Oppenheimer Review: నోలెన్ తెరకెక్కించిన 'ఓపెన్ హైమర్' రివ్యూ
ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇండియాలో కూడా మల్టిఫ్లెక్స్ ఆడియన్స్ లో క్రిస్టఫర్ నోలెన్ చిత్రాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది.ఈ మాస్టర్ స్టోరీ టెల్లర్ నుంచి వచ్చిన తాజా చిత్రం ఓపెన్ హైమర్. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త రాబర్ట్ జె. ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం తెరకెక్కించారు.
ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇండియాలో కూడా మల్టిఫ్లెక్స్ ఆడియన్స్ లో క్రిస్టఫర్ నోలెన్ చిత్రాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. నోలెన్ తెరకెక్కించే చిత్రాలని ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూసి ఆ అనుభూతి పొందాలని ఆయన ఫాన్స్ అనుకుంటున్నారు. నోలెన్ అందించే విజువల్, టెక్నికల్ ఎక్స్పీరియన్స్ మరో స్థాయిలో ఉంటుంది. ఈ మాస్టర్ స్టోరీ టెల్లర్ నుంచి వచ్చిన తాజా చిత్రం ఓపెన్ హైమర్.
అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త రాబర్ట్ జె. ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం తెరకెక్కించారు. మొట్టమొదటి అణుబాంబు సృష్టించింది ఆయనే. అణుబాంబు పితామహుడిగా రాబర్ట్ ఓపెన్ హైమర్ గుర్తింపు పొందారు. రాబర్ట్ జె ఓపెన్ హైమర్ బయోగ్రఫీ నవల 'అమెరికన్ ప్రొమిథియస్' అనే నవల ఆధారంగా నోలెన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అంటే 1945లో అమెరికా మెక్సికో ఎడారిలో అమెరికా న్యూక్లియర్ టెస్ట్ ప్రాజెక్టు చేపడుతుంది. శత్రు దేశాలని ఎదుర్కొనేందుకు అణుబాంబు తయారు చేసి టెస్ట్ చేయాలనేది ఆ ప్రాజెక్టు లక్ష్యం. అప్పుడే థీరిటికల్ ఫిజిసిస్ట్, న్యూక్లియర్ ఫిజిక్స్ లో పరిజ్ఞానం ఉన్న శాస్త్రవేత్తగా ఎదుగుతుంటారు. ఆ భయంకర ప్రాజెక్ట్ లోకి ఓపెన్ హైమర్ ని అమెరికా అపాయింట్ చేస్తుంది.
ఈ ప్రాజెక్టు లోకి ఎంటర్ అయిన ఓపెన్ హైమర్ కి అనేక సవాళ్లు ఎదురవుతాయి. శత్రువులు కూడా ఉంటారు. వినాశనానికి కారణం అయ్యే అణుబాంబు తయారీలో ఓపెన్ హైమర్ పాత్ర ఏంటి ? ఓపెన్ హైమర్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు ? తొలిసారి అణుబాంబుని టెస్ట్ చేసే సమయంలో అతడి మానసిక పరిస్థితి ఎలా ఉండేది ? చివరికి ఓపెన్ హైమర్ రియలైజ్ అయ్యింది ఏంటి ? లాంటి అంశాలు ఈ కథలో కీలకంగా ఉంటాయి.
విశ్లేషణ :
క్రిస్టఫర్ నోలెన్ చిత్రాలు గమనిస్తే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి. అయితే నోలెన్ గత చిత్రాలతో పోలిస్తే ఈ మూవీ అంత అంత కన్ఫ్యూజన్ నేరేషన్ తో ఉండదు. ఈ చిత్రంలో సిల్లియన్ మర్ఫీ.. ఓపెన్ హైమర్ గా ప్రధాన పాత్రలో నటించారు. అతడి నటన సినిమాకి హైలైట్ అని చెప్పాలి. అతడు పలికించే ప్రతి హావభావం ఓపెన్ హైమర్ ని గుర్తు చేసే విధంగా ఉంటుంది. ఓపెన్ హైమర్ లా ఈ పాత్రలో సన్నగా కనిపించేందుకు సిల్లియన్ మర్ఫీ కొన్ని రోజులు కేవలం ఒకే ఒక్క బాదం పప్పు తిని డైట్ ఫాలో అయ్యాడట. అతడి డెడికేషన్ స్క్రీన్ పై చేతులెత్తి చప్పట్లు కొట్టే విధంగా ఉంటుంది.
