ప్రయివేటు కంపెనీలు ఇస్రో వెలుపల కూడా సొంతంగా ఉపగ్రహాలను తయారు చేసి ప్రయోగించగలవని, ఇది గొప్ప అవకాశం అని ఆయన అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్, ప్రైవేట్ సెక్టార్‌తో ఇతర సహకార మార్గాల ద్వారా అంతరిక్ష రంగంలో వారి భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తున్నామని ఇస్రో చీఫ్ తెలియజేశారు.
ప్రైవేట్ సంస్థలు వచ్చి రాకెట్లను రూపొందించేందుకు వీలుగా రాకెట్ డిజైనింగ్‌లో కాస్ట్ ఎఫెక్టివ్‌ను రూపొందిస్తున్నట్లు సోమనాథ్ తెలిపారు. ప్రస్తుతం 53 ఉపగ్రహాలు ఉన్నాయనీ, అయితే.. మనం అంతరిక్ష రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాలంటే .. కనీసం వాటి సంఖ్య 500 లకు చేరాలని అన్నారు. చంద్రయాన్-3 మిషన్ ప్రయోగానికి ముందు.. నాసా శాస్త్రవేత్తలు మా భాగాలను సమీక్షించారని అన్నారు. వాటి ఖర్చు ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు. అంతరిక్ష రంగంలో వైఫల్యాలు సహజమేనని, అయితే ఇస్రోలో అందుకు ఎవరూ శిక్షించబడరని అన్నారు. అందుకే నిర్ణయం తీసుకోవడంలో కొత్త విధానాలను అనుసరించమని శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తుంది.