ప్రపంచంలో 8వ వింతగా అంగ్‌కోర్ వాట్ .. 500 ఎకరాల విస్తీర్ణం, 1000 ఏళ్ల చరిత్ర, కాంబోడియాకే తలమానికం
కంబోడియా నడిబొడ్డున ఉన్న అంగ్‌కోర్ వాట్ హిందూ దేవాలయం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇటలీలోని పాంపీని పక్కకునెట్టి ప్రపంచంలోని ఎనిమిదో వింతగా నిలిచింది. 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ II అనే రాజు నిర్మించిన అంగ్‌కోర్ వాట్ హిందువుల ఆరాధ్యదైవం శ్రీమహా విష్ణువుకు అంకితం చేయబడింది.
కంబోడియా నడిబొడ్డున ఉన్న అంగ్‌కోర్ వాట్ హిందూ దేవాలయం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇటలీలోని పాంపీని పక్కకునెట్టి ప్రపంచంలోని ఎనిమిదో వింతగా నిలిచింది. ప్రపంచంలోని 8వ వింత అనేది కొత్త భవనాలు లేదా ప్రాజెక్ట్‌లు లేదా డిజైన్‌లకు ఇవ్వబడిన అనధికారిక శీర్షిక. 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ II అనే రాజు నిర్మించిన అంగ్‌కోర్ వాట్ హిందువుల ఆరాధ్యదైవం శ్రీమహా విష్ణువుకు అంకితం చేయబడింది. అయితే తదనంతరకాలంలో అది బౌద్ధ దేవాలయంగా రూపాంతరం చెందింది. హిందూ , బౌద్ధ పురాణాలలోని దృశ్యాలను వర్ణించేలా ఆలయ గోడలపై వున్న శిల్పాలను గమనిస్తే ఇది హిందూమతం నుండి బౌద్ధమతానికి ఎలా మార్పు చెందింది స్పష్టంగా కనిపిస్తుంది.
అంగ్‌కోర్ వాట్ దక్షిణాసియాలోని అత్యంత ముఖ్యమైన పురావస్తు ప్రదేశాలలో ఒకటి. ఇది కంబోడియాలోని సీమ్ రీప్‌కు ఉత్తర ప్రావిన్స్‌లో వుంది. దాదాపు 400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి వున్న ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడంగా అంగ్‌కోర్ వాట్ గిన్నింగ్ వరల్డ్ రికార్డ్స్‌ను కలిగి వుందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఈ క్రమంలోనే ఇది ప్రపంచంలోనే 8వ వింతగా మారింది. కంబోడియాకు వచ్చే విదేశీ పర్యాటకులు ఖచ్చితంగా సందర్శించే ప్రదేశాల్లో ఇది ఒకటి.
అంగ్‌కోర్ వాట్ ఆలయ సముదాయానికి ఇప్పటికే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు వుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన స్మారక చిహ్నం. దీనిని ప్రతి యేటా లక్షలాది మంది సందర్శకులు సందర్శిస్తారు. అంగ్‌కోర్ వాట్ ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం ఎనిమిది చేతులతో ఆకర్షణీయంగా వుంటుంది. స్థానికులు ఆయనను తమ రక్షక దేవతగానూ గౌరవిస్తారు. అంగ్‌కోర్ వాట్‌ను ప్రపంచంలోని ఎనిమదవ వింతగా మార్చింది దాని నిర్మాణ నైపుణ్యమే. ఈ ఆలయం సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి వుంది. దాని వెలుపలి గోడల చుట్టూ భారీ కందకం వుంది. సెంట్రల్ టెంపుల్ కాంప్లెక్స్ సమరూపత, ఖచ్చితత్వాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. హిందూ, బౌద్ధ విశ్వోద్భవ శాస్త్రంలో చెప్పిన విధంగా పౌరాణిక మేరు పర్వతాన్ని సూచించే ఐదు తామర ఆకారపు టవర్లను కలిగి వుంటుంది.
అంగ్‌కోర్ వాట్ గోడలపై చెక్కిన హిందూ ఇతిహాసాలు, చారిత్రక సంఘటనలు, ఖైమర్ ప్రజల రోజువారీ జీవితాన్ని వర్ణించే పురాతన దృశ్య ఎన్‌సైక్లోపీడియా వలే వుంటాయి. ఈ శిల్పాలలోని వివరాల స్థాయి ఖచ్చితంగా విస్మయం కలిగిస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో పనిచేసిన కళాకారుల నైపుణ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. అంగ్‌కోర్ వాట్‌లోని పెద్ద టవర్‌లపై నిలబడి సూర్యోదయాన్ని వీక్షించడం అద్భుతమైన అనుభవంగా సందర్శకులు చెబుతారు. తెల్లవారుజామున ఈ ఆలయం గులాబీ, నారింజ, బంగారు రంగుల్లో వెలుగుతూ కనిపిస్తుంది.
నిర్మాణ వైభవానికి మించి.. అంగ్‌కోర్ వాట్ అపారమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. ఈ ఆలయం చురుకైన మతపరమైన ప్రదేశంగా మిగిలిపోయింది. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో బౌద్ధ సన్యాసులు, భక్తులను ఆకర్షిస్తూ వుంటుంది.