Gold: బంగారం కొంటున్నారా అయితే అలర్ట్..ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్ పాటించని నగలను మార్కెట్లో కొంటే నష్టపోయే చాన్స్
New gold jewellery hallmarking system: గోల్డ్ షాపింగ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే వెంటనే ఈ వార్త తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి బంగారు ఆభరణాల కొనుగోలు నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేయనుంది. మార్చి 31, 2023 తర్వాత నుంచి హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ లేని ఆభరణాలు మార్కెట్లో విక్రయించకూడదని ప్రకటించింది.

New gold jewellery hallmarking system: కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, మార్చి 31 తర్వాత, హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) లేకుండా బంగారు ఆభరణాలను విక్రయించకూడదని ప్రకటించింది. ఒక రకంగా ఈ నిబంధన వినియోగ దారులకు మేలు చేసేదే. వారు పెట్టే పెట్టుబడికి సరైన విలువ, నాణ్యత లభించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనుంది.
అయితే హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) విషయంలో నాలుగు అంకెలు, ఆరు అంకెల హాల్‌మార్కింగ్ సంబంధించి కస్టమర్లలో గందరగోళం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. కొత్త నిబంధనల అమలు తర్వాత, ఏప్రిల్ 1, 2023 నుండి అమల్లోకి రానుంది. కొత్త నిబంధన ప్రకారం ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్కింగ్ ఉన్న నగలను మాత్రమే ఆభరణాల తయారీ దారులు విక్రయించాల్సి ఉంటుంది. ఇది లేకుండా బంగారు ఆభరణాలు విక్రయించడం చట్టరీత్యా నేరం. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితమే బంగారం హాల్‌మార్కింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేయడం ప్రారంభించింది.
హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి..?
హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) నంబర్ ఆభరణాల స్వచ్ఛతను సూచిస్తుంది. ఇది 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. దీని ద్వారా, వినియోగదారులు బంగారు ఆభరణాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. ప్రతి ఆభరణంపై ఈ నంబర్‌ను ఉండాలి. ఈ కోడ్ ద్వారా బంగారం నాణ్యత విషయంలో జరిగే మోసాలను చెక్ పెట్టవచ్చు. ఏప్రిల్ 1 నుంచి హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ లేని ఆభరణాలను నగల దుకాణదారులు విక్రయించకూడదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1338 హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి.
కస్టమర్లు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జారీ చేసిన ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్కింగ్ 6-అంకెల కోడ్ ఉపయోగించి BIS కేర్ యాప్ సహాయంతో బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయవచ్చు.
ముఖ్యంగా బంగారం నాణ్యత విషయంలో కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు భరోసా కల్పించడమే ఉద్దేశ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. మైక్రో స్కేల్ యూనిట్లలో నాణ్యమైన ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
నిజానికి భారతదేశంలో బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రతిరోజు 3 లక్షలకు పైగా బంగారు ఆభరణాలను HUID హాల్‌మార్క్ చేస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దశలవారీగా గోల్డ్ హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంది. తొలి దశలో దేశంలోని 256 జిల్లాల్లో హాల్ మార్కింగ్ తప్పనిసరి చేశారు. రెండో దశలో మరో 32 జిల్లాలను చేర్చారు. ఇప్పుడు మొత్తం జిల్లాల సంఖ్య 288కి పెరిగింది. ఇప్పుడు దానికి మరో 51 జిల్లాలు జతకానున్నాయి.
తాజాగా ఏప్రిల్ 1, 2023 నుండి, HUID ఉన్న బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా బంగారు నాణ్యత విషయంలో కేంద్రప్రభుత్వం కీలక అడుగు వేసింది. భవిష్యత్తులో బంగారం విషయంలో అకౌంటబులిటీని పెంచడంతో పాటు దేశంలోని బంగారు నిల్వలను ప్రభుత్వం పర్యవేక్షించడంతో పాటు, స్మగ్లింగ్ వంటి చర్యలకు హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) ఉపయోగపడుతుందని సంబంధిత మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.