Asianet News TeluguAsianet News Telugu

పుస్తక సమీక్ష: కవితా వర్ణం వర్ణిక

రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి రాసిన  వర్ణిక లేఖా సాహిత్యం లోని లేఖలపై  ముదిగొండ సంతోష్ సమీక్ష

Mudigonda Satish reviews Raja Vasireddy Malleswari book Varnika
Author
Hyderabad, First Published May 10, 2021, 12:32 PM IST

సాంకేతికత అభివృద్ధి సాధించిన తరువాత సమాజం ఎన్నో మార్పులకు లోనైంది.  ఒకప్పుడు ప్రేమ బంధానికి వారధి కట్టిన లేఖలు ఇప్పుడు కూలిపోయాయి.  చదువుతున్నప్పుడల్లా  అక్షరాల్లోని వ్యక్తిని ఎదుట నిలిపేవి.  ఇప్పుడు ఆ లేఖలు లేవు ఆ బంధాలు లేవు.  తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక ప్రక్రియగా విలసిల్లిన లేఖలు నేడు చిరునామా లేక తప్పిపోయాయి.   లేఖకు ఇదమిద్దమైన నిర్వచనం లేదు.  వ్యక్తుల మధ్య  సాగే ఆత్మాశ్రయ గద్య రచన. మనసుతో మనసు పలికే ఓ ఆర్ధ్ర సంభాషణ.  కవిత్వం లాగానే లేఖా రచన కూడా ఒక కళ.  అందరూ లేఖలు రాస్తారు.  విషయానుగుణంగా,  భాషాపరమైన చమత్కారాలతో చదవగానే గుండెకు హత్తుకునేలా రాయడం అందరికీ రాదు.  సాహిత్యం , సంస్కృతి పరంగా సర్వజనీనం అయిన లేఖలే సాహిత్యములో చేరుతాయి.

క్రీ.శ. 2 వ శతాబ్దం నుండే సాహిత్యంలో లేఖ ప్రస్తావన ఉంది.  తెలుగులో మొదటి లేఖ  ప్రభావతి ప్రద్యుమ్నములో కనిపిస్తుంది.  శారదలేఖలుగా ప్రసిద్ధి పొందిన లేఖలు కనుపర్తి వరలక్షమ్మమ్మ  రాసినవి. కనుపర్తి గారు రాసిన లేఖలు ప్రత్యక్షంగా వ్యక్తికి రాసినవి కాదు.  కల్పిత పాత్రలతో కూడిన లేఖా రచన. మహిళలు, మూఢ నమ్మకాలు, సాంఘిక దురాచారాలు ఇలా అనేక విషయాలు చర్చిస్తూ  గృహలక్ష్మి పత్రికకు రాసినవి.

ఆధునిక కాలంలో  మనం మల్లీశ్వరి గారు రాసిన  లేఖలను  వర్ణిక లో చూడవచ్చు.

వర్ణిక లో కవిత్వ అంశాలు చాలా ఉంటాయి. కవిత్వాన్ని లేఖల రూపంలో రాయడానికి రచయిత్రి ఎంచుకున్నారు .  ప్రతి ఉత్తరం ఒక రసాత్మక కావ్యంగా ఉంటుంది. మరుగున పడిన  వందలాది పదాలకు వీరు లేఖల్లో జీవం పోశారు. ఇవన్నీ ఒక ప్రత్యేక శైలితో రాసిన లేఖలు.

మొదటి లేఖ "నిను చేరని నా పత్రిక" అనే శీర్షికతో ఉంది.  ఎవరికి చేరలేదు ? ఆ అందుకోవాల్సిన వారు ఎవరు? అనే దానికి సమాధానం లేఖ చదివితే తెలుస్తుంది.  తన స్నేహానికని.  ఆ స్నేహం ప్రియుడు కావచ్చు , భర్త కావచ్చు , హితుడు కావచ్చు.  లోకం విసిరే ఎడారి చూపులకు పచ్చని పంట ఏమవుతుందో అనే ఆవేదన కనపడుతుంది.  అయిన ఏ ముల్లు పొంచి ఉన్న మన ప్రేమకుభంగం రాదు అనే విశ్వాసాన్ని తెలుపుతుంది. తులసిలా పవిత్రమైన స్నేహానికి ఏ మచ్చ రాదనే భావాన్ని వ్యక్తపరుస్తుందీ లేఖ.

