డ్రగ్ కేసులో ప్రముఖ నిర్మాత జాఫర్ సాదిక్ అరెస్ట్ అయ్యాడు. అతడు అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్ దందా చేస్తున్నాడని తెలిసి పోలీసులు విస్తుపోయారు. జాఫర్ సాదిక్ అరెస్ట్ కోలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది.
ప్రతి డ్రగ్ కేసు మూలాలు చిత్ర పరిశ్రమల్లో కనిపిస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ నిర్మాత జాఫర్ సాదిక్ అరెస్ట్ అయ్యాడు. జాఫర్ సాదిక్ నెట్వర్క్ అంతర్జాతీయ స్థాయిలో ఉంది. రూ. 2000 కోట్ల డ్రగ్ రాకెట్ లో జాఫర్ సాదిక్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. భారత్, శ్రీలంక, మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో వీరి డ్రగ్ దందా విస్తరించి ఉందట.
ఇటీవల తమిళనాడు అధికారులు శ్రీలంకకు డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. దొరికిన వాళ్ళను విచారించగా అంతర్జాతీయ ముఠా గుట్టు బయటపడింది. ప్రముఖంగా సాధిక్ జాఫర్ దీనికి వెనుక ఉన్నట్లు తేలింది. దాంతో జాఫర్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ప్రస్తుతం ఎన్సీబీ కస్టడీలో జాఫర్ ఉన్నాడు. కాగా జాఫర్ తమిళంలో నాలుగు సినిమాలు నిర్మించాడు. ఇతడు అధికార పార్టీ డీఎంకే కి చెందిన వ్యక్తి. డీఎంకే పార్టీ ఎన్ఆర్ఐ విభాగంలో పని చేశాడు. డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన వెంటనే జాఫర్ ని పార్టీ సస్పెండ్ చేసింది.
కాగా టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ అరెస్ట్ అయ్యాడు. ఇటీవల డ్రగ్ కేసులో నవదీప్ పేరు వినిపించింది. రాడిసన్ హోటల్ లో డ్రగ్ పార్టీలో పాల్గొన్నాడన్న ఆరోపణలపై దర్శకుడు క్రిష్ విచారణలో ఎదుర్కొన్నాడు. ఆయన బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ని అధికారులు పరీక్షించారు. బాలీవుడ్ నుండి కోలీవుడ్ దాకా డ్రగ్ కేసు ఎదుర్కొన్న చిత్ర ప్రముఖులు ఎందరో ఉన్నారు.