బ్రిటీష్ పాలకులకు మొదటి సారి షాక్ ఇచ్చిన.. సహాయ నిరాకరణ ఉద్యమం
భారత స్వాతంత్ర సమర దిశను మార్చిన ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం. తొలిసారి బ్రిటీష్ పాలకులకు ఝలక్ ఇచ్చింది. మహాత్మా గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ 1920 సెప్టెంబర్ 5న ఈ ఉద్యమం మొదలుపెట్టింది. అప్పుడు నలుమూలల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన తొలి ఉద్యమం ఇది.
హైదరాబాద్: బ్రిటీష్ పాలకులకు మొదటి సారి ఝలక్ ఇచ్చిన ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం. తాము చేసిందే శాసనం అన్నట్టుగా వ్యవహరించిన బ్రిటన్ పాలకులను ఒక్కసారిగా ఖంగు తినిపించింది. మహాత్ముడు తొలిసారి దేశవ్యాప్తంగా శ్రీకారం చుట్టిన తొలి ఉద్యమం. రక్తపాత ఊచకోతకు గాంధీ తన మార్క్ శైలి అహింస పునాదిగా చేపట్టిన పోరాటం. 1920 నవంబర్ సెప్టెంబర్ 5వ తేదీన మహాత్మా గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించింది. కలకత్తాలో కాంగ్రెస్ సెషన్‌లో ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టింది. భారత స్వాతంత్ర్య సమరాన్ని మలుపు తిప్పిన ఉద్యమంగా మారింది.
సహాయ నిరాకరణ ఉద్యమానికి తక్షణ కారణాలుగా రెండు ఉన్నాయి. ఒకటి జలియన్‌వాలాబాగ్ ఉదంతం, మరొకటి బ్రిటీష్ ప్రభుత్వం తెచ్చిన రౌలత్ చట్టం. రాజద్రోహం అభియోగాల కింద విచారణ ఎదుర్కొంటున్న రాజకీయ ఖైదీల హక్కులు అన్నింటినీ రద్దు చేస్తూ బ్రిటీష్ పాలకులు రౌలత్ చట్టాన్ని తెచ్చారు. దీన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ వ్యతిరేకతలో నుంచే మహాత్మా గాంధీ సత్యాగ్రహానికి ప్రణాళికలు చేశారు. అదే సమయంలో పంజాబ్‌లోని అమృత్‌సర్ దగ్గర జలియన్‌వాలాబాగ్ ఉదంతం చోటుచేసుకుంది. సైఫుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్ అరెస్టులను వ్యతిరేకిస్తూ కొందరు, బైసాఖి ఫెస్టివల్ కోసం ఇంకొందరు స్వర్ణదేవాలయం సమీపంలోని జలియన్‌వాలాబాగ్ దగ్గర గుమిగూడారు.
బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయర్ ఆదేశాలతో గుమిగూడిన నిరాయుధ ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ ఊచకోతలో రక్తపాతం ఏరులై పారింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు రగిల్చింది. అహింసను బోధించే మహాత్మా గాంధీ కూడా దీనిపై అదిరిపడ్డాడు. బ్రిటన్ పాలనపై ఆయనకు ఇక ఎంతమాత్రం నమ్మకం లేకుండా పోయింది. బ్రిటన్ పాలనను గౌరవించడం అంటే దుష్టశక్తులను విశ్వసించినట్టేనని అన్నారు. ఆ క్రమంలోనే ఆయన బ్రిటీష్ ప్రభుత్వానికి సహకరించరాదనే పిలుపు ఇచ్చారు.
ఇక్కడ బ్రిటీష్ ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి, వారి ఆర్థికం వృద్ధి చెందడానికి దోహదపడే ఏ కార్యమైనా సరే ప్రజలు అందుకు దూరంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. మహాత్మా గాంధీ పిలుపును ఆదరిస్తారని చాలా మంది కాంగ్రెస్ నేతల్లోనూ అప్పుడు నమ్మకం లేదు. కానీ, ప్రజలు గాంధీ పిలుపును అందిపుచ్చుకుని సహాయ నిరాకరణ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
బ్రిటీష్ ప్రభుత్వానికి చెందిన అన్ని కార్యాలయాలు, ఫ్యాక్టరీల నుంచి పనులు మానుకుని బయటకు వచ్చారు. బ్రిటీష్ ప్రభుత్వ అధీనంలోని పాఠశాలలు, పోలీసు సేవలు, పౌర సేవలు, న్యాయవాద వృత్తి నుంచీ చాలా మంది బయటకు వచ్చేశారు. అప్పటి ప్రజా రవాణ సేవలనూ స్వీకరించలేదు. ఇంగ్లీషువారు తయారుచేసిన సరుకులు ముఖ్యంగా బట్టలను బహిష్కరించారు. బ్రిటన్ ప్రభుత్వం అందించిన అవార్డులు, గౌరవ హోదాలను తృణీకరించారు. ఉపాధ్యాయులు, లాయర్లు, మిలిటరీ శాఖల్లో చేరినవారూ రాజీనామాలు చేసి వెనక్కి వచ్చేశారు.
బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి, దానికి అధికార యంత్రాంగం, ఆర్థిక విధానాలను సవాల్ చేయడమే సహాయ నిరాకరణ ఉద్యమం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ సవాళ్లే భారత్‌కు విముక్తి ఇచ్చేలా బ్రిటీష్ పాలకులను ఒత్తిడి తెస్తాయనే ఆలోచనలు ఈ ఉద్యమం వెనుక ఉన్నాయి.
సహాయ నిరాకరణ ఉద్యమం అస్పృశ్యతకూ అంతం పలకాలని పిలుపు ఇచ్చింది.
దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ, ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని చౌరీ చౌరలో ఓ లిక్కర్ షాప్‌ను ప్రజలు దిగ్బంధించిన సందర్భంలో పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఒక మూక తీవ్ర ఆగ్రహానికి లోనై 22 మంది పోలీసులు లోపల ఉండగానే పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం హింసాత్మకం కావడంతో మహాత్మా గాంధీ దాన్ని ఉన్నపళంగా నిలిపేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఆయన 1922 ఫిబ్రవరి 22న ఆపేయాలని పిలుపు ఇచ్చారు.
గాంధీ పిలుపుతో చాలా మంది విభేదించారు. కానీ, ఒక ఉద్యమం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మరింత ఉవ్వెత్తున ఎగసేలా మరో ఉద్యమాన్ని చేపట్టే వ్యూహాన్ని గాంధీ అనుసరించినట్టు ఆయన ఉద్యమాల పరంపరను చూస్తే అర్థం అవుతుంది. 1930-34 మధ్యలో ఆయన చేపట్టి ఉప్పు సత్యాగ్రహం విజయవంతమైంది. కాంగ్రెస్ పెట్టిన డిమాండ్లు సాధించుకుంది. దీంతో కాంగ్రెస్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేదిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రజా తరఫు పార్టీగా బ్రిటీషర్లు కాంగ్రెస్‌ను గుర్తించారు.