Jan 16, 2021, 1:59 PM IST
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్ సందడి జోరుగా సాగుతోంది. వరంగల్ లోని ఎంజిఎం ఆస్పత్రిలో కోవిడ్ వాక్సినేషన్ ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.
నిర్ణీత వైద్యులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మొదటి విడతగా, డాక్టర్ల చేత మంత్రి దగ్గరుండి వ్యాక్సినేషన్ చేయించారు.
ప్రధాని మోడీ, సీఎం కెసిఆర్ ల కృషి వల్ల ఈ రోజు దేశ, మన రాష్ట్ర ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ కోసం 9 నెలలుగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.
ఎంతో ముందుగానే మన దేశంలో వ్యాక్సిన్ కనుక్కోవడం, అవి అందుబాటులోకి రావడం సంతోషించదగ్గ విషయమని మంత్రి అన్నారు. ఈ రోజు నుంచి దేశంలో సహా మన రాష్ట్రంలోనూ కోవిడ్ వ్యాక్సిన్ ని ప్రజలకు ఇస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 139 కేంద్రాల్లో ఈ రోజు వ్యాక్సినేషన్ ని ప్రారంభించామని, ఇది అదృష్టంగా భావిస్తున్నానని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. వరంగల్ పూర్వ జిల్లాలో 21 కేంద్రాల్లో కరోనా నివారణ వ్యాక్సిన్ ఇవ్వడాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో.. 46,579 మంది కరోనా బారిన పడ్డారని, వీరిలో 45,768 మంది కోలుకున్నారని చెప్పారు.
ఈ రోజు వరంగల్ అర్బన్ జిల్లా లో 6, వరంగల్ రూరల్ జిల్లాలో 6, జనగామ జిల్లాలో 2, మహబూబాబాద్ జిల్లాలో 4, ములుగులో 2, భూపాలపల్లి జిల్లాలో 3 కేంద్రాల ద్వారా ప్రజలకు ఉచితంగా టీకాలు వేస్తున్నారని చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో ఈ రోజు 126 మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని, ఒక్కో సెంటర్ లో 30 మంది చొప్పున వేస్తున్నామని చెప్పారు.ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి మొదట వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించామని అన్నారు.
31,299 మందికి అర్బన్ జిల్లాలో వేయాలని ప్రణాళిక సిద్ధం చేశామని, ఉమ్మడి జిల్లాలో 92 ప్రాంతాల్లో వ్యాక్సిన్ ని స్టోరేజీ చేశామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు.
వ్యాక్సిన్లు తీసుకున్న వారిని పర్యవేక్షించేందుకు 18 సెంటర్లు ఏర్పాటు చేశామని, చెప్పారు.మొదటి విడతలో వైద్య సిబ్బందికి, రెండో విడతలో ఫ్రంట్ లైన్ సిబ్బంది, వారియర్స్ కి, ఆ తర్వాత 50 ఏళ్ళు దాటిన వృద్ధులు, ఆతర్వాత 18 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ లోపు వాళ్ళకు వ్యాక్సిన్లు వేస్తున్నామని అన్నారు..
దీర్ఘ కాలిక వ్యాధులున్న వాళ్ళకు కూడా టీకాలు వేస్తామని అన్నారు.18 ఏళ్ళు నిండిన వాళ్ళకు మాత్రమే వ్యాక్సిన్లు వేస్తారమని అన్నారు.
అనంతరం పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో, జనగామ జిల్లా పాలకుర్తిలోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆయా హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.