Galam Venkata Rao | Published: Mar 20, 2025, 4:00 PM IST
విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఉన్న డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించేందుకు చేస్తున్న కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని వైయస్‌ఆర్‌సీపీ విశాఖజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. విశాఖపట్నం పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైయస్‌ఆర్ పేరును తొలగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైయస్‌ఆర్ పేరును తొలగించాలన్న కూటమి ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలను సాగనివ్వమని స్పష్టం చేశారు. వైయస్‌ఆర్ ఆనవాళ్ళను తుడిచేయాలని సీఎం చంద్రబాబు అనుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు.