Asianet News TeluguAsianet News Telugu

Sindhooram Movie Review: `సిందూరం` మూవీ రివ్యూ..

 ఒకప్పటి క్లాసిక్ చిత్రం ‘సిందూరం’ను గుర్తు చేస్తూ అదే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా `సిందూరం`. ఎర్రజెండా, నక్సల్స్ నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. నూతన నటీనటులు, దర్శకుడు కలిసి చేసిన ఈ చిత్రం ఎలా ఉంది? నేటి తరానికి కనెక్ట్ అవుతుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

sindhooram movie review
Author
First Published Jan 26, 2023, 7:23 PM IST

కథలో కొత్తదనం ఉన్న సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కుతున్న విషయం తెలిసిందే. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. కంటెంట్‌ ఉన్న సినిమాలను జనం ఆదరిస్తున్నారు. థియేటర్లలో ఆదరణ దక్కకపోయినా ఓటీటీలోనూ మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకప్పటి క్లాసిక్ చిత్రం ‘సిందూరం’ను గుర్తు చేస్తూ అదే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా `సిందూరం`. ఎర్రజెండా, నక్సల్స్ నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. నూతన నటీనటులు, దర్శకుడు కలిసి చేసిన ఈ చిత్రం ఎలా ఉంది? నేటి తరానికి కనెక్ట్ అవుతుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ : 
తెలంగాణలోని ఖమ్మం జిల్లా పినపాకకు చెందిన  రవి (ధర్మ), శిరీష కాలేజీ ఫ్రెండ్స్. చదువు పూర్తయ్యాక  శిరీష ఎమ్మార్వో గా సొంత ఊరికే అధికారిగా వెళ్తుంది. రవికి ఉద్యోగం కంటే బాడ్మింటన్ స్పోర్ట్స్ పై ఆసక్తి ఎక్కువ. జాతీయ స్థాయిలో రాణించాలని కలలు కంటుంటాడు. కానీ ఆ కళ మధ్యలోనే చెదిరిపోతుంది. దీంతో ఊర్లో టీషాప్‌లో పనిచేస్తూ, నక్సలైట్లకి ఇన్‌ఫార్మర్‌గా ఉంటాడు. అయితే రవికి శిరిష అంటే ప్రేమ. మళ్లీ ఆ శిరిష ఊరికి రావడం, పేదల కోసం ఆమె పనిచేస్తుండటంతో ఆమెతో మళ్లీ ప్రేమలో పడతాడు. వీరిద్దరికి ఒకరంటే ఒకరు ప్రాణం. ఊర్లో జరిగిన రాజకీయ చదరంగంలో శిరీష కూడా తన ఉద్యోగ్యాన్ని వదిలేసి రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది. దీంతో శిరీషకు సింగన్న (శివబాలాజీ) దళం నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఇంతకీ ఎమ్మార్వో ఉద్యోగం వదిలి శిరీష రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది? రవి బాడ్మింటన్ కు దూరమై.. నక్సల్స్ తో ఎందుకు చేతులు కలిపారు? సింగన్న దళం ఏం చేసింది? అనేది మిగితా సినిమా.

విశ్లేషణః
ఎర్రజెండా నేపథ్యంలో, నక్సల్స్ పోరాటాల నేపథ్యంలో ఇప్పటికి చాలా సినిమాలొచ్చాయి. అడపాదడపా వస్తున్నాయి. 80,90లో వీటి జోరు బాగా ఉండేది. మంచి ఆదరణ పొందాయి. ఆర్‌ నారాయణమూర్తి సినిమాలు స్టార్‌ హీరోల సినిమాలకు దీటుగా ఆడేవంటే అతిశయోక్తి కాదు. `ఎర్రసైన్యం`, `ఒరేయ్‌ రిక్షా`, `ఒసేయ్‌ రాములమ్మ`, `సమ్మక్క సారక్క`, `ఎన్‌కౌంటర్‌` వంటి ఎన్నో చిత్రాలు వచ్చి బ్లాక్‌ బస్టర్స్ అయ్యాయి. కానీ ఆ తర్వాత వీటికి ఆదరణ దక్కడం లేదు. మారుతున్న తరం కమ్యూనిస్టు భావాల వైపు మొగ్గు చూపకపోవడం, గ్లోబలైజేషన్‌ ప్రభావంతో జనం లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడిపోతున్న నేపథ్యంలో విప్లవ పార్టీలకు ఆదరణ దక్కకపోయినట్టుగానే అలాంటి సినిమాలకు ఆదరణ దక్కడం లేదు. ఇటీవల టాలెంటెడ్‌ డైరెక్టర్‌ వేణు ఉడుగుల `విరాటపర్వం`తో చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. బలమైన అంశంతో రూపొందించిన ఈ సినిమా కొంత మంది ఆదరణ పొందినా, మేజర్‌ ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. 

