సారాంశం

కులగణనను ద్వారా సేకరించే సమాచారం సంక్షేమ పథకాల రూపకల్పన, అమలుకు ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో సమగ్ర కుల గణన చేపట్టేందుకు వైసిపి ప్రభుత్వం సిద్దమయ్యింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన కుల గణన ప్రక్రియపై అధ్యయనం చేయడమే కాదు ప్రయోగాత్మకంగా కొన్నిప్రాంతాల్లో సర్వేను కూడా ప్రారంభించింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కులగణన నిర్వహించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 

ఆంధ్ర ప్రదేశ్ లో కులగణన అధ్యయనం కోసం ఏర్పాటుచేసిన ఆరుగురు అధికారుల కమిటీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది.  సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి తదితర అంశాలను కూడా ఈ కులగణన ప్రక్రియ ద్వారా నమోదు చేయనున్నట్లు ప్రభుత్వం చేబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టేందుకు వీలుగా మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరిట విడుదల చేసారు. 

కులగణన ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయ విభాగం సర్వే నిర్వహణ నోడల్ విభాగంగా వుండనుంది.  సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఆ కుటుంబ పూర్తి వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ ను రూపొదించింది. సేకరించిన డాటా మొత్తాన్ని డిజిటల్ పద్ధతిలో యాప్ లోనే అప్లోడ్ చేస్తారు.  ఈ వివరాలు, డేటా భద్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు... కుటుంబం యూనిట్ గా ఒకే దశలో సర్వే పూర్తి చేయనున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

 Read More ఓటర్ల జాబితాలో అక్రమాలు .. ఇది ఏపీలో పరిస్ధితి , ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

రాష్ట్రంలో ఏ కుటుంబమూ కులగణనలో నమోదు కాకుండా ఉండకూడదని గ్రామవార్డు సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ అదేశించింది. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వలసవెళ్లిన కుటుంబాల వివరాల నమోదుకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఏపీ డిజిటల్ కార్పోరేషన్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో కులగణనకు సంబంధించి ప్రచారం చేయాలని సూచించారు. అలాగే గ్రామాల్లో చాటింపు వేయిస్తూ కులగణనపై ప్రచారం చేయాలన్నారు. 

కులగణన కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది.  అలాగే కులగణన చేపట్టేందుకు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు... ఇందుకోసం రూ.10.19 కోట్లు విడుదల చేయాల్సిందిగా ఆర్ధికశాఖకు ప్రభుత్వం ఆదేశించింది. 

కులగణనను ద్వారా సేకరించే సమాచారం సంక్షేమ పథకాల రూపకల్పన, అమలుకు ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వెనకబడిన వర్గాలకు సంబంధించిన పూర్తి సమాచారం లేకపోవడంతో  పథకాల అమలు ఇబ్బందికరంగా మారిందని ప్రభుత్వం అంటోంది. అందువల్లే  కులగణన చేపడుతున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల రూపకల్పనకు మాత్రమే ఈ కులగణన డాటాను ఉపయోగిస్తామని... దీన్ని ఏ పథకంతో లింక్ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.