Bathukamma 2023: ఈ రోజే ఎంగిలిపూల బతుకమ్మ.. ఈ పేరెలా వచ్చిందో తెలుసా?
Bathukamma 2023: పూల పండుగ బతుకమ్మ పండుగను ఏండ్ల నుంచి జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజులు.. ఎనిమిది నైవేద్యాలతో సాగే ఈ పండుగను పళ్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బతుకమ్మను రోజుకో పేరుతో పిలుస్తారు. ఈ రోజు ఎంగిలిపూల బతుకమ్మ. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Bathukamma 2023: తెలంగాణాలో బతుకమ్మ సంబురాలు షురూ అయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి అంటే ఈ రోజు నుంచే మొదలయ్యాయి. ఇంకేముంది ఊరూ, వాడా బతుకమ్మ పాటలతో, ఆటలతో కోలాహలంగా మారిపోతుంది. తీరొక్క పువ్వుతో బతుకమ్మను అందంగా పేరుస్తారు. ఇంటిముందు పెట్టి బతుకమ్మ పాటలు చెప్పుకుంటూ ఆడుతారు. మీకు తెలుసా? తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పండుగ ఏరోజుకారోజు ప్రత్యేకంగా ఉంటుంది. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగను ఒక్కోరోజు ఒక్కోపేరుతో పిలుస్తారు. అలాగే రకరకాల నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.
బతుకమ్మ పండుగ మొదటి రోజు అంటే ఎంగిలి పూల బతుకమ్మను పెత్రామాస రోజున జరుపుకుంటారు. ఇక ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ పండుగ కొనసాగుతుంది. మరి మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకు అంటారంటే?
ఎంగిలిపూల బతుకమ్మ అని పేరు రావడానికి ఎన్నో కారణాలు చెప్తారు.. వాటిలో మొదటిది..
బతుకమ్మను అందంగా పేర్చడానికి ఆడవాళ్లు ఎన్నో రకాల పువ్వులను తెస్తారు. పెద్ద తాంబాలం తీసుకుని అందులో సరిపోయే విధంగా పూల కాడలను కత్తిరించి ఒకదగ్గర పెడతారు. అయితే పువ్వుల కాడలు సమానంగా ఉండేందుకు కత్తెరను కానీ, చేతులను గానీ ఉపయోగించకుండా నోటితో వీటిని తెంపుతారు. దీంతో అవి ఎంగిలి అవుతాయి. ఈ పువ్వులతో బతుకమ్మను పేర్చడం వల్ల మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారని చెబుతున్నారు. అంతేకాదు ఎంగిలిపూల బతుకమ్మను ఒకరోజు ముందుగానే తెంపిన పూలతో పేరుస్తారు. అంటే ఒకరోజు నిద్ర తర్వాత ఈ పువ్వులను బతుకమ్మను తయారుచేయడానికి వాడటం వల్ల కూడా ఈ పేరు వచ్చిందని చెప్తారు.
రెండోది: ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ పెత్రామాస రోజునే ప్రారంభమవుతుంది. ఇక ఈ పెత్రామాస రోజున పెద్దల ఆత్మకు శాంతి చేకూరాలని తర్పనాలు సమర్పిస్తారు. అంటే ఈ రోజు పొద్దున్నే భోజనం చేసిన తర్వాత సాయంత్రం బతుకమ్మను పేరుస్తారన్నమాట. ఈ కారణం వల్ల కూడా ఈ రోజును ఎంగిలిపూల బతుకమ్మ అంటారు.