Aditya L1 Mission: ఆదిత్య ఎల్1 మిషన్‌కు ఖర్చు ఎంత? చంద్రయాన్ 3 కంటే తక్కువేనా?
ఆదిత్య ఎల్ 1 మిషన్ ఖర్చు చంద్రయాన్ 3 మిషన్ ఖర్చులో సగం. చంద్రయాన్ 3 మిషన్‌ను అతి తక్కువ ఖర్చుతో ఇస్రో విజయవంతంగా ప్రయోగించిందని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. అదే ఇస్రో సుమారు రూ. 300 కోట్లతోనే ఆదిత్య ఎల్1 మిషన్‌ను ప్రయోగించడం గమనార్హం.
న్యూఢిల్లీ: భారత్ తన తొలి సోలార్ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రోజు ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ మిషన్‌ను ఇస్రో ప్రయోగించింది. ఈ మిషన్ సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఒక అబ్జర్వేటరీగా పని చేస్తుంది. చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగం విజయవంతమైన తర్వాత ఈ మిషన్‌ను ఇస్రో ప్రయోగించింది.
ఆదిత్య ఎల్1 మిషన్ ఖర్చు
చంద్రయాన్ 3 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోపై దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ దేశాల నుంచీ ప్రశంసల జల్లు కురిపించింది. ఈ మిషన్‌ను అతి తక్కువ ఖర్చుతోనే విజయవంతంగా ప్రయోగించినందుకు ఈ ప్రశంసలు మరిన్ని పెరిగాయి. హాలీవుడ్ స్పేస్ మూవీ ఇంటర్‌స్టెల్లార్ బడ్జెట్ కంటే కూడా తక్కువ ఖర్చుతోనే చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది ఇస్రో. చంద్రయాన్ 3 మిషన్ ఖర్చు సుమారు రూ. 600 కోట్లు.
కాగా, సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 ప్రయోగానికి ఇంత కంటే సగం ఖర్చుతోనే ఇస్రో చేపట్టింది. సోలార్ మిషన్ ఆదిత్య ఎల్ 1 ఖర్చు సుమారు రూ. 300 కోట్లు అని కొన్ని విశ్వసనీయవర్గాలు చెప్పాయి.
Also Read: ఆదిత్య ఎల్1 లాంచింగ్ విజయవంతం.. ఇస్రోకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము అభినందనలు..
మొదటి ఫొటో ఫిబ్రవరి చివరిలో..
ఆదిత్య ఎల్ 1 మిషన్ లగ్రాంజ్ పాయింట్ 1 వద్దకు వెళ్లిన తర్వాత కంటినమ్ చానల్‌లోకి వెళ్లిన తర్వాత నిమిషానికి ఒక ఫొటో తీసి మనకు పంపిస్తుంది. అంటే రోజుకు సుమారు 1,440 ఫొటోలను పంపనుందని ఆదిత్య ఎల్1 ప్రాజెక్ట్ సైంటిస్టు, వీఈఎల్సీ ఆపరేషన్ మేనేజర్ డాక్టర్ ముత్తు ప్రియాల్ తెలిపారు. జనవరి మధ్యలో మిషన్ విజవయవంతంగా లగ్రాంజ్ పాయింట్ 1ను చేరనుంది. ఆ హాలో ఆర్బిట్‌లోకి వెళ్లిన తర్వాత ప్రతి సిస్టమ్‌ను పరీక్షిస్తారు. ఫిబ్రవరి చివరిలో తొలి ఫొటో ఇస్రోకు అందుతుందని అంచనా వేస్తున్నారు. వీఈఎల్సీ షటర్ ఓపెన్ చేయడం చివరిదని, ఆ తర్వాత ఫిబ్రవరి మధ్య కాలంలో తొలి ఫొటో రావొచ్చని ప్రొఫెసర్ జగదేవ్ సింగ్ వివరించారు.