ప్రముఖ మలయాళి నటి, రచయిత, మోడల్ గిలు జోసెఫ్.. ఓ మేగజిన్ కవర్ పేజీ కోసం ఓ బిడ్డకు పాలిస్తూ ఫొటోలకు ఫోజివ్వడం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. కన్నబిడ్డ ఆకలి తీర్చడం తప్పా? నలుగురి ముందూ బిడ్డకు స్తన్యమివ్వాల్సి వస్తే సిగ్గుపడాలా? బిడ్డ కడుపు నింపే పనిని లైంగిక కోణం నుంచే చూడాలా? మారుతున్న కాలంలో మారుతున్న ప్రజలు ఈ ప్రశ్నలకు 'కాదు' అనే సమాధానం ఇస్తారు.  అయితే, ఇదే భావాన్ని బహిరంగంగా వ్యక్తపరిస్తే భారత సమాజం హర్షించట్లేదు.

 

కేరళ నటి గిలు జోసఫ్ ఇప్పుడు అదే తరహా విమర్శలు చవిచూస్తోంది. బిడ్డకు చనుపాలు ఇవ్వడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘గృహలక్ష్మీ’ అనే మేగజిన్.. 27 ఏళ్ల గిలు జోసెఫ్‌ను సంప్రదించింది. ఇందుకు గిలు జోసెఫ్ అంగీకరించింది. అయితే, దీనిపై సోషల్ మీడియాలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బిడ్డకు స్తన్యమిస్తూ, కెమెరావైపు గర్వంగా చూస్తున్నట్టు ఈ కవర్ పేజీపై గిలు కనిపిస్తుండగా, అసలు పెళ్లికూడా కాని గిలుతో ఈ ఫొటో షూట్ లు, అసభ్యకర చిత్రాలు ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మేగజైన్ ప్రచురణకర్తలతో పాటు గిలు జోసెఫ్ పైనా పోలీసు కేసు నమోదైంది.

 

ఇండియా సహా చాలా దేశాల్లో బహిరంగంగా బిడ్డకు పాలివ్వడాన్ని వివాదాస్పద అంశంగానే చూస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై నటి జోసెఫ్ స్పందిస్తూ.. ‘‘ఇందులో తప్పేముంది? బిడ్డకు పాలివ్వడమనేది తల్లికి బిడ్డకు ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది. మరింత ముఖ్యంగా అమ్మతనాన్ని చూపిస్తుంది. దీన్ని నగ్నత్వంగా భావిస్తే అంతకంటే సిగ్గుచేటు మరేదీ లేదు. ఇలాంటి ఫోజు ఇచ్చినందుకు నేను ఎంతో గర్వంగా ఫీలవ్వుతున్నా.’’ అని తెలిపింది.