Asianet News TeluguAsianet News Telugu

తెలుగు భాషా దినోత్సవం ప్రత్యేకం... ప్రసూన బిళ్ళకంటి వ్యాసం

తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు  కందుకూరి వీరేశలింగం పంతులు  తెలుగు సమాజంలో మార్పు తేవడానికి, గురజాడ అప్పారావు  తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో, అధికార భాషను  ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంత కృషి చేశారు.  

Telugu Language Day 2021... Prasoona Billakanti Special Essay
Author
Hyderabad, First Published Aug 29, 2021, 2:58 PM IST

నేడు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు ఉపన్యాసకురాలు ప్రసూన బిళ్ళకంటి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.

తెలుగే ఒక వెలుగు

జాతి ద్వారా భాషకు, భాష ద్వారా జాతికి ఒక విశిష్టమైన గౌరవం ఏర్పడుతుంది. ఒక జాతి పురోగమన మార్గమును తల్లిభాష ముందుండి నడిపిస్తుంది. తెలుగును రక్షించి, అభివృద్ధి పథంలో నడిపిస్తూ, తెలుగు వెలుగులను ప్రాచుర్యంలోకి తెస్తామన్న వాగ్ధానాలు తీర్చకపోగా, ఇంకా నిరాదరణకు గురి కావడం చాలా బాధాకరం.

ఇంగ్లాండు నుంచి వచ్చి, ఉద్యోగ శిక్షణలో భాగంగా తెలుగు నేర్చుకుని, భాషపై మమకారం పెంచుకొని, తాళపత్రాలు సేకరించి, మిణుకు మిణుకు మంటున్న తెలుగు దీపాన్ని వెలిగించాడు బ్రౌన్ దొర. ఒక విదేశీయుడు తెలుగు భాష కోసం అంత చేయగలిగినపుడు, మన ప్రభుత్వాలు మన భాషా సంరక్షణ కోసం ఇంకెంత చేయవచ్చు?

భాష భావాల వ్యక్తీకరణ మాత్రమే కాదు, మానవ సంబంధాలను అభివృద్ధి పరిచే సాంస్కృతిక ప్రతిబింబం. ఉగ్గుపాలతోపాటు మనోభావాలు మాటల్లో, పాటల్లో బిడ్డకు చేరుతాయి.  'చందమామ రావే.... జాబిల్లి రావే...' అనే పాటలో బిడ్డ ఎంత ఆనందం పొందుతుందో, సరస్వతీ దేవి కూడా అంతే పరవశమౌతుంది.

పరిణామ క్రమంలో ఎన్నో విషయాల్లో ఎన్నో మార్పులు జరిగుతాయి.  అందుకు భాష కూడా అతీతం కాదు. ఆ మార్పు తెలుగులో ఎక్కువగా జరుగుతుంది అని చెప్పవచ్చు.  పక్కన ఉండే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో మాతృ భాష పై మమకారం ఎక్కువ. ఇంకో భాషకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వరు.  మరి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే దగ్గరుండి మాతృభాషకు ద్రోహం తలపెడుతున్నారు. దానికి మేధావులు వత్తాసు పలుకుతున్నారు.

తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు  కందుకూరి వీరేశలింగం పంతులు  తెలుగు సమాజంలో మార్పు తేవడానికి, గురజాడ అప్పారావు  తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో, అధికార భాషను  ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంత కృషి చేశారు.  అందుకే తెలుగు భాషా దినోత్సవం అనగానే గిడుగు వారు మన కళ్ళముందు దర్శనమిస్తారు.

రాయప్రోలు, త్రిపురనేని, చిలకమర్తి, పానుగంటి, ఉన్నవ, విశ్వనాథ, శ్రీ శ్రీ, కాళోజీ, సినారె మొదలగు ఎందరో కవులు తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చినారు.  సురవరం ప్రతాప రెడ్డి  దినపత్రికలలో భాషా విప్లవానికి నాంది పలికారు. భక్తి మార్గంలో త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, రామదాసు, పుట్టపర్తి, దేవులపల్లి... ఇలా ఎందరో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకులైనారు.

ఈనాడు భారత దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు.  ప్రపంచంలో ఇది పదహారవ స్థానం ఆక్రమించింది.  అతి సులభతరమైన ప్రపంచ భాషలలో  మాండరిన్ తర్వాత తెలుగు రెండో స్థానంలో ఉంది.  కానీ ఇపుడు ఆధునిక పరిణామ మార్పుల నేపథ్యంలో విపరీతంగా నిరాదరణకు గురవుతున్న భాషల్లో కూడా తెలుగు ముందంజలో ఉండడం చాలా బాధాకరం.  ఒక భాషకు ప్రాధాన్యత తగ్గితే దాని చుట్టూ వేలాది సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కూడా తెరమరుగవుతాయని గమనించాలి.  వేరుకు చెదలు పడితే మహా వృక్షమైనా నేల కూలక తప్పదు. 
పరిస్థితి మన భాషకు రాకముందే మనం మేలుకోవడం మంచిది.

ఏ పని అయినా కలిసి కట్టుగా చేస్తే అందులో విజయం సాధించవచ్చు.  అప్పట్లో గిడుగు రామమూర్తి  ఒక్కరే ఛాందస భాషావాదులతో  ఎదురీది నిలిచారు.  ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వాలు కూడా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.  తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది.  పర భాషా వ్యామోహంలో పడి, తల్లి భాషను మాట్లాడడానికి సిగ్గు పడుతున్నారు.  పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే ఫైన్ లు వేస్తున్నారు.  దీనిని తల్లిదండ్రులు సమర్ధిస్తున్నారు. అమ్మను అమ్మా అని పిలవొద్దనే దౌర్భాగ్య విష సంస్కృతి వచ్చి చేరింది.  వేరే భాషలెన్నైనా నేర్చుకోండి, మన భాషను వీడకండి, మరువకండి.

విదేశాలకెళ్ళిన వారు సైతం మాతృదేశాన్ని, భాషను, సంస్కృతులను పద్ధతులను పాటించడం చూడ ముచ్చటగా ఉంది.  ఇక్కడున్న వాళ్ళేమో మాతృ భాషకు మరణ శాసనం రాస్తున్నారు.  చదువులో అన్ని విషయాల మీద ఉన్న శ్రద్ధ తెలుగు పైన చూపడంలేదు.  ఇది చాలా సిగ్గుచేటు.  మలేషియా, సింగపూర్ లలో ఉండే తెలుగు వారు ఏటేటా తెలుగు దినోత్సవాలు జరుపుకుంటున్నారు.  ఇక్కడున్నవారు తెలుగు తప్ప అన్నీ కావాలంటున్నారు.

ఎంత విజ్ఞానం పెరిగినా, ఆంగ్ల పదజాలం పెరిగినా, పెరిగిన సాంకేతిక నైపుణ్యం ద్వారా తెలుగులో కూడా ఆధునిక మార్పులు చేసి ఉపయోగించవచ్చు.  ఆ రకంగా ప్రయత్నాలు చేయాలి.  ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగును చేయడం, తర్వాత ఐచ్ఛికం చేయడం వల్ల ముందు తరాలకు తెలుగును అందించవచ్చు.  లేదంటే జీవద్భాష నుండి మృతభాషగా మారుతుంది.
అందమైన అమ్మ భాషను కాపాడుకుందాం.

 
 

Follow Us:
Download App:
  • android
  • ios