మూర్ఖంగా మాట్లాడొద్దు... అన్నం తెలియని చరిత్రెవరిదో తెలుసుకో చంద్రబాబు..: నిరంజన్ రెడ్డి ఫైర్

Feb 27, 2023, 12:20 PM IST

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం తెలిసిందన్న మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ వ్యాఖ్యలతో చంద్రబాబు మూర్ఖత్వం మరోసారి బయటపడిందని... అవగాహనరాహిత్యంతో తెలంగాణపై అహంకారపూరిత వ్యాఖ్యలు తగదని హెచ్చరించారు. చరిత్ర తెలియకుండా చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతున్నారని... అసలు అన్నం గురించి తెలియనిది ఆంధ్రులకేనని చరిత్ర చెబుతోందని అన్నారు.  ‘‘జొన్నకలి, జొన్నయంబలి, జొన్నన్నము, జొన్నపిసరు ఇలా జొన్నలె తప్ప పల్నాటి ప్రజలకు సన్నన్నము సున్నాయే అంటూ ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడి రాసిన పద్యాన్ని మంత్రి గుర్తుచేసారు. కానీ 15 శతాబ్దం నాటికే హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ ప్రఖ్యాతి చెందిందని... వెయ్యేల్లకు పైగా వరి పండించిన జాతి తెలంగాణ అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం 100-110 ఏళ్ల చరిత్ర కలిగిన కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో పండిన వరి భారతదేశంలో మూలం అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. ఈ ప్రాంతాన్ని అవమానించేలా మాట్లాడిన చంద్రబాబు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేసారు.