న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బడ్జెట్‌లో ఆదాయం పన్ను (ఐటీ)లో కోతలు విధించే అవకాశాలు తక్కువేనని తెలుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో పన్ను వసూళ్లు గరిష్ఠంగా రూ.2 లక్షల కోట్ల నుంచి 2.5 లక్షల కోట్ల వరకు తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం.. ఈసారి బడ్జెట్‌లో ఐటీ కోతలపై కేంద్రానికున్న అవకాశాలకు గండి కొట్టిందన్న అభిప్రాయాలు విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. 

also read ఎయిర్‌ఇండియా అమ్మకానికి ఆహ్వానం... టాటా సన్స్, హిందూజాల ఆసక్తి ?

ఈసారి వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులకు పెద్దగా ఊరట ఉండకపోవచ్చునని నిపుణలు చెబుతున్నారు. నిజానికి మార్కెట్‌లో చోటుచేసుకున్న స్తబ్ధతను తొలగించడానికి, వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం పెంచడానికి భారీగా ఐటీ ప్రయోజనాలను ట్యాక్స్‌పేయర్స్‌కు కేంద్రం అందించనుందన్న అంచనాలు విస్తృతంగా ఉన్నాయి. 

కానీ ఆదాయం పన్ను, కార్పొరేట్‌ పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశిత బడ్జెట్‌ అంచనాకు రూ.1.5 లక్షల కోట్ల నుంచి 2 లక్షల కోట్లు దూరంగా ఉండవచ్చని తెలుస్తోంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా రూ.50 వేల కోట్లు పడిపోవచ్చని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఊహించిన స్థాయిలో ఐటీ మినహాయింపులు ఉండకపోవచ్చని అంటున్నాయి. 

ఐటీ శ్లాబుల తగ్గింపు తదితర నిర్ణయాలుండకపోవచ్చని సమాచారం. దేశ జీడీపీకి ఊతమిచ్చేందుకు గతేడాది సెప్టెంబర్‌లో కార్పొరేట్‌ ట్యాక్స్‌  నిర్మలా సీతారామన్‌ భారీగా తగ్గించిన సంగతి విదితమే. ఈ క్రమంలో వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులకూ పన్ను ప్రోత్సాహకాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు. 

also read గ్రామీణ స్టార్టప్‌లకు ప్రోత్సాహాలివ్వండి.. రుణ పరపతి అవకాశాలు పెంపొందించండి

కానీ పన్ను వసూళ్లు అంచనాలకు దిగువనే ఉండే వీలుండటం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణపై మోదీ సర్కార్ పెట్టుకున్న నిధుల సమీకరణ లక్ష్యాలు నెరవేరకపోవడం ఈ ఆశలపై నీళ్లు చల్లుతున్నది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ను గడిచిన 28 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 10 శాతం తగ్గించడంతో ఖజానాకు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం చేజారింది. 

కార్పొరేషన్‌ ఆదాయం పన్ను (సీఐటీ) రూ.7.66 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయం పన్ను రూ.5.69 లక్షల కోట్లుగా 2019-20 బడ్జెట్‌లో అంచనా వేశారు. జీఎస్టీ ఆదాయాన్ని 6.63 లక్షల కోట్లుగా లక్ష్యాన్ని నిర్దేశించారు. కస్టమ్స్‌ రెవిన్యూను రూ.1.56 లక్షల కోట్లుగా, ఎక్సైజ్‌ రెవిన్యూను రూ.3 లక్షల కోట్లుగా అంచనా వేశారు. మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.24.59 లక్షల కోట్ల ఆదాయం రావచ్చునని బడ్జెట్‌లో కేంద్రం చెప్పింది. ఇందులో రాష్ర్టాల వాటా రూ.8.09 లక్షల కోట్లు, కేంద్రం వాటా రూ.16.50 లక్షల కోట్లుగా ఉన్నది.