తాడేపల్లి: 2019 ఎన్నికల ద్వారా అధికారాన్ని  హస్తగతం చేసుకున్న వైఎస్సార్‌సిపి పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇతర పార్టీల నుండి కొందరు వైసిపిలో చేరగా మరికొంత మంది ఒక్కొక్కరుగా చేరుతున్నారు. ఇందులో భాగంగానే రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు ఇవాళ(బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ...రాజోలు  నియోజకవర్గ  పరిధిలో వైస్సార్సీపీని బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మా వంతు కృషి చేస్తామని వెల్లడించారు.

జగన్ పరిపాలన బాగుండటం వల్ల మేము తిరిగి వైస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఆయన ప్రజా సంక్షేమం, అభివృద్ది కోసం చేపడుతున్నపథకాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. ఏ ఒక్క వర్గానికో కొమ్ముకాయకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఆయన పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు.

రాష్ట్ర ప్రజల వద్దకే అన్నిసేవలు తీసుకువెళుతున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్ అని పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ విషయంలో తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకుంటారన్న నమ్మకం వుందని అభిప్రాయపడ్డారు.

2019లో జనసేన పార్టీకి చేరిన తాను ఇప్పుడు జగన్ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితమైనట్లు తెలిపారు. అందువల్లే ఆ పార్టీకి అండగా నిలబడి బలోపేతానికి చేయడానికి చేరానని...ఎలాంటి  వ్యక్తిగత లాభం, పదవి తనకు అవసరంలేదన్నారు. రాబోయే రోజుల్లో రాజాలులో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని కృష్ణంరాజు వెల్లడించారు.