Jul 28, 2022, 11:18 AM IST
పెద్దపల్లి : గుండెలపై ఆడుకున్న మనవళ్లే ఆ తాత గుండె ఆగిపోయేలా చేసారు. ఆ అవ్వను రక్తపు మడుగులో పడేసి హాస్పిటల్ పాలు చేసారు. ఇలా సొంత మనవళ్లే ఆస్తికోసం వృద్దదంపతులతో అతి దారుణంగా వ్యవహరించి ఒకరి ప్రాణాలను బలితీసుకున్న అమానుషం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన జంగ లింగయ్య(85)-ఓదెమ్మ(80) దంపతులకు రాజమ్మ, వరలక్ష్మి సంతానం. ఇద్దరు ఆడపిల్లలే కావడంతో వారికి పెళ్లిళ్లు చేసిచ్చి తమ పేరిట వున్న రెండెకరాల భూమిని కూడా ఇద్దరికీ సమానంగా పంచారు. అయితే మొత్తం భూమి తమకే కావాలని పెద్దకూతురు రాజమ్మ, ఆమె కొడుకులు నర్ల రవి, సంతోష్ తాత-అమ్మమ్మతో గొడపడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి వారు మరోసారి అమ్మమ్మ ఇంటికి వచ్చి వృద్ద దంపతులతో గొడవపడ్డారు. ఈ క్రమంలో మనవళ్లిద్దరూ అమ్మమ్మ-తాతపై విచక్షణారహితంగా దాడి చేసారు. దీంతో తీవ్ర గాయాలపాలయిన వృద్ద దంపతులను స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లింగయ్య మృతిచెందగా ఓదెమ్మ చికిత్స పొందుతోంది.