యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ సర్కార్ వచ్చే నెల (అక్టోబర్) ఫస్ట్ నుండి మూడో దశ సంక్రమిత వ్యాధుల నియంత్రణ ప్రచారాన్ని చేపట్టనుంది. ఈ ప్రచారం అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది. వెక్టర్-బోర్న్ తో పాటు అంటువ్యాధుల నివారణ చర్యలు చేపట్టడమే దీని ముఖ్యఉద్దేశం. ఈ ప్రచారంలో భాగంగా అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 31 వరకు దస్తక్ అభియాన్ నిర్వహించనున్నారు. 

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఈ ప్రచారంలో 11 శాఖలు పాల్గొంటాయి. ఆరోగ్య శాఖ ప్రధాన ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ కార్యక్రమం ఉత్తరప్రదేశ్ అంతటా అధిక-ప్రమాద ప్రాంతాల్లో ఫాగింగ్, వెక్టర్ నియంత్రణ చర్యలతో పాటు ప్రజా అవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్పోరేషన్, మున్సిపల్ అధికారులతో పాటు సంబంధిత అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో సెప్టెంబర్ 29 నాటికే చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు వార్డుల వారిగా చేపట్టబోయే కార్యకలాపాలను వివరిస్తూ ప్రణాళికలను సమర్పించాలని ఆదేశించారు. ఈ ప్రచారం వెక్టర్-బోర్న్ వ్యాధులు, నీటి ద్వారా వచ్చే అనారోగ్యాలు,  మెదడు జ్వరం, పరిశుభ్రత, ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని తెెలిపారు.

దస్తక్ అభియాన్‌లో ఆరోగ్య కార్యకర్తలు ఇళ్లను సందర్శించి పరిశుభ్రత గురించి ప్రచారం చేస్తారు. వారు మెదడు జ్వరం, ఇతర అనారోగ్యాల లక్షణాలపై డేటాను సేకరిస్తారు. వీటిని ఇ-కవచ్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రచారంలో దోమలు పెరిగే ప్రదేశాలను గుర్తించడంతో పాటు అక్కడ పరిశుభ్రత చర్యలు చేపట్టడం చేస్తారు.   

వైద్యారోగ్యం, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, శిశు అభివృద్ధితో పాటు ఇతర విభాగాలతో ఆరోగ్య శాఖ సమన్వయం చేస్తుంది. ప్రచార పురోగతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO),  UNICEF పర్యవేక్షిస్తాయి.