జాబిల్లిపైకి జపాన్.. ఒకే సారి రెండు అంతరిక్షనౌకలను మోసుకెళ్లిన హెచ్2ఏ రాకెట్.. ఎప్పుడు ల్యాండ్ అవుతుందంటే ?
చంద్రుడిపైకి సాఫ్ట్ ల్యాండ్ అయ్యేందుకు జపాన్ హెచ్2ఏ రాకెట్ ను ప్రయోగించింది. ఈ రాకెట్ జపాన్ కాలమానం ప్రకారం ఉదయం 8.42 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్ -3 విజయవంతమైన నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా చంద్రుడిపైకి వెళ్లేందుకు ఆసక్తి కనబరస్తున్నాయి. దీని కోసం అనేక దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తాజాగా జపాన్ కూడా తన మూన్ మిషన్ ను ప్రయోగించింది. పలు ఎదురుదెబ్బలు, వాయిదాల తరువాత ఎట్టకేలకు గురువారం ఉదయం జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)కి చెందిన రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది.
ఈ ప్రయోగం విజయవంతం చేసి, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయిన ఐదో దేశంగా రికార్డు నెలకొల్పాలని జపాన్ చూస్తోంది. అక్కడి కాలమానం ప్రకారం గురువారం ఉదయం 8.42 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 5.12 గంటలకు) హెచ్2ఏ రాకెట్‌ను జపాన్‌లోని తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి జాక్సా ప్రయోగించింది. కాగా.. ఈ జపాన్ అంతరిక్ష నౌక చంద్ర కక్ష్యకు చేరుకోవడానికి 3-4 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ల్యాండ్ అవుతుందని భావిస్తున్నారు.
కాగా.. ఈ హెచ్2ఏ రాకెట్ ద్వారా ఒకే సారి రెండు అంతరిక్ష నౌకలను జాక్సా ప్రయోగించింది. మొదటిది ఎక్స్-రే టెలిస్కోప్ కాగా.. రెండోది తేలికపాటి మూన్ ల్యాండర్. ఇది భవిష్యత్తులో మూన్ ల్యాండింగ్ టెక్నాలజీకి ఆధారం కానుంది. జపాన్ కాలమానం ప్రకారం.. ఉదయం 8.56 గంటలకు టెలిస్కోప్‌ను, 9.29 గంటలకు మూన్‌ల్యాండర్‌ను వేరు చేశారు.
గత నెలలో భారత్ చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతమవగా.. రష్యాకు చెందిన లూనా-25 కూలిపోయింది. మేలో జపాన్ మిషన్ కూడా క్రాష్ అయింది. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఆ దేశానికి చాలా ముఖ్యం. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. జపనీస్ అంతరిక్ష విధాన నిపుణుడు కజుటో సుజుకి, 'జపనీస్ స్పేస్ కమ్యూనిటీకి ఇది నిర్ణయాత్మక క్షణం' అని అన్నారు.
అయితే ఈ ప్రయోగంలో జపాన్ 'స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్' (SLIM)ని ఉపయోగించింది. దాని సూపర్ ఖచ్చితమైన పిన్‌పాయింట్ ల్యాండింగ్ టెక్నాలజీ వల్ల దీనిని మూన్ స్నిపర్ అని కూడా పిలుస్తారు. స్లిమ్ తన లక్ష్యానికి 100 మీటర్ల దూరంలో ల్యాండ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాంప్రదాయ ల్యాండర్‌లతో పోలిస్తే ఇది చాలా తక్కువ దూరం. ఎందుకంటే ల్యాండర్‌లు సాధారణంగా అనేక కిలోమీటర్ల ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయి. స్లిమ్ లో అధునాతన ఇమేజింగ్ సాంకేతికత ఉపయోగించారు. నాసా ఆర్టెమిస్ మిషన్‌లో కూడా స్లిమ్ డేటా ఉపయోగించనున్నారు.