హనీ ట్రాప్ : వలపువలలో చిక్కుకున్న రిటైర్డ్ ఉద్యోగి.. న్యూడ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసిన వ్యభిచార ముఠా...
అదిలాబాద్ లో ఓ రిటైర్డ్ ఉద్యోగి హనీట్రాప్ అయ్యాడు. అమ్మాయికోసం ఆశపడి వెళ్లి.. వ్యభిచార ముఠా చేతిలో చిక్కుకున్నాడు.
ఆదిలాబాద్ : ఓ రిటైర్డ్ ఉద్యోగి వలపు వలలో చిక్కుకున్నాడు. అతని లక్ష్యంగా వ్యభిచార ముఠా వేసిన గాలానికి చిక్కుకున్నాడు. యువతుల మీద ఆశతో వారు పన్నిన పన్నాగంలో చిక్కుకుని లబోదిబోమంటున్నాడు. వారు రమ్మన్న చోటికి వెళ్లిన రిటైర్డ్ ఉద్యోగిని నిండా ముంచేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఆ రిటైర్డ్ ఉద్యోగి న్యూడ్ ఫోటోలు తీసి, సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్మెయిల్ చేశారు.
తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తమ మీద వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు చెబుతామని.. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో భయపడ్డ ఆ రిటైర్డ్ ఉద్యోగి ఆ వ్యభిచార మూఠాకు కొన్ని డబ్బులు ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాడు. అతని ఫిర్యాదు మేరకు వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బుధవారం నాడు ఆ ముఠా గుట్టు రట్టు చేశారు.
ఈ ఘటన అదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సంబంధించిన వివరాలలోకి వెళితే..అదిలాబాద్ వాల్మీకి నగర్ సమీపంలోని ఆర్కే కాలనీలో మహిళ ఇల్లు అద్దెకి తీసుకుంది. ఆ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోంది. అదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతనికి ఇటీవల ఆమె ఫోన్ చేసింది.
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ వచ్చిందని ఆమెకు వెయ్యి రూపాయలు, నాకు 500 ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. అతను తనకు తెలిసిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఉన్నాడని.. అతడిని పంపిస్తానని చెప్పాడు. ఇద్దరు కలిసి అతన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాలని పథకం వేశారు. వీరి ప్లాన్ ప్రకారం రిటైర్డ్ ఉద్యోగి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగిని గదిలోకి పంపించి మరో మహిళతో న్యూడ్ ఫోటోలు తీసింది.
ఆ తర్వాత ఆ గదిలోకి మరో మహిళతో కలిసి వెళ్లిన నిర్వాహకురాలు బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డారు. తమకు తెలుసునని, ఈ విషయం వారికి చెప్పి జైలుకు పంపిస్తానంటూ భయపెట్టారు. కాసేపటి తర్వాత రిటైర్డ్ ఉద్యోగిని అక్కడికి పంపించిన వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లుగా అతని దగ్గరికి వెళ్లి విషయం అంతా ఆరా తీశాడు. ఆ తర్వాత మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, ఆ ముఠా వైపు నుంచి మాట్లాడి రెండు లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు రూ.40 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆ సమయంలో బాధితుడు దగ్గర ఉన్న మూడువేల రూపాయలు ఆధార్ కార్డ్, సెల్ ఫోన్ తీసుకుని మిగతా డబ్బులు తీసుకువచ్చి ఇచ్చిన తర్వాత వాటిని తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడి నుంచి బయటపడ్డ బాధితుడు మంగళవారం సాయంత్రం వన్ టౌన్ పోలీసులను దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వీరంతా అదిలాబాద్ పట్టణానికి చెందిన వారేనని డిఎస్పీ ఉమేందర్ తెలిపారు.
డీఎస్పీ ఉమేందర్ మాట్లాడుతూ ఎక్కడైనా వ్యభిచారం జరుగుతున్నట్లుగా తెలిస్తే వెంటనే డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఇల్లు అద్దెకు ఇచ్చేముందు యజమానులు వివరాలు పూర్తిగా తెలుసుకోవాలన్నారు. ఈ ముఠా గురించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. వీరు గత ఆర్నెలలుగా వ్యభిచారం చేస్తున్నట్లు తెలిందన్నారు.