
అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా జుట్టు పొడవుగా, నల్లగా నిగనిగలాడుతుంటే.. చూడటానికి చాలా బాగుంటుంది. అలాంటి జుట్టును ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అందుకే, మార్కెట్లో దొరికే ప్రతి హెయిర్ ఆయిల్, షాంపూలను వాడేస్తూ ఉంటారు.కానీ, ఆ నూనెలు, షాంపూల తయారీలో ఉపయోగించే కెమికల్స్.. జుట్టును బాగా డ్యామేజ్ చేస్తాయి. మరి, ఈ డ్యామేజ్ లేకుండా.. జుట్టుు అందంగా కనిపించాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? కేవలం మన ఇంట్లో లభించే కొన్ని ఉత్పత్తులు చాలు.ముఖ్యంగా పెరుగు, మెంతులు వాడి.. మన జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
మార్కెట్లో లభించే బోలెడన్నీ రసాయనిక ఉత్పత్తుల కన్నాసహజ హోం రెమిడీలే ఎక్కువగా ఉపయోగపడతాయి.అలాంటి వాటిలో మెంతులు, పెరుగు మిశ్రమం చాలు. దీనితో తయారు చేసే హెయిర్ ప్యాక్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది.
మెంతులు జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడతాయి. ఇవి ప్రోటీన్, ఐరన్, నికోటినిక్ ఆమ్లంతో నిండి ఉంటాయి. ఇవి కుదుళ్లను బలపరుస్తాయి. జుట్టురాలడాన్ని తగ్గిస్తాయి. చండ్రు రాకుండా నివారిస్తుంది. ఇక పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జుట్టుకు తేమను అందిస్తుంది. పెరుగు జుట్టును చాలా వేగంగా, మెరిసేలా చేస్తుంది. జుట్టు పొడిబారకుండా, కండిషన్ ని చేసి ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ రెగ్యులర్ గా వాడటం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. జుట్టు తొందరగా పెరగడానికి సహాయపడుతుంది. మెరిసేలా చేస్తుంది. కుదుళ్లు కూడా బలంగా మారతాయి.
ఈ హెయిర్ ప్యాక్ కోసం మెంతులు, పెరుగు, ఆముదం లేదా కొబ్బరి నూనె ఉంటే చాలు.
మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి.ఉదయం నీటిని వంపేసి, మెంతులను మెత్తగా గుజ్జుగా చేసుకోవాలి.ఈ గుజ్జులో పెరుగు కలిపి మెత్తని పేస్ట్‌గా తయారుచేయండి. ఇప్పుడు దీనికి ఒక స్పూన్ ఆముదం లేదా కొబ్బరి నూనె వాడితే చాలు.ఈ మిశ్రమాన్ని జుట్టుకు 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టాలి.
జుట్టును భాగాలుగా విడదీసి చిక్కులు తొలగించండి.వేళ్లతో లేదా బ్రష్ సహాయంతో ప్యాక్‌ను తలపై, జుట్టు మొత్తానికి బాగా అప్లై చేయాలి. ఆ తర్వాత తలకు నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.మసాజ్ తర్వాత షవర్ క్యాప్ వేసుకోవాలి లేదా పాలిథిన్‌తో తల చుట్టుకోవాలి.అరగంట నుండి గంటపాటు ఉంచండి. ఇది పోషకాలు లోపలికి చొచ్చుకుపోయేలా చేస్తుంది. ఆ తర్వాత
గోరువెచ్చని నీటితో కడిగి, సున్నితమైన హెర్బల్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.కండిషనర్ అవసరం లేదు, పెరుగు మంచి కండిషనర్ లా పని చేస్తుంది.ఈ హెయిర్ మాస్క్‌ను వారానికి ఒక్కసారైనా ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మూడు నుంచి నాలుగు వారాల్లోనే మీరు ప్రయోనాలు చూస్తారు. ముఖ్యంగా జుట్టు మెరుస్తూ కనపడుతుంది. చుండ్రు సమస్య ఉండదు. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
త్వరిత పరిష్కారం కోసం:
మెంతుల నానబెట్టడానికి సమయం లేకపోతే, మెంతి పొడి, పెరుగు కలిపి మాస్క్ తయారు చేయవచ్చు. ఇది తక్కువ సమయంలో సిద్ధమవుతుంది కానీ ప్రభావం మాత్రం కాస్త తక్కువగా ఉండొచ్చు.
గమనిక..
సహజమైన, సంప్రదాయ పద్ధతులు అప్పటికప్పుడే ఫలితం ఇవ్వకపోవచ్చు. కానీ ఓపికతో, నిరంతరం వాడితే దీర్ఘకాలిక ప్రయోజనాలు అనుభవించవచ్చు. మెంతులు-పెరుగు హెయిర్ మాస్క్ అనేది ఒక ఆరోగ్యకరమైన, రసాయనరహిత మార్గం ద్వారా జుట్టును బలపరిచే, ప్రకాశవంతంగా మార్చే పద్ధతి. ఈ ఇంటి వంటింటి చిట్కా ఇప్పుడు మీ రూటీన్‌లో భాగం చేయండి—మీ జుట్టు ఆరోగ్యంగా, అందంగా మెరిసిపోతుంది.
