Nov 23, 2022, 11:16 AM IST
గుడివాడ : వైసిపి పాలనలో కమ్మ సామాజికవర్గానికి అన్యాయం జరుగుతోందని... ప్రస్తుత కేబినెట్ లో కమ్మవారికి మంత్రి పదవి దక్కకపోవడం, ఎన్టీఆర్ హెల్త్ యూనివవర్సిటీ పేరు మార్పు ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. కమ్మ సంఘం సమావేశంలో మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు సొంత కొడుకు వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వైసిపి ని ఇరకాటంలో పెట్టాయి. దీంతో వైసిపి నాయకులు నాగేశ్వరరావు వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వసంత వ్యాఖ్యలను ఖండించారు. మెడికల్ రంగానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విశిష్టమైన సేవలు చేసారు కాబట్టే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి ఆయన పేరు పెట్టినట్లు కొడాలి నాని తెలిపారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా మార్చారు... ఇలా ఎన్టీఆర్ కు సీఎం జగన్ అత్యున్నత గౌరవమిచ్చారని అన్నారు. కమ్మలకు అన్యాయమంటూ మాట్లాడుతున్న పనికిమాలిన వ్యక్తులు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించినప్పుడు ఎందుకు మాట్లాడలేదంటూ మండిపడ్డారు. దౌర్భాగ్యుడు చంద్రబాబు ఎన్టీఆర్ ను గౌరవించకున్నా వైఎస్ జగన్ ఆ పని చేసాడు కదా... ఇప్పుడు మాట్లాడుతున్నవారు కనీసం అప్పుడయినా ఎందుకు కృతజ్ఞతలు తెలుపలేదని మాజా మంత్రి కొడాలి నాని నిలదీసారు.