
చర్మ సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. మరీ ముఖ్యంగా మొటిమలు, మచ్చల వల్ల ముఖం అందం తగ్గిపోతుంది. మచ్చల నివారణకు చాలామంది ఖరీదైన ప్రోడక్టులు వాడుతుంటారు. వాటివల్ల ఒక్కోసారి మేలు జరగకపోగా.. చర్మం మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంతేకాదు వాటిని ఎక్కువగా వాడితే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి చర్మ సమస్యలకు సహజ చిట్కాలు వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి సహజంగా చర్మ సమస్యలను ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ చూద్దాం.
ముఖంపై మొటిమలు, మచ్చలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కాస్త సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంట్లో దొరికే కొన్ని సహజ పదార్థాలతో చర్మ సమస్యలను సులభంగా తగ్గించుకోవచ్చు. అవేంటో.. ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.
నిమ్మ తొక్క:
సాధారణంగా మనం నిమ్మకాయ నుంచి రసం తీశాక.. దాని తొక్కను పడేస్తుంటాం. కానీ నిమ్మకాయ తొక్క చర్మానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి దోసకాయ తొక్కతో కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పేస్ట్ ను మచ్చలు ఉన్న చోట రాసుకోవాలి. ముఖం మీద అయితే కాస్త మందంగా, శరీరం మీద అయితే పలుచగా రాసుకోవాలి. అరగంట తర్వాత శనగపిండితో కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. మచ్చలు తగ్గిపోతాయి. క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖం మీదే కాదు, చేతులు, కాళ్ల మీద కూడా ఈ పేస్ట్ రాసుకోవచ్చు.
కలబంద:
కలబంద గుజ్జులో నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. లేదా కలబంద రసంలో అర టీస్పూన్ నానబెట్టిన మెంతులు కలిపి రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ ని కూడా మచ్చలున్న చోట రాసుకుని అరగంట తర్వాత కడిగేసుకోవాలి. రోజూ చేస్తే మచ్చలు తగ్గిపోతాయి. ఈ పేస్ట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రోజూ పది నిమిషాలు రాసుకుంటే చర్మ సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
ఉత్తరేణి ఆకులు:
ఉత్తరేణి ఆకులను కట్టగా తెచ్చి నీడలో ఆరబెట్టాలి. ఆరిన తర్వాత వాటిని కాల్చి.. ఆ బూడిదను జల్లెడ పట్టుకోవాలి. ఈ బూడిదను నిమ్మరసంలో కలిపి మచ్చల మీద రాసుకుంటే త్వరగా మచ్చలు తగ్గిపోతాయి.
టమాటా రసం:
టమాటా రసంలో రెండు మూడు చుక్కల తేనె కలిపి మచ్చల మీద రాసుకుంటే మచ్చలు, ముడతలు, మొటిమలు తగ్గిపోతాయి.