నీవే కవితా ..
అనే లేఖలో కవిత్వాన్ని నిర్వచిస్తారు.  కవిత్వం అంటే ఏమిటో తెలియజేస్తారు. కవికి కవిత్వానికి ఉన్న అవినాభవ సంబందం వివరిస్తారు.  కవికి ఎల్లా వేళలా కవిత్వపు ఊసే ఉంటుంది.  కలనైనా నీ తలపే కలవరమందైన నీ తలపే.  అందం ఆనందం వేదన వేకువ యోచన అన్ని కవిత్వమే.  కవితా రానంటావు రాతలు మారుస్తావు.." అంటూనే రంగుల హంగు కావాలంటావు అని నేటి కవిత్వ తత్వాన్నీ ఎత్తి చూపుతారు.

" నీవే  కవితా ఉసిగొల్పుతావు ఊపిరి అవుతావు  ఊర్జ మునిస్తూ ఊర్మి పెంచుతూ ఆకర్షిస్తూ ఆహ్లాదమౌతూ ఓదారుస్తూ ఎన్నో రూపాల్లో నీవే కవిత "  అని కవిత్వం గురించి చెబుతారు.

"కవిత నను వరించు నా పెదాల హసించు ..." అని కవిత్వాన్ని వేడుకుంటారు.

ఏదీ నీ అసలు రూపం అంటూ ప్రేమను ప్రేమగా ప్రశ్నిస్తారు.  లోకంలో ప్రేమ స్వరూపం ఎలా ఉందో వివరిస్తారు.  ప్రేమను ఎన్ని రకాలుగా చెప్పవచ్చునో అన్ని మాటలు చెప్పారు.  లోకమంతా నిండి ఉన్న నీ అసలు రూపం తెలియదు అని అడుగుతారు.  సుఖం దుఃఖం సంతోషము ముక్తి భక్తి రక్తి వాస్తవం మిథ్య అన్నీ ప్రేమ రూపాలే, అయినా నిన్ను అర్థం చేసుకోలేని మాకు అసలు రూపం చూపు అని ప్రేమగా అంటారు. అంతే గాక
ప్రేమ నీవుంటే ...అనే లేఖలో
"సౌరభముల నేలజిమ్ము పుష్ప వ్రజమ్ము.
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను " ..అని కృష్ణ శాస్త్రి కవితా పంక్తులతో మొదలు పెట్టి  ప్రేమ ఉంటే ఎలా ఉంటుందో చెప్తారు.  ప్రేమ ఉంటే జగత్తు రసాత్మకం.  ప్రేమ మధువు లాంటిది తాగేకొద్ది తియ్యనవుతుంది.  ప్రేమ మనసుకి రసానుభూతి. ప్రేమ అంటే విరబూసే పల్లవి.  ప్రేమలో జగత్తు అందం ఆనందంగా ఉంటుంది.  అన్నిటిని ప్రేమించే వాడికి అసలు దుఃఖపు ఛాయలు తెలుయవు.  చుట్టూ ప్రేమ పరుచుకున్న ఈ ప్రపంచంలో ఆధిపత్యం, అధికారం అహంతో ప్రేమ రాహిత్యంగా బతికే వాళ్ళను చూసి నిట్టూర్పు విడుస్తారు కవయిత్రి.   ప్రేమ ఉన్న చోట హెచ్చు తగ్గులకు చోటు ఉండదు.  అంతా స్వర్గంగా ఉంటుంది.   అని ప్రేమ జగత్తులో నిండాలని ఆకాంక్షిస్తారు.

