Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ వ్యాక్సిన్ల‌కు-గుండెపోటుకు మ‌ధ్య సంబంధం ఉందా?.. తాజా అధ్య‌య‌నం ఏం చెబుతోంది?

New Delhi: కొంత‌కాలంగా గుండె పోటు మ‌ర‌ణాల‌కు కోవిడ్-19 వ్యాక్సిన్లే కార‌ణమ‌నీ, అనేక ఇత‌ర అనారోగ్య ప్ర‌భావాల‌ను వ్యాక్సిన్లు సృష్టించాయ‌నే ప్ర‌చారం ఇంకా కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే కోవిడ్-19 వ్యాక్సిన్లు-గుండెపోటుకు మ‌ధ్య ఏదైనా సంబంధం ఉందా?  అనే కోణంలో తాజా ఒక అధ్య‌య‌నం నిర్వ‌హించిన ప‌రిశోధ‌కులు త‌మ రిపోర్టుల్లో కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు.
 

Is there a link between Covid vaccines and heart attack?, What does the latest study say? RMA
Author
First Published Sep 7, 2023, 4:54 PM IST

Covid Vaccines-Heart Attack Risk: ఇటీవలి కాలంలో గుండెపోటుకు గుర‌వుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా గుండె పోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన కేసులు భార‌త్ లో గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. అయితే, కొంత‌కాలంగా గుండె పోటు మ‌ర‌ణాల‌కు కోవిడ్-19 వ్యాక్సిన్లే కార‌ణమ‌నీ, అనేక ఇత‌ర అనారోగ్య ప్ర‌భావాల‌ను వ్యాక్సిన్లు సృష్టించాయ‌నే ప్ర‌చారం ఇంకా కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే కోవిడ్-19 వ్యాక్సిన్లు-గుండెపోటుకు మ‌ధ్య ఏదైనా సంబంధం ఉందా?  అనే కోణంలో తాజా ఒక అధ్య‌య‌నం నిర్వ‌హించిన ప‌రిశోధ‌కులు త‌మ రిపోర్టుల్లో కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. సంబంధిత ప‌రిశోధ‌న ప‌త్రాలు PLOS One జర్నల్‌లో ప్ర‌చురించ‌బ‌డ్డాయి. AMI లేదా గుండెపోటు మ‌ర‌ణాలు-COVID-19 టీకా ప్రభావాన్ని ఈ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది.

భారత్ లో వాడుతున్న కొవిడ్-19 టీకాలైన కొవిషీల్డ్, కొవాగ్జిన్లకు-గుండెపోటు ముప్పు పెరగడానికి ఎలాంటి సంబంధం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవల పీఎల్ఓఎస్ వన్ జర్నల్లో ప్రచురితమైన ఈ పరిశోధనలో తీవ్రమైన మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (ఏఎంఐ) లేదా గుండెపోటు తర్వాత మరణాలపై కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రభావాన్ని నిర్ధారించారు. అధ్యయనం కోసం ఆగస్టు 2021-ఆగస్టు 2022 మధ్య ఢిల్లీలోని జీబీ పంత్ హాస్పిటల్‌లో చేరిన 1,578 మంది వ్యక్తుల నుండి డేటాను ఉపయోగించారు. 1,086 (68.8 శాతం) మందికి COVID-19 టీకాలు వేయించుకోగా,  492 (31.2 శాతం) మంది టీకాలు తీసుకోలేదు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 1,047 మంది (96 శాతం) రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోగా, 39 మంది (4 శాతం) ఒక్క డోసు మాత్రమే తీసుకున్నారు. 

అయితే, భార‌త్ లో వాడే వ్యాక్సిన్లు సురక్షితమని తమ అధ్యయనంలో తేలిందని ప‌రిశోధ‌కులు తెలిపారు. భార‌త్ లో  వ్యాక్సినేషన్ కు, హార్ట్ ఎటాక్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. వాస్తవానికి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులలో గుండెపోటు తర్వాత మరణించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధ్యయనం కనుగొందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన జీబీ పంత్ ఆసుపత్రికి చెందిన మోహిత్ గుప్తా తెలిపిన‌ట్టు పీటీఐ నివేదించింది. కోవిడ్-19 వ్యాక్సిన్ల ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా తేలికపాటివి, తాత్కాలికమైనవి, అలాగే, స్వీయ-పరిమితం. అయితే, ఈ వ్యాక్సిన్ల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా దుష్ప్రభావం విపత్కర ప్రభావాలను కలిగిస్తుందనీ, ముఖ్యంగా భారతదేశం వంటి పెద్ద జనసాంద్రత కలిగిన దేశాలలో అధికంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు.

నమోదు చేసుకున్న రోగులందరిలో, వ్యాక్సిన్ రకం, వ్యాక్సినేషన్ తేదీ, ప్రతికూల ప్రభావాల వివరాలతో సహా రోగి వ్యాక్సినేషన్ స్థితికి సంబంధించిన డేటాను అధ్య‌య‌నంలో ఉప‌యోగించారు. వ్యాక్సినేషన్ తర్వాత ఏ నిర్దిష్ట సమయంలోనూ ఏఎంఐ నిర్దిష్ట క్లస్టర్ ను విశ్లేషణ చూపించలేదని పరిశోధకులు కనుగొన్నారు. కోవిడ్ -19 టీకాలు-గుండెపోటు మధ్య గణనీయమైన సంబంధం లేదని ఇది సూచిస్తుందని పేర్కొన్నారు. అయితే వయసు పెరగడం, మధుమేహం, ధూమపానం చేసేవారిలో 30 రోజుల మరణాల ముప్పు ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 30 రోజులు, ఆరు నెలల మరణాల ముప్పు గణనీయంగా తక్కువగా ఉందని తమ అధ్యయనంలో తేలిందని ప‌రిశోధ‌కులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios