Mar 17, 2023, 3:29 PM IST
వికారాబాద్ : అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఇవాళ వికారాబాద్ జిల్లాలో దెబ్బతిన్న పంటలను సహచర మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో పాటు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు నిరంజన్ రెడ్డి. మర్పల్లి, మోమిన్ పేట మండలాల్లో దెబ్బతిన్న పంటలను పొలాల్లోకి వెళ్లి పరిశీలించారు. పంటలు చేతికందివచ్చే సమయంలో ప్రకృతి వైపరిత్యాలు బాధాకరమని... ఈ సమయంలో రైతులు ధైర్యంగా వుండాలని వ్యవసాయ మంత్రి భరోసా ఇచ్చారు. పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా వుంటుందని భరోసా ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారని... ఆయన ఆదేశాల మేరకే క్షేత్రస్థాయి పర్యటన చేపడుతున్నామని నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రతిసారి మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తుంటాయి... కాబట్టి మార్చి లోపే యాసంగి పంటలు చేతికి వచ్చేలా ప్రణాళికబద్దంగా సాగు చేయాలని మంత్రి సూచించారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, సూర్యాపేట ప్రాంతాలలో రైతులు యాసంగి సీజన్ ను నెల ముందుకు జరుపుకున్నారని... రైతులందరూ ఇదే పద్దతి అనుసరించాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.