తలపు జల్లులో :
కవి తలపుల్లో కవయిత్రి .  ఇక్కడ కవి అంటే కవిత. కవితల తలపుల్లో తాను నిరంతరం ఊగుతూ ఉంటారు.  ఏ కవి అయిన కవితల లోకంలో విహరించాల్సిందే.   క్షణమోపక చెవి వద్ద కవిత్వపు ఊసులు గుసగుసలుగా వినిపిస్తాయి.  అంటూ ఎల్లప్పుడూ నిన్ను వినమని మనసు బాధిస్తుంది. మనసు నీ తలపు జల్లులో తడిచి మోహనం కమ్మని నన్ను పురి గొల్పుతుంది.... అంటూ కవిత్వపు తలపును రసాత్మకం గా చెప్తారు.

నీవు మనిషివే కాదనను...
అనే లేఖలో మనిషి స్వభావాన్ని మరగా మారుతున్న మనిషిని ఎత్తి చూపుతారు.   ప్రకృతిని ప్రేమించలేని గుణం.  విలువలు వదిలేసిన తత్త్వం.  తనను తాను పతనం చేసుకుంటున్న మనిషి ప్రేమను ఆస్వాదించలేకపోతున్నాడు.  విశ్వనరుడని చెప్పుకుంటూ విశ్వాన్ని ప్రేమించని విరాగిగా మనిషిని నిలబెడతారు కవయిత్రి.

అబ్బో ఎన్ని లేవు నీలో
అసురా ...అంటూ చీకటి గురించి విశ్లేషిస్తారు ఓ లేఖలో.   చీకటికి మనిషికి ఉన్న అవినాభవ సంబంధం‌. మనిషి చీకటిని చీదరించుకుంటాడు  కానీ ఆ చీకటినే కోరుకుంటాడు.  అసలు చీకటి లేకపోతే వెలుగుకు విలువ లేదుగా .  చీకటిలోనేగా అలసిన దేహాలు సేదతిరేది.  మోహాలు సాంత్వన పొందేది.  మనసు శరీరం తపనలు తీర్చే చీకటి సౌఖ్యం ఇస్తుంది అంటారు .
"నీవో నిత్య దీపావళి పర్వానివి "...అని చీకటికి వందనం చేస్తారు.

కలలా కవితలా నీలో మిగులుతూ..కాలం నిలకడలేది....ఎక్కడ ఆగకుండా తన ప్రయాణం కొనసాగిస్తోంది.  ఒక్కో మజిలీ దాటుతూ నిత్య నూతనంగా పరుగు పెడుతుంది.  కదిలే కాలంలో మనిషి ఎన్నో జ్ఞాపకాలను ఆవేదనలను అనుభవాలను మరెన్నో గుర్తులను పొగుచేసుకుంటాడు.  ఒక్కో మైలు రాయి దాటి కాలం సాగుతున్న వైనం.  కాలం పోకడ నిలకడ లేక  ప్రయాణం సాగిస్తుంది.  "కాలాన్ని నేను.   అన్నిటికి సాక్షిని నేను"... అంటూ కాలం చెప్పే వీడ్కోలు గురించి వివరిస్తారు.

మాట గొప్ప చెప్ప మాటలు చాలవు.  కాని మాటల గొప్పదనం ఈ లేఖ చాటుతుంది.  మాట్లాడడం ఒక కళ.   నిజమే అందరికి మాట్లాడడం రాదు.  మెత్తగా పులా గుత్తిలా సుతిమెత్తగా హృదయానందంగా మాట్లాడడం రాదు.  "మాటకు మాట సింగారం.   మాటకు ప్రాణం సత్యం" అని ఇలా మాట గురించి సున్నితంగా చెబుతారు.   ఎదుటి వారిని నొప్పింకక తాను నొవ్వక కార్యము జరుగు విధంగా మాట్లాడాలి అంటారు.   ఒక అమ్మగా కుమారుడికి మాటల కళ గురించి వివరంగా చెప్తారు.

