Mar 1, 2023, 10:41 AM IST
నందిగామ : ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల్లోకి వెళుతున్న కొందరు వైసిపి ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇంతకాలం గుర్తుకురాని ప్రజలు ఎన్నికలు దగ్గరపడ్డాకే గుర్తొచ్చారా అంటూ కొందరు, తమకు ఏం చేసారంటూ మరికొందరు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ఇలా తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే జగన్మోహనరావుపై ప్రజలు తిరగబడ్డారు. తమకు ఇళ్లు లేవని కొందరు, వీధుల్లో కరెంట్ స్తంభాలు లేవంటూ మరికొందరు ఎమ్మెల్యేను నిలదీసారు. తమకు ఏం చేసారో చెప్పాలంటూ యువకులు, మహిళలు ఎమ్మెల్యేను నిలదీసారు. తమ ఇళ్లవద్దకు రావద్దని కొందరు ఎమ్మెల్యే మొహంమీదే చెప్పేసారు. దీంతో ఎమ్మెల్యే కూడా సహనం కోల్పోయి ఆవేశంతో ఊగిపోతూ గ్రామస్తులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి ఎమ్మెల్యే అనుచరులు, గ్రామస్తుల మధ్య తోపులాట కూడా జరిగింది. ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యే అనుచరులు, గ్రామస్తులను సర్దిచెప్పి పంపించేసారు.