ఇప్పుడు అదే కోవలో వచ్చిందే `సిందూరం` మూవీ. నక్సల్స్, పోలీసులు, పేద జనాల మధ్య సంఘర్షణ నేపథ్యంలో తెరకెక్కించారు. అయితే విప్లవ నేపథ్య చిత్రాలు చాలా వరకు నక్సల్స్ కోణంలో ఉండేవి. భూస్వాములు, పెత్తందార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఉండేవి. కానీ అందుకు భిన్నంగా తెరకెక్కించారు. ఇదొక విభిన్న, వినూత్నం, ప్రయోగాత్మక చిత్రమని చెప్పొచ్చు. ప్రజలకు సేవ చేయాలంటే అడవిలో పోరాడటం కాదు, జనం మధ్యలో, రాజకీయాల్లోకి వచ్చి పోరాడాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో సేవ చేయాలనే సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రమిది.  భూస్వాములు, అధికారులు, రాజకీయ నాయకులు ఒక్కటై పేద వారి భూములను, ఆస్తులను లాక్కోవడం వంటి అంశాలను ఇందులో చూపించాడు దర్శకుడు శ్యామ్‌ తుమ్మలపల్లి. అయితే తాను రియల్‌ లైఫ్‌లో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారారు. ఓ వైపు పోలీసులు, రాజకీయ నాయకులు, మరోవైపు నక్సల్స్ మధ్య నలిగిపోయిన జనాన్ని, వారి బాధలను చూపించే ప్రయత్నం చేశాడు. కాకపోతే అందులో బలమైన ఎమోషన్స్ ని మిస్‌ చేశాడు. ఆ ఎమోషన్స్, బాధలను బలంగా వెండితెరపై ఆవిష్కరించలేకపోయాడు. 

ఏజెన్సీ యువత, గ్రామీణ జనం నక్సలిజం వైపు ఎందుకు ఆకర్షించబడతారనేది బలంగా చూపించలేకపోయాడు. పెయిన్‌ ఎక్కువగా ఉన్నప్పుడే డ్రామా రక్తికడుతుంది. ఇందులో అది ఆ స్థాయిలో రక్తికట్టలేకపోయింది. మరోవైపు ఇందులో నక్సల్స్ ని కొంత పాజిటివ్‌ కోణంలో చూపిస్తూనే చివర్లో వారిది తప్పు, వాళ్ల ఆలోచన, సిద్ధాంతం తప్పు అని చెప్పడం ఇక్కడ అందరికి రుచించని అంశం. వ్యక్తులు తప్పుడు మార్గంలో వెళ్లొచ్చుగానీ, జెండా, సిద్ధాంతం తప్పు కాదని సిద్ధాంత కర్తలు చెబుతుంటారు. కానీ ఈ సినిమా విషయంలో దర్శకుడు ఓ వర్గాన్ని లేపడం కోసం, మరో వర్గాన్ని తప్పుగా, తక్కువగా చూపించే ప్రయత్నం చేసినట్టుగా ఉంది. అది కొన్ని సన్నివేశాల్లోనూ, మరికొన్ని డైలాగుల్లోనూ స్పష్టమవుతుంది. 

