ఇక హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ భయమే అక్కర్లేదు... ఆర్నెళ్లకో ఇంజెక్షన్ వేసుకుంటే చాలు
దక్షిణాఫ్రికా, ఉగాండాలో ఓ పెద్ద క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. కొంత మంది యువతులకు కొత్త ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్‌ని ఏడాదికి రెండుసార్లు ఇచ్చి పరీక్షించారు. ఆ ఇంజెక్షన్ తీసుకున్నవారు HIV ఇన్‌ఫెక్షన్ నుంచి సంపూర్ణ రక్షణ పొందినట్లు తేలింది.
హెచ్‌ఐవీ బాధితులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ మెడిసిన్‌కి సంబంధించిన ట్రయల్ రన్‌ను కూడా విజయవంతంగా పూర్తిచేశారు.
కొత్తగా ట్రయల్ రన్ పూర్తిచేసిన ఈ మెడిసిన్ హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను 100 శాతం ప్రభావవంతంగా ఎదుర్కొంటున్నట్లు శాస్తవేత్తలు నిర్ధారించారు. ఏడాదికి రెండుసార్లు అంటే ఆర్నెళ్లకోసారి ఈ ఇంజెక్షన్ వేసుకుంటే ఇన్‌ఫెక్షన్ బారినుంచి బాధితులు ఉపశమనం పొందవచ్చని గుర్తించారు. ఆరు నెలలకోసారి వేసుకొనే ఇంజెక్షన్ లెనాకాపవిర్... HIV సంక్రమణకు తగ్గించేందుకు వాడే రెండు ఇతర ఔషధాల కంటే మెరుగైన రక్షణను అందిస్తుందని అధ్యయనం తేల్చారు.
ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్...
దక్షిణాఫ్రికా, ఉగాండాలో ఓ పెద్ద క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. ఓ మహిళలకు కొత్త ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్‌ని ఏడాదికి రెండుసార్లు ఇచ్చి పరీక్షించారు. ఇంజెక్షన్ తీసుకున్న మహిళ HIV ఇన్‌ఫెక్షన్ నుంచి సంపూర్ణ రక్షణ పొందినట్లు తేలింది.
అలాగే, ఈ ఆరు నెలల ఇంజెక్షన్‌తో పాటు HIV ఇన్‌ఫెక్షన్‌కు వ్యతిరేకంగా వినియోగించే రెండు ఇతర ఔషధాలను కూడా శాస్త్రవేత్తలు పరీక్షించారు. రోజువారీగా తీసుకొని రెండు మాత్రల కంటే ఇంజక్షన్ సమర్థవంతంగా పనిచేస్తుందని తేల్చారు. కాగా, ఈ మూడు మందులు ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ లేదా PrEP మందులు.
ఈ పురోగతిని చాలా కీలకమైందని ఈ అధ్యయనంలో పాల్గొన్న దక్షిణాఫ్రికా భాగానికి ప్రధాన పరిశోధకురాలు డాక్టర్ లిండా-గెయిల్ బెక్కర్ తెలిపారు.
అధ్యయనం ఏం తేల్చింది..?
ఉగాండాలోని 3 వేర్వేరు ప్రాంతాలు, దక్షిణ ఆఫ్రికాలోని 25 వేర్వేరు ప్రాంతాల్లోని 5వేల మందితో ట్రయల్ రన్ నిర్వహించారు. లెనాకాపవిర్, ఇతర రెండు ఔషధాల సామర్థ్యాన్ని పరీక్షించారు.
Lenacapavir (Len LA) అనేది ఫ్యూజన్ క్యాప్‌సైడ్ ఇన్హిబిటర్. HIV జన్యు పదార్థం, ప్రతిరూపణకు అవసరమైన ఎంజైమ్‌ల నుంచి రక్షించే ప్రోటీన్ షెల్. దీన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి చర్మం కింద ఇంజెక్ట్ చేస్తారు. రెండు పిల్స్‌తో పాటు ఈ ఇంజెక్షన్‌ను 5000 మందిపై పరీక్షించారు. ఈ ట్రయల్ రన్‌లో అనేక విషయాలను తెలుసుకున్నారు.
