ప్రముఖ నటి జ్యోతిక తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తూ...మలయాళంలో సూపర్ హిట్ అయిన 'హౌ ఓల్డ్ ఆర్ యూ' చిత్రం తమిళంలో అదే పేరుతో రీమేక్ చేసారు. మలయాళంలో నిర్మించిన హౌ ఓల్డ్ ఆర్ యూ చిత్రంలో మంజూ వారియర్ ముఖ్య భూమిక పోషించారు. తమిళంలో రీమేక్ చేసిన ఆ చిత్రంలోని మంజూ పాత్రలో జ్యోతిక ఒదిగిపోయారు. ఆ సినిమానే డబ్బింగ్ అయ్యి...మన ముందుకు వచ్చింది. మరి మన తెలుగువాళ్లకు ఈ సినిమా ఎంతవరకూ నచ్చుతుంది. ఆదరిస్తారా...అసలు ఈ చిత్రం కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథ ఏంటి ?
“మీవయస్సు ఎంత?”
“నేను 36.”
“ఐయామ్ సారీ...ఉద్యోగానికి వయస్సు పరిమితి 35.”
“కానీ నేను కేవలం 36…”

వసంతి (ఇంకెవరు జ్యోతిక)కు 36 ఏళ్లు వయస్సు వచ్చేసింది . అక్కడక్కడా కనపడుతున్న తెల్ల వెంట్రుకలు ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ  డిస్ట్రబ్ చేస్తున్నాయి. ఐర్లాండ్ లో జాబ్ కోసం ట్రై చేస్తే వయస్సు కారణం చూపించి రిజెస్ట్ చేసారు. తిరిగి తన పాత రొటీన్ రెవిన్యూ జాబ్ లోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ మిడిల్ ఏజ్ బెంగలన్నీ వసంతి ని చాలా ఇన్ సెక్యూర్ గా మార్చేస్తున్నాయి.  ఇది చాలదన్నట్లు తన భ‌ర్త (రెహ‌మాన్‌) తన గొడవ తనదే కానీ పెళ్లాన్ని పెద్దగా పట్టించుకునే మనిషి కాడు. 13 ఏళ్ల కూతురు మృదుల కూడా తల్లిని అర్దం చేసుకునేందుకు ప్రయత్నించదు. కాసేపు రిలాక్స్ అవుదామంటే.. ఈ కాలం సోషల్ మీడియా ప్రపంచాన్ని ఆమె పట్టించుకోలేదు. 

అయినా తను పెళ్లి కాకముందు తను ఎలా ఉండేది...ఇదేంటో పెళ్లి, పిల్లలే తనకు గుదిబండ అయ్యారా అనే ఆలోచన కాదూ..కూడదు అనుకున్నా అప్పడప్పుడూ వచ్చేస్తూంటుంది. ఇల్లు..ఇల్లాలు..పిల్లలు సినిమా టైటిల్ లాగ తన జీవితం అయ్యిపోయిందనే ఆలోచన భయపెడుతూంటుంది. ఆమె క్లోజ్ ప్రెండ్, చదువుకునేటప్పుడు బెంచ్ మేట్ ఓ సారి కలసి..కాలేజీ రోజుల్లో వసంతి టెర్రర్ అనే విషయం గుర్తు చేస్తే బాధ వస్తుంది. అప్పటి తనేనా ...ఇప్పటి నేను.. చిన్న విషయంలో కూడా ధైర్యం చేయలేకపోతున్నానే.

ఈలోగా వాసంతికి దేశ రాష్ట్రపతిని కలుసుకునే అవకాసం వచ్చినట్లే వచ్చి మిస్సైంది. కరెక్ట్ గా ఆయన్ను కలుసుకుందామనుకునే సరికి కళ్లు తిరిగిపడిపోయింది. అంతే ప్రపంచం తలక్రిందులైపోయిదన్నట్లు చుట్టూ ఉన్న జనం బిహేవ్ చేస్తూంటారు. ఇంటా,బయిటా,ఆఫీస్ లో  అవమానాలు..చిన్న చూపు.  భర్త, కూతురు వసంతను వదిలివేసి ఐర్లాండ్ వెళ్ళిపోతారు. దీనితో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన వసంత ఏం చేసింది. అసలు రాష్ట్రపతి ఆమెకు ఎందుకు కలుసుకునే అవకాసం వచ్చింది. చివరకు ఆమె 36 వయస్సు భయాలని,ఫీలింగ్స్ ని ఎలా దాటింది అనేదే మిగతా కథ. 
 
