‘‘మా జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి.. ’’: కెనడాలో రోడ్డెక్కిన భారత విద్యార్థులు.. అసలేం జరిగిందంటే..
కెనడాలోని వందలాది మంది భారతీయ విద్యార్థులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మోసపూరిత అడ్మిషన్ లెటర్‌ల ద్వారా తమ దేశంలోకి అడుగుపెట్టారని 700 మంది ఇండియన్ స్టూడెంట్స్‌కు కెనడియన్ బార్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీబీఎస్ఏ) డిపోర్టేషన్ నోటీసులు ఇచ్చింది.

కెనడాలోని వందలాది మంది భారతీయ విద్యార్థులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మోసపూరిత అడ్మిషన్ లెటర్‌ల ద్వారా తమ దేశంలోకి అడుగుపెట్టారని 700 మంది ఇండియన్ స్టూడెంట్స్‌కు కెనడియన్ బార్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీబీఎస్ఏ) డిపోర్టేషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వీరిలో ఎక్కువ మంది పంజాబ్‌కు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలోనే కెనడాలోని వందలాది మంది భారతీయ విద్యార్థులు ఇందుకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు.
వివరాలు.. సీబీఎస్‌ఏ ఇటీవల 700 మంది భారతీయ విద్యార్థులకు డిపోర్టేషన్ లేఖలు జారీ చేసింది. విద్యార్థుల అడ్మిషన్ ఆఫర్ లెటర్లు నకిలీవని సీబీఎస్ఏ గుర్తించడంతో ఈ లేఖలు జారీ అయ్యాయి. కెనడాలోని విశ్వవిద్యాలయాలకు మోసపూరిత అడ్మిషన్ లెటర్‌ల ఆధారంగా వారు వీసాలు పొందారని అక్కడి అధికారులు ఆరోపించారు.
అయితే ఇందుకు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చిన విద్యార్థుల్లో చాలా మంది తాము 2018లో కెనడాకు వచ్చామని పేర్కొన్నారు. అయితే ఐదు సంవత్సరాల తర్వాత శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే నకిలీ లేఖలు వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు. ‘‘మేము కెనడాకు వచ్చినప్పుడు మా ఏజెంట్ మాకు అడ్మిషన్ లెటర్‌లు అందుకున్న కాలేజీలలో సీట్లు నిండిపోయాయని మాకు చెప్పారు. విశ్వవిద్యాలయాలు ఓవర్‌బుకింగ్ చేస్తున్నందున మమ్మల్ని వేరే కాలేజీకి బదిలీ చేయగలనని అతను చెప్పాడు. మేము ఏడాది కోల్పోవడానికి ఇష్టపడలేదు.. అందుకే ఆ ప్రతిపాదనకు మేము అంగీకరించాము. మేము కాలేజీని మార్చాము. మా చదువును పూర్తి చేసాం. కానీ మూడు-నాలుగు సంవత్సరాల తరువాత.. మేము మా వీసాలు పొందిన అడ్మిషన్ లెటర్ మోసపూరితమైనదని సీబీఎస్‌ఏ ద్వారా మాకు చెప్పబడింది’’ అని నిరసనల్లో పాల్గొన్న చమన్‌దీప్ సింగ్ అనే వ్యక్తి ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
మరో విద్యార్థి లవ్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. బహిష్కరణ భయాలు విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా చాలా మంది ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు. ‘‘ఈ సమస్య గురించి కెనడా ప్రభుత్వంతో మాట్లాడాలని మేము భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. మేము అమాయకులం, మోసానికి గురయ్యాము. మా జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. 700 మంది విద్యార్థులు అనేది ఒక అంచనా మాత్రమే.. బాధిత విద్యార్థుల వాస్తవ సంఖ్య ఎక్కువ. చాలా మంది మౌనంగా ఉన్నారు. ముందుకు రావడం లేదు. జూన్ 30న నాకు బహిష్కరణ నోటీసు వచ్చింది. కెనడాకు రావడానికి మేము ఎంతో పొదుపు చేసుకుని రావాల్సి వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని తిరిగి వెళ్ళమని అడుగుతున్నారు’’ అని చెప్పారు.
ఈ సమస్యపై పంజాబ్ ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ మాట్లాడుతూ.. కెనడాలో 700 మంది స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ‘‘విద్యార్థులు కెనడాకు వెళ్లేందుకు చాలా డబ్బు ఖర్చు చేశారు. కొన్ని కుటుంబాలు తమ పిల్లలను విదేశాలకు పంపేందుకు తమ భూమిని కూడా అమ్మేశాయి’’ అని పేర్కొన్నారు. అలాగే కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జై శంకర్‌కు లేఖ కూడా రాశారు.
‘‘ఈ (700) విద్యార్థులు అమాయకులు. మోసగాళ్ల గుంపుచే మోసగించబడ్డారు. మీరు మళ్లీ ఈ విషయాన్ని వ్యక్తిగతంగా పరిశీలించి.. కెనడా హైకమిషన్, కెనడా ప్రభుత్వంతో సహా సంబంధిత ఏజెన్సీలతో ఈ విషయాన్ని తీసుకెళితే నేను చాలా కృతజ్ఞుడను. తద్వారా ఈ విద్యార్థులు బహిష్కరణకు గురికాకుండా కాపాడబడతారు’’ జై శంకర్‌కు రాసిన లేఖలో కుల్దీప్ సింగ్ ధాలివాల్ కోరారు. పంజాబ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరింది.
విద్యార్థులు వీధుల్లో తమ నిరసనలను కొనసాగించడంతో.. ఈ సమస్య కెనడా పార్లమెంటుకు చేరుకుంది. అక్కడ న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ) నాయకుడు జగ్మీత్ సింగ్ ఈ విద్యార్థుల బహిష్కరణను నిలిపివేస్తారా? అని ప్రధాని జస్టిన్ ట్రూడోను అడిగారు. ఇందుకు బదులిచ్చిన ప్రధాని ట్రూడో.. తమ దృష్టి నిందితులను గుర్తించడంపైనే ఉందని, బాధితులకు జరిమానా విధించడంపైన కాదని చెప్పారు. మోసానికి గురైన బాధితులు తమ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ విద్యార్థులు తమ దేశానికి అందిస్తున్న అపారమైన సహకారం గురించి తాము గుర్తించామని చెప్పారు.