"ఆరని నెగడే" అనే లేఖ స్త్రీ అంతరంగాన్ని స్త్రీ పడుతున్న బాధలను  ఏకరువు పెడుతుంది. సమాజములో స్త్రీ కి ఉన్న స్థానం,  ఆమెను ఎలా ఆట బొమ్మగా చేసి అడిస్తున్నాడు మగాడు అనే విషయం చెప్తారు.   స్త్రీ నిరంతరంగా గాయపడుతూ పరుల కొరకు పారుతున్న నది.   నాటి నుండి నేటి వరకు స్త్రీ పడిన అగచాట్లు ఇంకా ఇప్పటికి ఆమె పడుతున్న వేదనను హృద్యంగా చెప్పారు.  నిజానికి నేటి వనిత ఏడు గుర్రాల స్వారీ చేసే సూర్యుడి కన్నా అన్నిటా మిన్న అనిపిస్తుంది... అంటారు.   నిజమే ఎన్నో విధాల స్త్రీ పురుషుడికి అండగా ఉంటుంది.  ఏమైనా స్త్రీ హృదయం ఎప్పుడు ఆరని మంట అని స్త్రీ మనోవేదన చాటుతారు.

చివరి లేఖ. 

నిశ్శబ్దమే తోడైన నింగి నీలిమా నిశి వేళ నింగి అందాలు, సోయగాలు తరాల నయగారాలు నిశిలో చేసే రసవిన్యాసాలు వర్ణిస్తారు ఈ లేఖలో.   కురిసే  తెలి వెన్నెల వెలుగుల వెలి వెలదై వలపు విన్యాసాల విలాస లాసమై ఎడదలను మురిపిస్తుంది..  అంటారు ఈ నిశి కష్ట జీవులకు నిద్ర గా సుఖాన్ని ఇస్తుంది.  మిణుకు మిణుకు మిణుగురు పురుగుల శోభతో లోకం మోహన రాగం పాడుతుంది ఈ నిశి వేళా అంటూ నిశిలోని జిలుగులు పరిచయం చేసారు.

ఇప్పటి వరకు వచ్చిన లేఖలు అన్ని వ్యక్తిగత సమస్యల చిత్రణ, వ్యక్తిత్వ వికాసపు చర్చ, కుటుంబ సమస్యలు, మనుగడ రాజకీయాలు, దేశభక్తి ఇలా ఎన్నో అంశాల మీద ఉన్నాయి.  కానీ మొదటి సారిగా సాహిత్యము సాహిత్యము కొరకు రచించిన లేఖలు ఇవి.  తనలో ఉన్న రస పుష్టిని,  భావాలను, చిత్రాలను, తాత్వికతను అక్షరాలుగా మలిచి లేఖలు గా సంధించారు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు.  పక్వానికి వచ్చిన మామిడి పండు ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా అంత పరిణతితో రాసిన లేఖలు ఈ వర్ణిక లేఖలు.

లేఖ ఎవరు రాస్తున్నారు ఎవరికి రాస్తున్నారు ఎందుకు రాస్తున్నారు అనే అంశాన్ని బట్టి రాస్తున్న వారి పేరు ఎన్నుకోవడం ఈ లేఖ రచనల్లో ఉన్న  ఓ ప్రత్యేకత.   ఆ పేర్లలో కూడా కవిత్వం ఉండేట్టు చూసుకోవడం కవయిత్రి చేసిన గొప్ప ప్రయోగం.  ఇది వరకు వచ్చిన లేఖల్లో అన్ని లేఖలకు రచయిత తన పేరే పెట్టేవారు.

మొదటి లేఖ స్నేహితుడికి‌.   దానికి రచయిత్రి ఎన్నుకున్న పేరు లేఖ రాసే వారి పేరు ప్రేముడిని, నీ ప్రియతనము.

అలాగే  దిగులు ఊసులు అనే లేఖను  వెన్నెల రేడా అని మొదలు పెట్టడం  దానికి తగినట్టు నీ కలువ చెలీ అని రాయడం.  ఎదురుచూపు లేక వియోగిని , జయ్ అనే తమ్ముని లేఖకు అక్క అని , "నీవే ఓ కవిత "కి కయి అని లేఖ అంశం యొక్క భావానికి తగినట్టుగా పేరు ఉండడం  ఈ వర్ణిక మరో  ప్రత్యేకత.  ఇలా ఎన్నో ప్రత్యేకతలను పొందు పరుచుకున్న వర్ణికను మీరూ ఓ సారి చదివి తెలుసుకుంటారు మరికొన్ని  ప్రత్యేకతల్ని.

Follow Us:
Download App:
  • android
  • ios