కళ్ళతోనే నటిస్తూ ఓపెన్ హైమర్ ఎమోషనల్ మూమెంట్స్ ని అద్భుతంగా పండించాడు. దర్శకుడు నోలెన్ ఆ పాత్రని ప్రజెంట్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరిని మెప్పించే మరో పాత్ర ఐరెన్ మ్యాన్ రాబర్ట్ డౌనీ జూనియర్. రాబర్ట్ డౌనీ ఈ చిత్రంలో అటామిక్ ఎనేర్జి కమిషన్ చైర్మన్ లూయీస్ ట్రోస్ పాత్రలో నటించారు. ఓపెన్ హైమర్ కి అతడే ఈ చిత్రంలో ప్రధాన శత్రువు.
గొర్రెల కాపరిగా నటించిన మాట్ డామన్ పాత్ర కూడా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. హీరోయిన్లుగా ఎమిలీ బ్లంట్, ఫ్లోరెన్స్ పగ్ ఇద్దరూ పర్వాలేదనిపించే విధంగా నటించారు. కాలేజీ కుర్రాడిగా ఉన్నప్పుడు ఓపెన్ హైమర్ ఎలా ఉండేవాడు.. ఆ తర్వాత సైంటిస్ట్ అయ్యాక అతడి బిహేవియర్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే సన్నివేశాలని నోలన్ కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఇక అణుబాంబుని టెస్ట్ చేసే సమయంలో ఓపెన్ హైమర్ ఎలా మదనపడ్డాడు అని చూపించే సన్నివేశాలలో.. సిల్లియన్ మర్ఫీ బెస్ట్ యాక్టింగ్ బయటకి వస్తుంది. మానవత్వాన్ని ఒక వెపన్ లో పెట్టి వినాశనం చేస్తున్నాను అని ఓపెన్ హైమర్ వేదన చెందే సన్నివేశంలో సిల్లియన్ మర్ఫీ ఎంతో ఎమోషనల్ గా నటించారు.
జపాన్ పై అణుబాంబు పేల్చాక ' ఇప్పుడు నేనే చావునయ్యాను.. నేనే ప్రపంచాన్ని నాశనం చేస్తాను' అంటూ ఓపెన్ హైమర్ పాత్రలో మర్ఫీ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇలా ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రంతో ఇన్వాల్వ్ అవుతారని గ్యారెంటీ లేదు. ఎందుకంటే 3 గంటల నిడివి ఉన్న విభిన్నమైన చిత్రం. ఫిజిక్స్, న్యూక్లియర్ సైన్స్ పై ఆసక్తి కాస్త అవగాహన ఉన్న వారు రిలేట్ కాగలుగుతారు. ఈ చిత్రంలోని టెక్నికల్ బ్రిలియన్స్ ని ఎంజాయ్ చేయాలంటే కాస్త అవగాహనా ఆసక్తితో వెళ్ళాలి.
టెక్నికల్ గా
వరల్డ్ వార్ 2 టైంలో జరిగిన కథ కాబట్టి యుద్ధం లాంటి యాక్షన్ ఎపిసోడ్స్, స్టంట్స్ లాంటివి ఏమాత్రం ఆశించవద్దు. ఇది కంప్లీట్ గా ఓపెన్ హైమర్ అటామిక్ బాంబ్ తయారీ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ? ఆ ప్రాసెస్ ఎలా జరిగింది అని చూపించే చిత్రం. టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఇది నెక్స్ట్ లెవల్ మూవీ. నోలెన్ ఈ చిత్రంపై ఎంతో అధ్యయనం చేసి ఐమాక్స్ స్క్రీన్ కెమెరాతో చిత్రీకరించారు. దీనితో విజువల్ చూస్తూనే సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు.
అలాగే సౌండ్ డిజైన్ అయితే మరో లోకంలోకి తీసుకువెళుతుంది. జస్ట్ వావ్ అనిపించే విధంగా బిజియం సౌండ్ డిజైన్ ఉంటుంది. లుడ్విన్గ్ గోరాన్సన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అటామిక్ బాంబ్ సన్నివేశం వచ్చినప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ దద్దరిల్లే విధంగా ఉంటుంది. పలు విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ బరిలో ఉంటుందని తప్పకుండా అంచనా వేయొచ్చు.
ఫైనల్ థాట్:
అణుబాంబు పితామహుడు రాబర్ట్ జె ఓపెన్ హైమర్ జీవిత చరిత్రని క్రిస్టఫర్ నోలెన్ అద్భుతమైన అనుభూతి ఇచ్చే విజువల్ వండర్ గా మలిచారు. ఈ తరహా చిత్రాలపై ఆసక్తి ఉన్నవారు థియేటర్స్ లో మిస్ కాకుండా చూడండి. మిగిలిన వారు అది మీ ఛాయిస్.