Sep 9, 2019, 12:12 PM IST
రెండవసారి పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సోమవారం నాడు పురపాలకశాఖ విభాగాధిపతులతో మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. మసాబ్ ట్యాంక్ లోని పురపాలక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రస్తుతం ఆయా విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలపైన మంత్రి విభాగ అధిపతులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి విభాగం తన కార్యక్రమాల పురోగతి, భవిష్యత్తు ప్రాధాన్యతలపైన ఒక నివేదిక సమర్పించాలని కోరారు. నూతనంగా పదవీభాద్యతలు చేపట్టిన మంత్రి కెటిఆర్ మొక్కను అందజేసి విభాగాధిపతులు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అలోచనలు, విజన్ మేరకు పనిచేస్తామని అధికారులు మంత్రి కెటియార్ కు తెలిపారు.