Mar 18, 2022, 5:06 PM IST
మహారాష్ట్ర: పంట మార్పిడి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, పంట రాబడి తదితర విషయాల గురించి తెలుసుకునేందుకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని ఓ బృందం వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు పర్యటించిన ఈ బృందం తాజాగా మహారాష్ట్రలోని జాల్నా ప్రాంతంలో పర్యటిస్తోంది. అహ్మద్ నగర్ జిల్లాలోని శిరిడీ సమీపంలోని వ్యవసాయ, ఉద్యాన పంటలు, వాటి ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు ద్రాక్ష, జామ తోటలను ఈ బృందం పరిశీలించారు. తెలంగాణ బృందంలో వ్యవసాయ మంత్రితో పాటు ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకట రమణా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ఉద్యానశాఖ జేడి సరోజినిదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ సుభాషిణి తదితరులు వున్నారు. ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ, ఉద్యాన అధికారులు, రైతులతో తెలంగాణ బృందం సమావేశమయ్యింది.