ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 74వ జన్మదినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వర్షం మధ్య 'స్వచ్ఛతా హి సేవా' పేరుతో స్వచ్ఛతా వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన నమో ప్లోగాథాన్‌ను ప్రారంభించగా.. వందలాది మంది స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' అనే ప్రధాని మోడీ నినాదాన్ని, విధానాన్ని పాటిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం యోగి పునర్వినియోగ సంచులు, 'స్వచ్ఛతా హి సేవా' టీ-షర్టులను పంపిణీ చేశారు.

ఈ ర్యాలీలో పాల్గొనడానికి "భారత్ మాతా కీ జై", "వందేమాతరం" అంటూ నినాదాలు చేస్తూ వర్షంలో గొడుగులు పట్టుకుని స్వచ్ఛంద సేవకులు ముందుకు సాగారు. రాష్ట్ర మంత్రి రవీంద్ర జైస్వాల్, మేయర్ అశోక్ తివారీ, ఎమ్మెల్యే నీలకంఠ తివారీ, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పూనమ్ మౌర్య సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం (సెప్టెంబర్ 17) 74 ఏళ్ల వయస్సులో అడుగుపెట్టారు. ఆయన తన జన్మదినాన్ని సాధారణ పని దినంగా పాటిస్తుండగా..., బీజేపీ తన వార్షిక "సేవా పర్వ" వేడుకలను ప్రారంభించింది. రెండు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషిని ఎలుగెత్తి చాటుతుంది.

ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా రాజస్థాన్‌లోని ప్రసిద్ధ అజ్మీర్ షరీఫ్ దర్గాలో 4,000 కిలోల శాఖాహార లాంగర్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా గుజరాత్‌లోని సూరత్‌లో వివిధ వ్యాపార సంస్థలు సెప్టెంబర్ 17న 10% నుండి 100% వరకు  వస్తువులపై తగ్గింపు అందిస్తున్నాయి. వసతి, మార్కెట్లు, రవాణాతో సహా అనేక రంగాలలో ఈ తగ్గింపులు వర్తిస్తాయి.