లెనాకాపవిర్ ఆరు-నెలల ఇంజెక్షన్ సురక్షితమేనా..?
దశాబ్ద కాలానికి పైగా వినియోగిస్తున్న Truvada F/TDF (ట్రువాడ F/TDF), కొత్త పిల్ Descovy F/TAF (డెస్కోవీ ఎఫ్/టీఏఎఫ్ F/TDF)ల కంటే లెనాకాపవిర్ ఆరు-నెలల ఇంజెక్షన్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందన్న అంశంపై 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలపై పరిశోధన చేశారు. డబుల్ బ్లైండ్ పద్ధతిలో 2:2:1 నిష్పత్తిలో మూడు ఔషధాలను పరీక్షించారు. అంటే, ఎవరికి ఏ చికిత్స అందిస్తున్నారో ట్రయల్‌లో పాల్గొన్నవారికి గానీ, పరిశోధకులకుగానీ అది పూర్తయ్యే వరకు తెలియదు.
కాగా, లెనాకాపవిర్ పొందిన 2,134 మంది మహిళల్లో ఎవరికీ HIV సోకలేదు. ట్రువాడ (F/TDF) తీసుకున్న 1,068 మంది మహిళల్లో 16 మంది, డెస్కోవీ (F/TAF) పొందిన 2,136 మందిలో 39 మంది HIV వైరస్ బారినపడ్డారని తేలింది.
PrEP మాత్రమే నివారణ సాధనం కాదు...
PrEP (ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ ) అనేది HIV రాకుండా నిరోధించడానికి తీసుకునే ఔషధం. ప్రిస్క్రిప్షన్ ప్రకారం తీసుకుంటే HIVని నిరోధించడానికి PrEP అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. సెక్స్ నుంచి HIV సంక్రమించే ప్రమాదాన్ని దాదాపు 99 శాతం తగ్గిస్తుంది. PrEP ఇంజక్షన్ డ్రగ్స్ వాడకం HIV వచ్చే ప్రమాదాన్ని కనీసం 74 శాతం తగ్గిస్తుంది.
అయితే, PrEP మాత్రమే నివారణ సాధనం కాదు. HIV స్వీయ-పరీక్ష, కండోమ్‌ల వినియోగం, లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్‌ల స్క్రీనింగ్, చికిత్స, ప్రసవ సామర్థ్యం ఉన్న మహిళలకు గర్భనిరోధకంలాంటి వాటితో పాటు PrEP మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.
మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందంటే?
గిలియడ్ సైన్సెస్ ప్రెస్ స్టేట్‌మెంట్ ప్రకారం.. రాబోయే రెండు నెలల్లో కంపెనీ అన్ని ఫలితాలతో కూడిన డోసియర్‌ను అనేక దేశాల రెగ్యులేటర్లకు, ముఖ్యంగా ఉగాండా, దక్షిణాఫ్రికా రెగ్యులేటర్‌లకు సమర్పిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ డేటాను సమీక్షించి.. సిఫార్సులను జారీ చేసే అవకాశం ఉంది. WHO మార్గదర్శకాల ప్రకారం మరిన్ని అధ్యయనాల్లో డ్రగ్‌ని పరీక్షిస్తారు. కాగా, జెనరిక్ ఔషధాలను తయారు చేసే కంపెనీలకు లైసెన్సులను అందజేస్తామని గిలియడ్ సైన్సెస్ పేర్కొంది. ప్రభుత్వాలు సరసమైన ధరలకు కొనుగోలు చేసేందుకు, HIV నుండి రక్షణ అవసరమయ్యేవారికి అందించేందుకు ఇదొక మంచి మార్గం అవుతుంది.
కాగా, గత ఏడాది 1.3 మిలియన్ల కొత్త హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. ఇది 2010లో నమోదైన 2 మిలియన్ ఇన్‌ఫెక్షన్‌ల కంటే తక్కువ కాగా.. 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్లు 5లక్షలకు మించకుండా చూడాలని UNAIDS లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇలా లక్ష్యం 2030 నాటికి కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది.