Aug 17, 2022, 10:41 AM IST
ఈ కలికాలంలో మనుషుల్లో స్వార్ధం పెరిగి మానవత్వం మచ్చుకయినా కనిపించడం లేదు. సాటి మనుషులు బాధలో వున్నా కొందరు పంతానికి పోయి అతి దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇలా పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ వృద్దురాలి అంత్యక్రియులు జరపనివ్వకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో చేసేదేమిలేక వృద్దురాలి పాడెను కుటుంబసభ్యులు, బంధువులు నడిరోడ్డుపై పెట్టిన హృదయ విధారక ఘటన తాజాగా వెలుగుచూసింది. కొమరాడ మండలం కొత్త కల్లికోట గ్రామ స్మశానవాటిక నాగావళి నది వరద నీటిలో మునిగింది. అయితే గ్రామానికి చెందిన ఓ వృద్దురాలు మృతిచెందడంతో పక్కనేవున్న పాత కల్లికోట గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబసభ్యులు సిద్దమయ్యారు. మృతదేహాన్ని స్మశానవాటికకు తరలిస్తుండగా పాత కల్లికోట గ్రామస్తులు అమానుషంగా వ్యవహరించారు. తమ గ్రామంలో దహన సంస్కారాలు చేసేందుకు వీల్లేదంటూ అంతిమయాత్రను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరకు అధికారులు చొరవ తీసుకుని పాత కల్లికోట గ్రామస్తులను సముదాయించి అంత్యక్రియలు జరిగేలా చూసారు