మైకా మైనింగ్ మాఫియా నేపధ్యంలో ‘ఆదికేశవ’?
ఆదికేశవ సినిమాలో వైష్ణవ్‌తేజ్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అపర్ణదాస్, జోజు జార్జ్ కీలక పాత్రలు పోషించారు.

మారిన సినిమా ఇప్పుడు విభిన్నమైన నేపధ్యాలు కోరుకుంటోంది. ఏదో ఒక కొత్తదనం లేకపోతే ఎవరూ పట్టించుకోవటం లేదు. వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’.యాక్షన్ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఎన్. రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ ని బట్టి ఈ చిత్రం ఓ గుడి చుట్టూ సాగే కథతో రూపొందుతోన్న చిత్రమనే భావన వచ్చింది. అయితే ఈ సినిమా జార్ఖండ్ లోని మైకా మైనింగ్ మాఫియా చుట్టు తిరిగే కథ అని తెలుస్తోంది. అక్కడ గనుల్లో దొరికే ఖనిజం కాస్మోటిక్ ప్రాడెక్టులలో వాడతారు. అంటే ఇక్కడ ఓ అమ్మాయి అందంగా కనిపించటం కోసం మరో చోట వేరే అమ్మాయి చచ్చిపోతుంది అని చెప్పాలనే ఆలోచనతో చేసినట్లు దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఓ ఇంటర్వూలో చెప్పారు. అక్కడ జార్ఖండ్ మైనింగ్ లో చిన్న పిల్లలు పనిచేస్తున్నారని, వారి ఆదాయం రోజుకు వంద రూపాయలు లోపు ఉంటుందని, ఒక్కోసారి ఆ గనులు కూలినప్పుడు పిల్లలు చనిపోతారని,అక్కడ అది చాలా కామన్ అనే విషయం చెప్పారు. అయితే సినిమా అంతా ఇదే ఉండదని, ఇది కథలో ఓ పార్ట్ మాత్రమే అని చెప్పుకొచ్చారు.
వైష్ణవ్‌తేజ్.. రుద్ర కాళేశ్వర్ రెడ్డిగా శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో వైష్ణవ్ సరసన శ్రీలీల సందడి చేయనుంది. మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణాదాస్, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలోని వైష్ణవ్ యాక్షన్, హీరోయిన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది.
ఇక రీసెంట్ గా ఆదికేశవ మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ విషయం తెలియచేసారు నిర్మాత. వరల్డ్ కప్ క్రికెట్ కారణంగా ఈ సినిమాను నవంబర్ 10 నుంచి నవంబర్ 24కు పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. వరల్డ్ కప్‌లో ముఖ్యంగా ఇండియా మ్యాచ్ జరుగుతోన్న సమయంలో సినిమాల కలెక్షన్స్ బాగా డ్రాప్ అవుతున్నాయని, ఈ నెలలో మా సంస్థ ద్వారా రిలీజైన మ్యాడ్, లియో సినిమాలతో ఆ విషయం రుజువైందని సూర్యదేవర నాగవంశీ అన్నాడు. ఇండియా మ్యాచ్‌లు ఎక్కువగా ఆదివారాల్లోనే ఉంటున్నాయని, అలాగే సెమీస్, ఫైనల్ రోజుల్లో సినిమాల రెవెన్యూ బాగా తగ్గే అవకాశం ఉందని సూర్యదేవర నాగవంశీ అన్నాడు.
మరోవైపు నవంబర్ 10న నాలుగు సినిమాలు రిలీజ్ అవుతోన్నాయని, పోటీ మధ్య ఆదికేశవ సినిమాను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదనిపించిందని తెలిపాడు. మంచిసినిమాను కిల్ చేయద్దనే ఆలోచనతోనే నవంబర్ 10 నుంచి రిలీజ్ డేట్‌ను నవంబర్ 24కు మార్చామని తెలిపాడు. హీరోతో పాటు డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి రిలీజ్ పోస్ట్‌పోన్‌పై నిర్ణయానికి వచ్చినట్లు తెలిపాడు.