మనం ఎన్ని హోం రెమిడీలు ఫాలో అయినా, జుట్టు కు ఏదిరాసినా అది పైపై మెరుగులను మాత్రమే అందిస్తుంది. అదే.. మనం ఆహారం నుంచే ఈ మార్పులు చేసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. మనం ఏం తింటామో అది మన చర్మం, జుట్టుపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, జుట్టు పెరుగుదల, తక్కువగా రాలడానికి పోషకాహారమే కీలకం. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రోటీన్, ఐరన్, బయోటిన్, జింక్, ఓమేగా-3 వంటి పోషకాలను అందించే ఆహారాలను రోజువారీ జీవనశైలిలో చేర్చడం అవసరం. మరి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకంుదాం..
1. ప్రోటీన్ – జుట్టు నిర్మాణానికి మూలధనం
మన జుట్టు ప్రధానంగా కెరటిన్ అనే ప్రోటీన్ తో ముడిపడి ఉంటుంది. ఈ ప్రోటీన్ లోపం వల్ల జుట్టు జిడ్డుగా మారడం లేదా.. రాలిపోవడం లాంటివి జరుగుతాయి. అందుకే.. ఈ ప్రోటీన్ కోసం పప్పు, కోడిగుడ్డు, పన్నీర్, చికెన్ లాంటివి తినాలి.
2. ఐరన్ – రక్తప్రసరణ మెరుగుపరిచే కీలక అంశం
ఐరన్ లేని పరిస్థితుల్లో జుట్టు కుదుళ్లకు తగినంత ఆక్సిజన్ అందకపోవచ్చు. ఫలితంగా జుట్టు రాలడం పెరుగుతుంది. దీని కోసం పాలకూర, తోటకూర, మటన్ లివర్, బీట్రూట్ , ఎండు ద్రాక్ష, నువ్వులు వంటివి తినాలి.
3. బయోటిన్ – జుట్టు పెరుగుదలకు
బయోటిన్ తక్కువైతే జుట్టు విపరీతంగా రాలితుంది. ఎక్కువగా బట్టతల వచ్చే అవకాశం ఉంది. అందుకే, ఈ విటమిన్ కోసం కోడి గుడ్డు పచ్చ సొన, బాదం, వాల్ నట్, బీన్స్, శనగలు, అవకాడో, బ్రోకలీ వంటివి తింటే చాలు.
4. ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ – తల చర్మానికి తేమను అందించేవి
ఈ కొవ్వులు జుట్టు తేమను సమతుల్యంగా ఉంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి చుండ్రు సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
ఏం తినాలి?
బాదం, వాల్‌నట్,ఆవ నూనె, అవిసె గింజలు, సాల్మన్ చేపలు
5. విటమిన్ E – జుట్టుకు రక్షణ కవచం
విటమిన్ E జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ విటమిన్ కోసం మీరు రెగ్యులర్ గా పొద్దు తిరుగుడు గింజలు, ఆలివ్ ఆయిల్ , పాలకూర, పీనట్ బటర్ లాంటివి తినాలి.
6. విటమిన్ A – తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేది
విటమిన్ A తల చర్మాన్ని తేమగా ఉంచి, పొడిబారడాన్ని నివారిస్తుంది. ఇది సెబం ఉత్పత్తిని నియంత్రిస్తుంది. దీని కోసం క్యారెట్, స్వీట్ పొటాటో, మామిడికాయ, పాలకూర లాంటివి తినాలి.
7. విటమిన్ C – కొలాజెన్ నిర్మాణానికి అవసరం
విటమిన్ C, జింకు, ఐరన్ శోషణకు సహాయం చేస్తుంది. ఇది కాలాజెన్ తయారీని ప్రోత్సహించి జుట్టును బలంగా ఉంచుతుంది. దీని కోసం నిమ్మకాయలు, ఆరెంజెస్, పెరుగు, స్ట్రాబెర్రీలు లాంటివి తింటే చాలు.
8. వాటర్ – తల చర్మానికి తేమను నిలిపే మూలకం
జుట్టు పొడిబారకుండా ఉండటానికి నీరు తాగడం అత్యవసరం. తగినంత నీరు తాగకపోతే తల చర్మం పొడిగా మారి చుండ్రు ఏర్పడుతుంది.
ఎంత తాగాలి?
రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం మంచిది.
9. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే
అవసరమైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటున్నా, అవి సరైన సమయానికి తీసుకోకపోతే ఫలితం తక్కువగా ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మిస్ అవ్వకూడదు. ఇది శరీరానికి ఎనర్జీతో పాటు జుట్టుకు అవసరమైన మొదటి దశ పోషకాలను అందిస్తుంది.
ఇవి మాత్రం తినకూడదు..
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏవి తినాలో తెలియడంతో పాటు.. ఎలాంటివి తినకూడదో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అధిక చక్కెర, ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఆహారాలు, ఆల్కహాల్, కెఫిన్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి జుట్టు నిర్జీవంగా మారడానికి, బలహీనంగా మారడానికి, జుట్టు రాలడానికి కారణం అవుతాయి.
బలమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం మీరు వాడే షాంపూ, ఆయిల్ కంటే కూడా ముఖ్యమైంది మీరు తినే ఆహారం. సహజమైన, ఇంట్లో తినే పోషకాహారాలు మీ జుట్టుకు శాశ్వతంగా బలం ఇస్తాయి. రోజువారీగా మంచి ఆహార అలవాట్లు అలవర్చుకుంటే జుట్టు సమస్యలు దాదాపుగా 60% తగ్గిపోతాయి. అందుకే, జుట్టు సంరక్షణను లోపల్నుంచి మొదలు పెట్టండి.