జాగ్రత్త బిడ్డా... మా దగ్గర పులిబిడ్డ కవితక్క వుంది: షర్మిలకు రేఖానాయక్ మాస్ వార్నింగ్

Nov 30, 2022, 4:50 PM IST

నిర్మల్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని... అలాంటిది ఆయన రాష్ట్రాన్ని ఉద్దరించినట్లు షర్మిల మాట్లాడటం విడ్డూరంగా వుంటుందన్నారు. పులి కడుపున పులే పుడుతుంది అంటావుగా... నువ్వు నిజంగా ఆడపులివే అయితే గిరిజన బిడ్డలకు నీ తండ్రి పాలనలో అన్యాయం జరుగుతుంటే ఎందుకు పట్టించుకోలేదని నిలదీసారు. తెలంగాణ ప్రజలు తరిమికొడితే ఆంధ్రాకు పారిపోయి ఇప్పుడు తెలంగాణలోఓట్లు, సీట్ల కోసమే షర్మిల తిరుగుతోందని రేఖానాయక్ మండిపడ్డారు. షర్మిల పాదయాత్ర కాదు పొర్లుదండాలు పెట్టిన తెలంగాణ ప్రజలు ఆమెను పట్టించుకోరని రేఖా నాయక్ ఎద్దేవా చేసారు. ఊరు పేరు లేని ఆమె నోటికొచ్చినట్లు వాగితే వింటూ ఊరుకోబోమని... సహనాన్ని పరీక్షిస్తే తగినశాస్తి తప్పదని హెచ్చరించారు. జాగ్రత్త బిడ్డా... ఇక్కడ కూడా పులి కడుపున పుట్టిన కవితక్క వుంది అంటూ రేఖా నాయక్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.