Mar 6, 2023, 2:05 PM IST
గుంటూరు : రోడ్డు విస్తరణ కోసమంటూ గుంటూరు జిల్లా ఇప్పటంలో కూల్చేసిన ఇళ్లను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారికి జనసేన అండగా వుంటుందని నాదెండ్ల భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్, వైసిపి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
కూల్చివేతలతో మొదలైన వైసిపి ప్రభుత్వం ప్రతిరోజూ ఇదే చేపడుతోందని... వీరు బ్రతికేది అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం కాదని అన్నారు. పేద ప్రజల సంతోషాన్ని చూడటానికి కాకుండా కన్నీరు చూడటానికే పనిచేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. ధైర్యముంటే ఇక్కడికి రండి అంటూ ముఖ్యమంత్రి, వైసిపి నాయకులకు సవాల్ విసిరారు. జనసేన పార్టీతో ఇబ్బంది వుంటే మాతో తేల్చుకోండి... పేద ప్రజలను ఇబ్బందిపెట్టడం ఎందుకని అన్నారు. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని... వైసిపి ప్రభుత్వం ఇంటికి వెళ్లాల్సిందేనని నాదెండ్ల అన్నారు.