 
ఎలా ఉంది:
ఎంత చదువుకున్నా, ఎంత ప్రతిభ, లోకజ్ఞానం ఉన్నా  కుటుంబ బాధ్యతలు భర్త మరియు పిల్లల ఆలన పాలనా చూసుకోవడంలో స్త్రీమూర్తి జీవితం తలమునకలైపోతోంది. మది నిండా ఎన్నో ఆలోచనలు, ఆశలు, ఆశయాలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేని పరిస్థితుల్లో ఎందరో మహిళలు నాలుగు గోడల మధ్య జీవనానికి పరిమితమైపోయారు. అయితే వాళ్ల ఆలోచనలకు రూపం ఇచ్చేదెవరు, ఆశలు, కలలుకు రూపం ఇచ్చేదెవరు. ఇంకెవరు...ఎవరికి వాళ్లే...ఈ సత్యం బోధపడటానికి ,బోధపరచటానికి మళ్లీ ఆడవాళ్లే నటిస్తూ సినిమాలు తీయాలి. ఇదిగో ఇలాంటి సినిమానే ఇది.  మలయాళంలో ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన రోషన్ అండ్రూస్ తమిళంలో నిర్మిస్తున్న చిత్రానికి కూడా దర్శకత్వ వహించారు.

మనకు సినిమా చూస్తూంటే శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ గుర్తు వస్తుంది. అలాగే రేవతి నటించి, డైరక్ట్ చేసిన మిత్ర్ ..మై ప్రెండ్ అనే హిందీ సినిమా గుర్తు వస్తుంది. అయితేనేం ఈ సినిమా మహిళా సమానత్వం అనేది ఈ సమాజానికి ఎంత అవసరమో నొక్కి చెప్తుంది. కుటుంబమా..కలలా అనే సతమతయ్యే ఓ మధ్యతరగతి మహిళను జ్యోతిక ఆవిష్కరించింది. మలయాళంలో 2014 లో హౌ ఓల్డ్ ఆర్ యు సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఆ మరుసటి సంవత్సరమే 2015 లో తమిళ్ లో పెద్దగా మార్పులు లేకుండానే సీన్ టు సీన్ ని దింపేశారు. అదే దర్శకుడు,రీమేక్ కాబట్టి ఇంతకు మించి మనం ఎక్సపెక్ట్ చేసేది కూడా ఏమీ లేదు.

ఓ చోట సినిమాలో ...వాసంతి వేసిన ప్రశ్న మనను సినిమా పూర్తయ్యాక కూడా తడుముతుంది. “అసలు ఎవరు ఆడవాళ్ల కలలకు ఉన్న ఎక్సపైరీ డేట్ ని నిర్ణయిస్తారు?”. సినిమాలో చాలా చోట్ల జ్యోతిక అద్బుతమైన ఫెరఫార్మెన్స్ కు మనం మెచ్చుకోకుండా ఉండలేం. ఓసారి తను రోజూ బస్సులో కలిసే ఒక పెద్దవిడని కలిస్తే...ఆమె నువ్వీ ప్రపంచంలో ఒంటరికాదు అని ధైర్యం చెప్తుంది. వాసంతి సింపుల్ గా గుడ్ బై చెప్తుంది. అందులో ఎమోషన్ మనని తాకుతుంది. అది జ్యోతిక కళ్లతో నటించిన సీన్.
  
సరిగ్గా ప్రమోట్ చేస్తే ...ఈ సినిమా మన ఇళ్లళ్లో ఉన్న చాలా మంది ఆడవాళ్ల చూసి మెచ్చుకునే అవకాసం ఇచ్చినట్లు అవుతుంది. ముఖ్యంగా గృహిణిలకు, తమ భర్త,పిల్లలతో నిర్లక్ష్యానికి గురి అవుతున్నవాళ్లకు కనెక్ట్ అవుతుంది. కొద్ది సేపు అయినా తమను తాను అన్వేషించుకునే అవకాసం ఇస్తుంది. ఇండిపెండెంట్ గా,కాన్ఫిడెంట్ గా లేనందుకు దిగులు వేసి, ఆ దిసగా ప్రయాణం పెట్టుకునేలా చేస్తుంది. 
 
టెక్నికల్ గా...
జ్యోతిక నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన పనిలేదు. స్క్రిప్ట్ విషయానికి వస్తే...ఇంకాస్త స్పీడు పెంచాలి. ముఖ్యంగా కథలోకి వెళ్లటానికే, జ్యోతిక పాత్ర సెటప్ కే ఎక్కువ టైమ్ తీసుకున్నారు. జ్యోతిక లాంటి స్టార్ ..ఓ మిడిల్ క్లాస్ పాత్రలో చేసినప్పుడు ఆ డెప్త్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అన్ని సీన్స్ వేసి ఎస్టాబ్లిష్ చేయక్కర్లేదు. అయినా ఇది 2014 సినిమా..అంటే ఆరేళ్ల క్రితం నాటికి అప్పటికి ఇప్పటికి పరిస్దితులు,సినిమా చూసే విధానం బాగా మారాయి. డబ్బింగ్ కాబట్టి అప్పటిసినిమాగానే భావించి చూడాలి. ఇక కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ ...మరీ నత్త నడకకు అవకాసం ఇచ్చింది. సంగీతం సోసో, నిర్మాణ విలువలు బాగున్నాయి.  

ఫైనల్ గా
ఆడవాళ్ల కన్నీటికే కాదు..కలలకు కూడా తగినంత గుర్తింపు ఇవ్వాలి. లేకపోతే ఆ కలల్లో మనం ఉండం అని మగవాళ్లు అర్దం చేసుకోవాలి.
 

---సూర్య ప్రకాష్ జోస్యుల
Rating: 2.5/5