గర్ల్‌ఫ్రెండ్‌ను రేప్ చేసి 111 సార్లు కత్తితో పొడిచి చంపిన నేరస్తుడికి రష్యా అధినేత పుతిన్ క్షమాభిక్ష! ఎందుకు?
బ్రేకప్ చెప్పిందని గర్ల్ ఫ్రెండ్‌ను ఆ రష్యా యువకుడు చిత్రహింసలు పెట్టాడు. మూడున్నర గంటలపాటు వేధించాడు. రేప్ చేశాడు. 111 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. అంతటి క్రూరుడికి రష్యా అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించి ఉక్రెయిన్ యుద్ధానికి పంపించాడు.
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ఓ దుండగుడు ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ను గంటలపాటు చిత్రహింసలు చేశాడు. రేప్ చేశాడు. 111 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌ను అత్యంత దారుణంగా హతమార్చిన కేసులో ఆ దుండగుడికి 17 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. కానీ, రష్యా ప్రభుత్వం మాత్రం ఆయనకు అనతి కాలంలోనే విముక్తి ప్రసాదించింది. ఏడాది కూడా జైలులో గడపకముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షమాభిక్షతో బయటకు వచ్చాడు. ఆయనను ఉక్రెయిన్ పై యుద్ధానికి సైన్యంలో ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంది.
వ్లాదిమిర్ కాన్యుస్, వేరా పెక్తెలేవా కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. కానీ, ఆమె బ్రేకప్ చెప్పింది. దీంతో కాన్యుస్ ఆమెను చంపేయాలని అనుకున్నాడు. మూడున్నర గంటలపాటు ఆమెను రేప్ చేసి టార్చర్ పెట్టాడు. 111 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఆమె అరుపులు విన్న ఇరుగు పొరుగు పోలీసులకు ఏడు సార్లు ఫోన్ చేసినా సమాధానం కరువైంది.
చివరికి ఆ కేసులో కాన్యుస్‌కు కఠిన శిక్ష పడింది. కానీ, కాన్యుస్ జైలు నుంచి విడుదలై కదనరంలో ఉన్నట్టు వేరా తల్లి ఓక్సానా తెలుసుకుంది. మిలిటరీ యూనిఫామ్‌లో ఓ ఆయుధాన్ని చేతపట్టుకుని కాన్యుస్ ఫొటోను చూసి ఆమె నిర్ఘాంతపోయింది. ఇది దారుణం. నా బిడ్డ సమాధిలో కరిగిపోతున్నది. నాకంటూ ఏమీ లేకుండా పోయింది. నా జీవితం, నా ఆశ నా బిడ్డే. నేను ఇప్పుడు జీవించడం లేదు. ప్రాణాలతో ఉన్నాను అంటే. ఇది నన్ను లోలోపల చంపేసింది. నేను చాలా దృఢమైన వ్యక్తిని కానీ, ఈ చట్ట రహిత అరాచక రాజ్యంలో చట్టాలేమీ సరిగ్గా అమలు కాకపోవడం నన్ను కుంగదీస్తున్నది. ఇప్పుడేం చేయాలే నాకు తెలియట్లేదు’ అని ఒక్సానా ఆవేదన వ్యక్తం చేశారు.
కాన్యుస్‌ను జైలు నుంచి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతం దక్షిణ రష్యాలోని రొస్తొవ్‌కు పంపినట్టు జైలు అధికారులు ధ్రువీకరించారని మహిళా హక్కుల కార్యకర్త అల్యోనా పొపొవా తెలిపారు. కాన్యుస్‌కు క్షమాభిక్ష ప్రసాదించినట్టు చెప్పే నవంబర్ 3వ తేదీతో ఉన్న రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీసు లేఖను పొపొవా షేర్ చేశారు. ఏప్రిల్ 27వ తేదీన కాన్యుస్‌కు ప్రెసిడెన్షియల్ డిక్రీ లభించినట్టు ఆ లేఖ తెలుపుతున్నది.
Also Read: అంగస్తంభనల కోసం వాటికి షాక్ థెరపీ.. 45 ఏళ్ల వయసులో ఆ మిలియనీర్ చేసే ప్రయోగాలివే
తన బిడ్డ హంతకుడిని క్షమించడాన్ని ఒక్సానా జీర్ణించుకోవడం లేదు. ఒక హంతకుడి చేతికి ఆయుధం ఇవ్వడమేమిటీ? ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన కలిగితే మా ప్రాణాలు ఏమైపోతాయి? అని ఒక్సానా ప్రశ్నించింది. కాన్యుస్ ఒక మూర్ఖుడు, నీతిబాహ్యమైన క్యారెక్టర్ కలవాడని, ఆయన రష్యాను రక్షించడానికి ఆర్మీలోకి తీసుకోవడం ఏమిటీ? అంటూ పదునైన ప్రశ్నలు వేసింది.
కాగా, కాన్యుస్ విడుదలపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. కాన్యుస్‌కు విముక్తి కల్పించే నిర్ణయాన్ని సమర్థించారు. వారు చేసిన రక్తపాత నేరాలకు ప్రాయశ్చిత్తం పొందడానికి ఖైదీలను ఉక్రెయిన్ యుద్ధానికి పంపినట్టు వివరించారు. తీవ్ర నేరాలు చేసిన వారు కూడా యుద్ధక్షేత్రంలో పాపప్రాయశ్చిత్తం పొందుతారని తెలిపారు.