Galam Venkata Rao | Published: Mar 2, 2025, 3:00 PM IST
పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సన్నాహాలు మొదలయ్యాయి. సభా ప్రాంగణం వద్ద వేదిక నిర్మాణం పనులను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భూమిపూజ చేసి ప్రారంభించారు. జనసేన ఎమ్మెల్యేలు, ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీ సభ్యులతో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భూమిపూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత నిర్వహిస్తోన్న తొలి ఆవిర్భావ సభ కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్తుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.