అది పక్కన పెడితే సినిమాగా దీన్ని పోలీసులు, నక్సల్స్  వైపు నుంచి చాలా బ్యాలెన్సింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. టేకింగ్‌ విషయంలో కొంత కన్‌ఫ్యూజన్‌కి గురయిన ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే రాజకీయం, ఉద్యమం, ప్రేమ ఈ మూడు అంశాలను పారలల్‌గా నడిపించి తీరు బాగుంది. ఆ విషయంలో చాలా క్లీయర్‌ కట్‌గా బ్యాలెన్స్ చేశాడు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. అయితే మొదటి భాగం కొంత స్లోగా, బోరింగ్‌గా సాగుతుంది. కొన్ని పస లేని, పదే పదే వచ్చే సీన్లు బోర్‌ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. సెకండాఫ్‌ ఊపందుకుంటుంది. కథలోని డెప్త్ ని చర్చిస్తుంది. రాజకీయం, నక్సల్స్ ఉద్యమం, ప్రేమ ఈ మూడింటి మధ్య క్రియేట్‌ అయ్యే నాటకీయ పరిణామాలు రక్తికట్టించేలా ఉన్నాయి.

ఎవరెలా చేశారంటే?

సినిమాలో శిరీష పాత్రలో హీరోయిన్ బ్రిగిడ సాగా అద్భుతమైన పెర్ఫామెన్స్ ను కనబరిచింది. సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఇక తొలిచిత్రమై అయినప్పటికీ రవి పాత్రలో ధర్మ మెప్పించారు. ఎమోషన్స్ ను చక్కగా పండించాడు. క్లైమాక్స్ లోని రవి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. నటుడిగా ఆయనకు మంచి భవిష్యత్‌ ఉందని చెప్పొచ్చు. నటుడు శివబాలాజీ చిత్రంలో కొత్తగా కనిపించారు. రెండు షేడ్స్ చూపించి ఆకట్టుకున్నారు. కామెడీ విషయానికొస్తే జోష్ రవి నవ్వించే ప్రయత్నం చేశారు. ఉద్యమ నాయకుడు ఆనంద చక్రపాణి నటన బాగుంది. మిగిలిన పాత్రదారులు పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

టెక్నీషియన్ల పనితీరు..
దర్శకుడు శ్యామ్‌ తుమ్మలపల్లికిది తొలి సినిమా. మొదటి సినిమా అయినా బాగా చేశాడు. కొంత తడబాటు, క్లారిటీ మిస్‌ అయినా, దర్శకుడిగా ఆయనలో కంటెంట్‌ ఉందని అర్థమవుతుంది. డైలాగ్‌లు బాగున్నాయి. కెమెరా వర్క్ ఉన్నంతలో ఫర్వాలేదు. గౌవ్రా హరి మ్యూజిక్‌, పాటలు బాగున్నాయి. బీజీఎం విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది.  జస్విన్‌ ప్రభు ఎడిటింగ్‌ బాగుంది. అలాగే నిర్మాణ విలువలు ఫర్వాలేదు. 

ఫైనల్‌గాః అన్నల్లో కొత్త కోణం ఆవిష్కరించిన `సిందూరం` అడవిలో పోరాటం చేయడం కాదు, జనంలో ఉండి, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇంకా బలంగా చెప్పాల్సింది.


నటీనటులు : శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగా, రవి వర్మ, ఆనంద చక్రపాణి, నాగ మమఏశ్, మీర్ దయానంద రెడ్డి
బ్యానర్ : శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్
ప్రొడ్యూసర్ : ప్రవీణ్ రెడ్డి
డైరెక్షన్ : శ్యామ్ తుమ్మలపల్లి
రచన  : కిషోర్ శ్రీ  కృష్ణ
సినిమాటోగ్రఫీ : కేశవ్
మ్యూజిక్ : గౌవ్రా హరి
ఎడిటింగ్ : జస్విన్ ప్రభు

Follow Us:
Download App:
  • android
  • ios